
సప్తమోక్షపురులలో ఒకటిగా కీర్తిగాంచిన కాంచీనగరం నుండి ఎంతోమంది మహనీయులు భరతజాతికి ఆధ్యాత్మిక వెలుగులను ప్రసరింప జేసారు. ఈ క్షేత్రమహత్యాన్ని గుర్తించిన శంకర భగవత్పాదులు కంచికామకోటి పీఠాన్ని స్థాపించారు. ఈ పీఠాన్ని అధిరోహించి పీఠానికి వన్నె తెచ్చిన వారిలో చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు ఒకరు.1894వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం విల్లుపురం గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి–మహాలక్ష్మి దంపతులకు జన్మించారు శ్రీస్వామినాథన్. అబ్బాయి జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు... భవిష్యత్తులో ఈ పిల్లవాడు జగద్గురువుగా ప్రఖ్యాతి పొందుతాడని చెప్పారు. ఆ మాటలను నిజంచేస్తూ ఆ పిల్లవాడే కంచి కామకోటి పీఠానికి 68వ ఆచార్యునిగా ఆధిపత్యాన్ని స్వీకరించి భక్తుల చేత కంచిపరమాచార్యగా గౌరవ మన్ననలను పొందారు. వారే శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు.
13సంవత్సరాల పసిప్రాయంలో పీఠాధిపత్య బాధ్యతలను స్వీకరించిన స్వామివారు అటు పీఠబాధ్యతలను, ఇటు ధర్మబోధనలను ఏకకాలంలో సమర్థంగా నిర్వహించేవారు. వీరి బోధనలకు ఆకర్షితులైన ఎంతోమంది వీరి దర్శనం లభిస్తే చాలు... జన్మధన్యమైందని భావించేవారు. దేశ, విదేశీ రాజకీయ, చారిత్రక, మతప్రముఖులు, ఇలా భిన్న రంగాలవారు స్వామివారిని సందర్శించి, వారితో చర్చించి తమ అభిప్రాయాలను పంచుకునేవారు. స్వామివారు తమదైన శైలిలో చెప్పిన సమాధానంతో వారంతా సంతృప్తికరమైన భావనతో తిరిగి వెళ్ళేవారు. ఈ సంఘటనలన్నీ స్వామివారి సామాజిక స్పృహకు తార్కాణంగా నిలుస్తాయి.కనీస అవసరాలకై ఎదురుచూసే ఎంతోమంది అభాగ్యులకు సేవచేయడం కూడా పరమేశ్వరారాధనే అవుతుంది. దానివల్ల ఆత్మతప్తి కలుగుతుంది. ఇతరుల బాగుకోసం చేసే పనిలో కలిగే బాధైనా ఆనందాన్నే మిగులుస్తుందనేవారు నడిచే దైవంగా పేరొందిన పరమాచార్యస్వామివారు.
అప్పాల శ్యామప్రణీత్ శర్మ అవధాని
వేదపండితులు