ఇపుడు సక్సెస్ అంటే వేరే ఏమీ కాదు. ఆర్థికంగా స్థిరపడటం...అంతే!! మరి దీన్ని సాధించటం అసాధ్యమా? కానే కాదు! అలాగని ఈజీ కూడా కాదు. కావాల్సిందల్లా పక్కా ప్రణాళిక... దాని అమలు. ఇక ఉద్యోగాలు.. ఇళ్లు మారడం, పిల్లలు, రిటైర్మెంట్ లాంటి ఎన్నో సంఘటనలు మన ఆర్థిక లక్ష్యాల్ని ప్రభావితం చేస్తుంటాయి కనక వీటిని కనీసం ఆరు నెలలకోసారైనా సమీక్షించుకుంటూ వెళ్లాలి. మొత్తంగా ఎవ్వరైనా తమ ఆర్థిక ప్రణాళికలో దృష్టి పెట్టాల్సింది ఐదంశాల మీద. ఆ ఐదూ ఏమిటో తెలుసా...?
పెట్టుబడులు..
బ్యాంకు డిపాజిట్ల నుంచి షేర్లు, మ్యూచ్‌వల్ ఫండ్లు, రియల్టీ, బాండ్లు లాంటి అనేక సాధనాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. చిత్ర కళాకృతులు కూడా ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా మారుతున్నాయి. మనం దేన్లో పెట్టుబడి పెట్టాం? ఏ స్థాయిలో పెట్టాం? అనేదే మన ఆర్థిక లక్ష్యాలకు పునాది. ఆదాయం, వయసు, రిస్కు సామర్థ్యం, సాధించదల్చుకున్న ఆర్థిక లక్ష్యాలు... వీటి ఆధారంగా దేన్లో ఎంత ఇన్వెస్ట్ చేయొచ్చో ఒక అవగాహనకు రావచ్చు. పొదుపు కోసమైనా, పెట్టుబడులకైనా ప్రతి నెలా బడ్జెట్‌ను నిర్దేశించుకుని, దానికి కట్టుబడి ఉండాలి. వీలైనంత చిన్న వయసు నుంచే క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తే... చక్రవడ్డీ ప్రయోజనాలను అత్యధికంగా పొందొచ్చు.
పన్నులపై దృష్టి తప్పనిసరి...
సంపాదించినదాన్లో సగం పన్నులే పోతే మిగిలేదేముంటుంది? అందుకే పన్ను ప్లానింగ్ చాలా ముఖ్యం. పన్ను భారం పడకుండా తగిన పెట్టుబడి సాధనాలను ఎంచుకోవాలంటే ట్యాక్స్ ఎక్స్‌పర్ట్‌ల సలహా తీసుకోవాలి. పన్ను భారం తగ్గేలా కొన్నింట్లో ప్రభుత్వం మినహాయింపునిస్తోంది. ఉదాహరణకు పిల్లల స్కూలు ఫీజు, మనపై ఆధారపడిన తల్లిదండ్రుల వైద్య ఖర్చులు, గృహ రుణం, ఇంటి పునర్నిర్మాణం కోసం తీసుకున్న రుణాలపై వడ్డీ... ఇవన్నీ మినహాయింపులున్నవే. సెక్షన్ 80సి కింద మామూలుగానే రూ. 1లక్ష దాకా మినహాయింపు లభిస్తుంది. నిపుణుల్ని సంప్రదిస్తే పన్ను భారం తగ్గకపోదు.
బీమా కవరేజీ...
నేను నిక్షేపంగా ఉన్నా. నాకెందుకు బీమా... అనుకుంటారు చాలామంది. కానీ, మనపై ఆధారపడ్డవారి శ్రేయస్సు కోసం ఇది చాలా ముఖ్యం. వార్షికాదాయానికి కనీసం పది రెట్ల కవరేజి ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు మీ వార్షికాదాయం రూ.10 లక్షలయితే కనీసం కోటి రూపాయల మేర బీమా కవరేజి ఉండాలి. దీన్ని ఎన్నాళ్లకు తీసుకోవాలి? ప్రీమియం ఎంతన్నది వయస్సు, ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
మనీ మేనేజ్‌మెంట్...
ఆదాయ వ్యయాలకు సంబంధించి కచ్చితంగా ఒక బడ్జెట్‌కి కట్టుబడి ఉండాలి. లేనిపక్షంలో ఎంత వస్తోంది, ఎంత పోతోందన్నది తేలదు. బడ్జెట్‌పై అదుపు లేకుంటే అప్పుల్లో కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని సొంత బడ్జెట్‌కు కట్టుబడి ఉంటే ఏ సమస్యా ఉండదు. ఇవన్నీ పాటిస్తే భవిష్యత్ అవసరాల కోసం ఇబ్బంది పడకుండా ధీమాగా రిటైర్ కావొచ్చు.
అత్యవసర నిధి..
ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో, దానికెంత ఖర్చవుతుందో ముందే చెప్పలేం. కాబట్టి.. అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేకంగా కొంత మొత్తాన్ని పక్కన పెట్టుకోవాలి. ఈ నిధి ఎంత ఉండాలంటే... కనీసం మీ నెల జీతం లేదా ఆదాయానికి మూడు నుంచి ఆరు రెట్లుండాలి. ఏ క్షణంలోనైనా విత్‌డ్రా చేయడానికి దీన్ని సేవింగ్స్ ఖాతాలోనే ఉంచుకోవాలి.
సక్సెస్ అంటే స్థిరపడటమే..
Published Fri, Jan 24 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement
Advertisement