ప్రాణం తీసిన డైటింగ్
నాజూగ్గా అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. సన్నబడాలనే కోరిక మంచిదే గాని...దాని కోసం చేసే ప్రయత్నాలే ప్రాణం మీదికి తెస్తున్నాయి. పీచెస్ గెడాఫ్... బ్రిటన్‌కి చెందిన ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, పాత్రికేయురాలు. ఈ నెల ఏప్రిల్ 7వ తేదీన మరణించింది. కొందరు ఆత్మహత్య అనుకున్నారు. ఇంకొందరు హత్య అనుకున్నారు. పాతికేళ్ల గెడాఫ్ ఆకస్మిక మరణం అందరికీ ప్రశ్నార్థకంగా మారిన సమయంలో పోస్టుమార్టం రిపోర్టు వివరాలు బయటికొచ్చాయి. కేవలం ఆమె పాటించిన ఆహారనియమాలే ఆమె ప్రాణాన్ని బలిగొన్నాయని చెప్పగానే ప్రపంచం మొత్తం నోరెళ్లబెట్టింది.
ఇది నిజమా! అంటూ చాలామంది వైద్యుల్ని సంప్రదించడం కూడా మొదలుపెట్టారు. ఇంతకీ గెడాఫ్ చేసిన పొరపాటేమిటంటే... రోజు మూడు గ్లాసుల పళ్లరసాలు తాగుతూ బతికేద్దామనుకోవడం. గత ఏడాది ఇదే సమయానికి గెడాఫ్ ఒక ట్వీట్ చేసింది. ‘నేను రోజురోజుకీ బరువు పెరుగుతున్నాను... వైద్యుల్ని సంప్రదిస్తే కారణం నేను ఇష్టంగా తినే ‘జంక్‌ఫుడ్’ అన్నారు. ఇక నుంచి నా ఆహారనియమాలను మార్చేసుకుంటున్నాను...’ అని చెప్పింది. కేవలం పళ్ల్లరసాలు...మధ్యలో చిప్స్‌వంటివి తింటూ గడిపేస్తున్న గెడాఫ్ చూస్తుండగానే బరువు తగ్గిపోయింది.
ఇద్దరు పిల్లల తల్లయిన గెడాఫ్ రెండో అమ్మాయి పుట్టినపుడు బాగా బరువు పెరిగింది. బాలింతగా వున్న సమయంలో తల్లి బరువుగా ఉండడం సహజమని స్నేహితులు చెప్పినా వినిపించుకోకుండా కఠిన నియమాలకు సిద్ధ్దమైపోయింది గెడాఫ్. పూర్తిగా ఘనపదార్థాలకు దూరంగా ఉండడం వల్ల ఆమె శరీరంలో పోషకాలు పూర్తిగా లోపించాయి. దాంతో రక్తహీనత, ఐరన్ లోపం ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు.
ఊపిరితిత్తులకు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వల్ల గెడాఫ్ మరణించిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. ‘గెడాఫ్ మరణం ఓ పాఠం’ అంటున్నారు పోషకాహార నిపుణులు. నిజమే... ఆరోగ్యాన్ని నిర్ణయించేది బరువొక్కటే కాదు... మన అవయవాల పనితీరు కూడా. మన ఆరోగ్య పరిస్థితి కూడా. బరువు తగ్గాలనుకునేవారు తగినంత వ్యాయామం చేస్తూ...వైద్యుల పర్యవేక్షణలో బరువుతగ్గే ప్రయత్నాలు చేస్తే మంచిది.
సొంతనిర్ణయాలు ప్రమాదం...
బరువు తగ్గాలనుకోవడం ఆరోగ్యకరమైన విషయమే కానీ, అకస్మాత్తుగా తగ్గిపోవాలని కోరుకోవడం, సొంత నిర్ణయాలతో అద్భుతాలు సృష్టించాలనుకోవడం మాత్రం ప్రాణాలతో చెలగాటమాడడమే. ఒక్క గెడాఫ్ విషయమనే కాదు....అలాంటివాళ్లు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అకస్మాత్తుగా బరువు తగ్గిపోవాలనుకోవడం కూడా ఒక మానసిక జబ్బే.
పళ్ల రసాలు, అల్పాహారాలు తిని కూడా బతకొచ్చు. అవి కేవలం తాత్కాలిక శక్తిని ఇస్తాయి. దీర్ఘకాలంలో వచ్చే దుష్పలితాలు చాలా భయంకరంగా ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో తగినంత ఘనపదార్థం లేకపోతే కొంతకాలం తర్వాత మన శరీరంలోని అవయవాల పనితీరులో మార్పు వచ్చేస్తుంది. రక్తహీనత, నీటిశాతం తగ్గిపోవడం, ఆక్సిజన్ లోపం, ఐరన్ లోపం... మొదలవుతాయి.
ఒక్కసారి అవయవాల పనితీరులో మార్పు వచ్చిందంటే మళ్లీ వాటిని బాగుచేసుకోవడం చాలా కష్టం. కాబట్టి...మీరు బరువు తగ్గాలనుకుంటే వైద్యుల్ని సంప్రదించండి. మీ వయసు, శరీరతత్వం... వంటి విషయాల్ని దృష్టిలో పెట్టుకుని ఆహారనియమాలను సూచిస్తారు. దానికి తగ్గట్టుగా బరువుతగ్గే ప్రయత్నాలు వికటించే అవకాశం ఉండదు.
- సుజాత, చీఫ్ న్యూట్రిషనిస్ట్, కేర్ ఆసుపత్రి, హైదరాబాద్.