స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం | Swadharhome: A helping hand Women | Sakshi
Sakshi News home page

స్వధార్‌హోమ్ వంచితులకు ఆసరా, ఆత్మవిశ్వాసం

Published Fri, Nov 22 2013 12:52 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM

Swadharhome: A helping hand Women

ఏ అమ్మాయీ తనకై  తాను ఇల్లొదిలి వచ్చేయదు.
 ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు.
 ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు.
 ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు.
 ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు.
 మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా....
 తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి.
 కానీ ఇలాంటి అమ్మాయికి...
 దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి...
 తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు.
 కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు.
 ఎవరి భయం వారిది. ఎవరి కారణాలు వారివి.
 అయితే జయశ్రీ భయపడలేదు.
 ఏ కారణమూ ఆమెను వెనుకంజ వెయ్యనివ్వలేదు.
 ఇల్లొదిలొచ్చిన పిల్లెవరైనా మా ఇంటి పిల్లే అని...
 పట్టెడన్నం పెడుతోంది. పచ్చని జీవితాన్నీ ఇస్తోంది.
 వంచితులకు ఆమె పంచుతున్న అనురాగం, ఆత్మవిశ్వాసమే... ఈవారం జనహితం.

 
తమ వాళ్ల నుంచి తప్పిపోయినవారు, ట్రాఫికింగ్ నుంచి తప్పించుకున్నవారు, వంచనకు గురయినవారు, వివిధ కారణాలతో ఇళ్ల నుంచి పారిపోయి వచ్చినవారు... ఇలా రకరకాల కారణాలచేత సమాజానికి దూరమై ఏం చేయాలో పాలుపోని ఒంటరి స్త్రీలకు కరీంనగర్‌లోని ‘స్వధార్‌హోమ్’ కొండంత అండగా నిలుస్తోంది. వారికి పట్టెడన్నం పెట్టడంతో పాటు పచ్చటి జీవితాన్ని కూడా ప్రసాదిస్తోంది. ‘బాధిత స్త్రీల పునరావాస కేంద్రం’ పేరుతో ఉన్న ఈ హోమ్‌ని నడిపిస్తోన్న జయశ్రీ ‘ప్రకృతి’ అనే స్వచ్ఛందసంస్థలో భాగంగా ఎనిమిదేళ్లక్రితం స్వధార్ హోమ్‌ని ఏర్పాటుచేశారు. అప్పటినుంచి బాధిత స్త్రీలకు అండగా నిలుస్తూ... వారికి ఆత్మవిశ్వాసం కలిగించి, సమాజానికి మళ్లీ కొత్తగా పరిచయం చేస్తున్నారు.
 
 ‘ప్రకృతి’ నీడలో...
 
 సమాజం పంచభూతాలకు అండగా నిలబడకపోతే ప్రకృతి పచ్చగా ఉండలేదంటారు జయశ్రీ. అందుకే మొక్కలు నాటడం వంటి పనులతో పచ్చదనాన్ని పోషిస్తూనే... 1997లో ‘ప్రకృతి’ పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థని నెలకొల్పి, మహిళా సంక్షేమం, స్వయం ఉపాధి శిక్షణల కోసం పనిచేస్తున్నారు. ఇందులో భాగంగానే మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వరంలో నడుస్తోన్న స్వధార్ హోమ్‌ని తన సొంతిల్లులా భావించి బాధిత మహిళలకు బంగారు భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారు.

‘‘స్వధార్ హోమ్‌లో ఒక్కో మహిళది ఒక్కో కష్టం. వారిని సమస్యల నుంచి బయటపడేయడమే కాకుండా, సమస్యల్ని ఎదుర్కొనేలా కూడా తీర్చిదిద్ది, కొత్త జీవితాలివ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 350 మంది ఇక్కడ ఆశ్రయం పొందారు. ప్రస్తుతం హోమ్‌లో 50 మంది మహిళలున్నారు. వీరిలో పదేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసువారున్నారు’’ అంటూ తమ సంస్థ గురించి వివరించారు జయశ్రీ. లా చదివిన జయశ్రీకి విద్యార్థి వయసు నుంచే సేవాకార్యక్రమాల పట్ల ఆసక్తి ఉండేది. ప్రస్తుతం ఒక ప్రైవేటు పాఠశాలను నిర్వహిస్తూ, ‘ప్రకృతి’ అనే ఎన్‌జీవోని నడుపుతున్నారు.
 
 ఆశ్రయంతో పాటు...
 
 ‘‘2005లో స్వధార్ హోమ్ స్థాపించాక... దాని గురించి జిల్లా ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాను. చిత్రం ఏమిటంటే... ఆ అవసరం లేకుండానే బాధిత మహిళలు ఒక్కొక్కరుగా హోమ్‌కి రావడం మొదలుపెట్టారు. అత్యాచారానికి గురైన ఓ నలుగురు అమ్మాయిలకు ఇక్కడే ఆశ్రయం కల్పించాం. వారిలో ఇద్దరు... తిరిగి వారి ఇళ్లకు వెళ్లిపోయారు. మరో అమ్మాయికి మతిస్థిమితం లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయింది. ఇంకో అమ్మాయి కూరగాయల షాపు పెట్టుకుని తన బతుకు తాను బతుకుతోంది.
 
అత్తింటి వేధింపులు భరించలేక మా హోమ్‌కి చేరుకున్న మహిళలకు, ఆమె భర్త, అత్త్తమామలకు కౌన్సెలింగ్ చేయడం... ఉమ్మడి కుటుంబంలో కాపురం కష్టమనుకుంటే మేమే దగ్గరుండి వేరు కాపురం పెట్టించడం, అయినా భర్త నుంచి బాధలు తప్పడం లేదంటే మా హోమ్‌లోనే కొన్నాళ్లు ఉంచి వారి కాళ్లమీద వారు నిలబడేలా ఏదైనా వృత్తిశిక్షణ ఇప్పించడం వంటి పనులు చేస్తున్నాం. భర్త చనిపోయిన మహిళల్లో కొందరు... అందరూ ఉన్న అనాథల్లా ఉన్నారు. వీరినే కాదు, పట్టెడన్నం పెడితే చాలంటూ వచ్చే వృద్ధులను కూడా స్వధార్ హోమ్ అక్కున చేర్చుకుంటోంది. ఏదో ఒక పనిచేసుకుని బతికే ఓపిక ఉన్నవారితో వారికిష్టమైన పనిచేయిస్తున్నాం. అలా ఓ నలుగురు వృద్ధులు ఇక్కడే కూరగాయలు అమ్మి పొట్ట పోసుకుంటున్నారు’’ అంటూ తన హోమ్‌కి వచ్చిన మహిళల గురించి చెప్పారు జయశ్రీ.
 
 చదువు... ఉపాధి...
 
 స్వధార్ హోమ్‌లో పెద్దవాళ్లే కాదు, విద్యార్థులు సైతం ఉన్నారు. ‘‘తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లలతోపాటు విద్యార్థి వయసులోనే ప్రేమ పేరుతో ఇంటి నుంచి పారిపోయి వచ్చిన అమ్మాయిలు కూడా ఉన్నారు. వారికి కౌన్సెలింగ్ చేసి వారి తల్లిదండ్రులకు అప్పగించేవరకూ జాగ్రత్తగా చూసుకుంటున్నాం. పెద్దవాళ్ల పరిస్థితి పక్కన పెడితే చిన్నపిల్లలను ఏళ్ల తరబడి మా దగ్గరే పెట్టుకుని చదువు చెప్పించి, వారికి దారి చూపించడం కొంచెం కష్టమైన పనే. నిజానికి స్వధార్ హోమ్ గైడ్‌లైన్స్ ఏంటంటే... ఇక్కడికి వచ్చిన బాధిత మహిళలు మూడు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకూ ఉండొచ్చు. ఆ లోపు వారికి ఉపాధిమార్గం చూపించి బయటికి పంపేయాలి. పిల్లలు చదువులో పడ్డాక వారు సెటిల్ అవ్వడానికి ఏళ్ల సమయం పడుతుంది. వారిని మధ్యలోనే మీ దారి మీరు చూసుకోండంటే ఎక్కడికి వెళతారు? అందుకే మేం ఆ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వడంలేదు. ఇన్ని నెలలు... ఇన్ని సంవత్సరాలు అనే నిబంధనలు పెట్టుకోకుండా వచ్చినవారి పరిస్థితిని బట్టి ప్లాన్ చేసుకుంటున్నాం.
 
  ఇక్కడ మీకు ఒక కేసు వివరాలు చెబుతాను... స్వప్న అనే అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. ఏడోతరగతిలో ఉండగానే మేనమామ మహారాష్ట్రకు చెందిన ఓ నలభైఏళ్ల వ్యక్తికిచ్చి పెళ్లి చేసేశాడు. అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయిని అతను మరోవ్యక్తికి అమ్మడానికి ప్రయత్నిస్తుంటే విషయం అర్థం చేసుకున్న స్వప్న వెంటనే కరీంనగర్‌లో ఉన్న స్నేహితురాలికి ఫోన్ చేసింది. ఆమె ఆ ఊరి సర్పంచ్‌కి తెలియజేస్తే అతను మా చెవిన వేశాడు. మేం పోలీసుల సాయంతో మహారాష్ర్ట నుంచి మా హోమ్‌కి రప్పించుకుని, స్కూల్‌లో చేర్పించాం. ప్రస్తుతం తను నర్సింగ్ ఫైనలియర్ చదువుతోంది. కొంత ప్రభుత్వసాయం, కొందరు దాతల చేయూతతో హోమ్‌ని నడుపుతున్నాం. ఇక్కడికి వచ్చే బాధిత మహిళల సంఖ్య అంతకంతకూ పెరుగుతుండడంతో హోమ్ కెపాసిటి పెంచాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రయత్నాలు చేసుకుంటున్నాను’’ అని ముగించారు జయశ్రీ.
 
 ఆ హోమ్‌కి వెళ్లేంతవరకే బాధ. అక్కడున్న మహిళల సమస్యలు తెలుసుకున్న తోటివారు తమ బాధల్ని మరిచిపోతారు. కాని హోమ్ నిర్వాహకులకు మాత్రం ఒక్కో మహిళా ఒక్కో ఛాలెంజ్. లేదంటే వారి సమస్యల్ని పరిష్కరించి వారిని తిరిగి మళ్లీ జీవితంలో స్థిరపర్చడం అంత తేలికైన విషయం కాదు. ఆ పూటకు ఆశ్రయం కల్పించమని వచ్చిన మహిళలకు భరోసా గల భవిష్యత్తుని ఏర్పాటుచేస్తున్న ఈ స్వచ్ఛంద సంస్థ లక్ష్యాలు నెరవేరాలని కోరుకుందాం.
 
 - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 ఫొటోలు: ఎస్. ఎస్ ఠాగూర్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement