టాంజానియా నైసర్గిక స్వరూపం
ప్రపంచ వీక్షణం
వైశాల్యం: 9,47,303 చదరపు కిలోమీటర్లు, జనాభా: 4,75,000,000 (తాజా అంచనాల ప్రకారం), రాజధాని: డొడొమా, ప్రభుత్వం: యూనిటరీ ప్రెసిడెన్షియల్ కాన్‌స్టిట్యూషనల్ రిపబ్లిక్, భాషలు: స్వాహిలీ, ఇంగ్లిష్, కరెన్సీ: టాంజానియా షిల్లింగ్, మతాలు: క్రైస్తవులు 40%, ముస్లిములు 23%, హిందువులు 2%, ట్రైబల్ తెగలు 23%. వాతావరణం: వేడి, ఉక్కపోత వాతావరణం-19-31 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది, స్వాతంత్య్రం: 1961, డిసెంబర్ 9 పంటలు: మొక్కజొన్న, పత్తి, కాఫీ, సిసల్, లవంగాలు, కొబ్బరి, పొగాకు, కసావా, పరిశ్రమలు: వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, దుస్తులు, సిమెంటు, చమురు శుద్ధి, ఎగుమతులు: పత్తి, కాఫీ, లవంగాలు, కొబ్బరి ఉత్పత్తులు, వజ్రాలు, సిసర్, సరిహద్దులు: కెన్యా, ఉగండా, రువాండా, బురుండి, కాంగో, జాంబియా, మలావి, మొజాంబిక్, హిందూమహాసముద్రం.
చరిత్ర: జర్మనీ రాజులు క్రీ.శ. 1880లో టాంజానియాను ఆక్రమించారు. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ వాళ్లు ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. 1964 వరకు బ్రిటిష్ వాళ్లే ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. అప్పటికి ఈ ప్రాంతం పేరు టాంగన్యికా. దీనికే జాంజిబార్ అనే పేరు కూడా ఉండేది. 800 కిలోమీటర్ల హిందూ మహాసముద్ర తీరం పామాయిల్ చెట్లతో నిండి ఉంటుంది. విక్టోరియా, టాంగాన్యికా, మలావి, రుక్వా, ఇయాసీ, నాట్రాన్... సరస్సులు దేశంలో నెలవై ఉన్నాయి. ఇక ప్రపంచంలోనే అద్భుతమైన కొండలు ఈ దేశంలో ఉన్నాయి. వీటిని కిలిమంజారో కొండలు అంటారు. ప్రపంచంలోనే పొడవైన నది నైలు, దానితోపాటు జైరే నదులు ఈ దేశంలో పారుతున్నాయి. అలాగే అతిపెద్ద అగ్ని పర్వతం బద్దలైన పెద్దగొయ్యి కూడా ఈ దేశంలోనే ఉన్నాయి. విక్టోరియా సరస్సు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద సరస్సు. 12వ శతాబ్దంలో ఇక్కడ బానిసల వ్యాపారం జరిగేదని చరిత్ర చెబుతోంది. అరబ్బులు తమ పనులకోసం ఈ ప్రాంతం నుండే బానిసలను కొనుక్కొని వెళ్లేవారు. దేశంలో వందల, వేల సంవత్సరాల చారిత్రక ఆధారాలు ఎన్నెన్నో ఈ దేశంలో బయటపడ్డాయి.
పరిపాలనా పద్ధతులు: పరిపాలనా పరంగా దేశాన్ని మొత్తం 30 రీజియన్లు గా విభజించారు. 25 రీజియన్లు దేశంలో ఉండగా మిగిలిన ఐదు హిందూమహాసముద్రంలో ఉన్న జాంజిబార్ దీవిలో ఉన్నాయి. ఈ రీజియన్లను 169 జిల్లాలుగా విభజించారు. దేశం మొత్తానికి రాష్ట్రపతి ఉంటాడు. అలాగే జాతీయ శాసనసభ కూడా ఉంటుంది. ప్రధానమంత్రి కూడా ఉంటాడు. దేశంలో బాగా జనాభా కలిగిన నగరాలు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి- ఒకప్పటి రాజధాని నగరం దార్ ఎస్ సలామ్, ప్రస్తుత రాజధాని డొడొమా, ఇంకా ఆరుష, గీటా, బుకోబా, కిగోమా, మోషి, బబాటె, ముసోమా, ఎంబేయా, మొరోగోరో, మౌంట్‌వవారా, ఎంవాంజా, కిబాహ, సుంబవంగ, సోంగియా, షిన్యాంగా, బరియాది, సింగిడా, తబోరా, టాంగా, జాంజిబార్ సిటీ మొదలైనవి.
ప్రజలు-సంస్కృతి-సంప్రదాయాలు: దేశజనాభాలో 95 శాతం ప్రజలు బాంటు మూలం కలిగిన వారే. అయితే దేశం మొత్తంలో 126 తెగల ప్రజలు ఉన్నారు. వీటిలో సుకుమ తెగ అత్యధిక జనాభా కలిగి ఉంది. వీరు ఉత్తరాన ఉన్న విక్టోరియా సరస్సు ప్రాంతంలో ఉంటారు. ప్రజల్లో అధికభాగం వ్యవసాయం చేస్తారు. హద్‌జాపి అనే తెగవాళ్ళు కేవలం వేటాడి జీవనం కొనసాగిస్తారు. మసాయి తెగవాళ్లు ఎక్కువగా జంతుపోషణ చేస్తారు. ఏ కుటుంబంలో జంతువులు అధికంగా ఉంటే ఆ కుటుంబం గొప్పది అని భావిస్తారు. 50 శాతం మంది పిల్లలు పాఠశాలలకు వెళతారు. ప్రజలు స్వాహిలి, ఇంగ్లిష్ భాషలు ఎక్కువగా మాట్లాడతారు. అయితే అనేక తెగలు ఉన్నందున వారివారి స్వీయ భాషలు ఉన్నాయి. ఇలాంటివి 100కు పైగా భాషలు ఉన్నాయి.
మహిళలు స్కర్టులు, నైటీలాంటి దుస్తులు ధరిస్తారు. తలకు రుమాలు చుట్టుకుంటారు. ఎక్కువగా వ్యవసాయపనులు చేస్తారు. పురుషులు ప్యాంటు, షర్టు ధరిస్తారు. టాంజానియా ప్రజలు కొబ్బరిపాలు ఎక్కువగా తాగుతారు. వరి అన్నం, ఉగాలి, చపాతి తింటారు.
చూడదగిన ప్రదేశాలు
1. రాతినగరం: ఈ రాతి నగరం జాంజిబార్ ద్వీపంలో ఉంది. పూర్వకాలంలో అరేబియన్లు ఇక్కడ నిర్మించుకున్న చిన్న చిన్న ఇళ్ళు, ఇరుకైన సందులు ఈ నగరానికి ఒక ప్రత్యేకతను సంతరించి పెట్టాయి. దాదాపు అన్ని ఇళ్లను రాళ్ళతోనే నిర్మించారు. ఈ ఇళ్ళను 19వ శతాబ్దంలో కట్టారు. ఆ కాలం లో హిందూమహా సముద్రంలో స్వాహిలి తెగవాళ్ళు ఇక్కడి నుండే వ్యాపారం చేసేవారు. దాంతో ఇది అప్పట్లో స్వాహిలి నగరంగా పేరుగాంచింది. ఆ కాలంనాటి కట్టడాలు నేటికీ సురక్షితంగా ఉన్నాయి. కొన్ని భవనాలు నేడు మ్యూజియంలుగా మారి ఉన్నాయి. ఈ నగరంలో రెండు పురాతన చర్చిలు కూడా ఉన్నాయి. క్రీక్ వీధిలో నడుస్తుంటే రెండువైపులా రాతి ఇళ్ళు సహజరూపంలో కనిపిస్తాయి. ఈ నగరంలో సెంట్రల్ దరజాని మార్కెట్, బీట్‌ఎల్ అమని, సిటీహల్, ఆంగ్లికన్ కాథడ్రల్, ఫోరోధూని గార్డెన్‌లు, పీపుల్స్ పాలెస్, ఓల్డ్ ఫోర్ట్, పర్షియన్‌బాత్ ఇలా ఎన్నో అద్భుత కట్టడాలను చూడవచ్చు.
2. దార్ ఎస్ సలామ్: ఈ నగరం ఒకప్పుడు చేపలు పట్టి జీవించే బెస్తవారి పల్లెటూరు. ఇప్పుడు టాంజానియా దేశానికి రాజధానిగా మారిపోయింది. ప్రపంచంలోని చాలా దేశాలకు నేడు ఈ నగరం సముద్ర మార్గ ప్రదేశంగా ఉంది. ఆఫ్రికా ఖండంలో ఎంతో బిజీగా ఉండే ఓడరేవు ఇక్కడే ఉంది. మొత్తం దేశంలో ఈ నగరమే అతిపెద్దది. ఇక్కడ జనాభా 43 లక్షలపైగా ఉంది. ఓడరేవు చుట్టూ ఉండే నగరం పాతనగరం. నగరానికి ఉత్తరం వైపున వివిధ దేశాల ఎంబసీలు, ప్రభుత్వ కార్యాలయాలు నెలకొని ఉన్నాయి. ఈ నగరం ఒక పెద్ద వ్యాపార కేంద్రం కావడం వల్ల అనేక దేశాల నుండి ఇక్కడికి వ్యాపారం కోసం ఎంతో మంది వస్తూ పోతూ ఉంటారు. దాంతో ఈ నగరంలో ఉన్న విమానాశ్రయం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది.
ఈ నగరానికి పూర్వపు పేరు ఎంజిజిమా, నగరంలో ఉన్న 35 అంతస్తుల రెండు భవనాలు గొప్ప ఆకర్షణగా కనిపిస్తాయి. ఇవి జంట టవర్లుగా ప్రసిద్ధికెక్కాయి. ఈ నగరంలో అయిదు మ్యూజియంలు ఉన్నాయి. వీటిల్లో విలేజి మ్యూజియం చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ 16 తెగలకు చెందిన పూరి గుడిసె నివాసాలు ఉన్నాయి. హిందూమహా సముద్రతీరంలో ఉన్న కారణంగా సముద్రతీరం బీచ్‌లు ఈ నగరానికి ప్రత్యేక ఆకర్షణ. ఎంససాని, కిగంబోని బీచ్‌లు చూడదగ్గవి. ఈ నగరంలో ఏడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.
3 . కిలిమంజారో పర్వతం: టాంజానియా దేశంలో ఉన్న కిలిమంజారో పర్వతం ఒక గొప్ప పర్యాటక ప్రదేశం. ఈ పర్వతాన్ని సంవత్సరంలో ఏ రోజైనా ఎక్కవచ్చు. ఇక్కడ వాతావరణం పర్యాటకులకు అనుకూలంగా ఉంటుంది. కిలిమంజారో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ఈ పర్వతం ఒక మిలియన్ సంవత్సరాల క్రితం ఉప్పొంగిన అగ్నిపర్వతం కారణంగా ఏర్పడింది. ఈ పర్వతం మూడంచెలుగా ఉంటుంది. మొదటి భాగాన్ని షీరా అని, రెండోదాన్ని కీబో అని, మూడోదాన్ని మావెంజి అంటారు. అత్యధిక ఎత్తై ప్రదేశాన్ని ఉహురు శిఖరం అంటారు. ఈ ప్రాంతమంతా కిలిమంజారో జాతీయ పార్కుగా అభివృద్ధి చేయబడి ఉంది. ఇక్కడ అడవిదున్నలు, చిరుతలు, కోతులు, ఏనుగులు, ఇంకా ఎన్నో రకాల పక్షులు మనకు దర్శనమిస్తాయి. రాజధాని దార్‌ఎస్‌సలామ్ నుండి నేరుగా కిలిమంజారో వెళ్ళవచ్చు.
4. ఎన్ గొరొంగోరో సంరక్షణా ప్రాంతం: ఇది సెరంగేటి పర్వతం మరియు మాన్యారా సరస్సు మధ్య ప్రాంతంలో ఉంది. ఇది ఎన్‌గోరొంగోరో క్రేటర్‌కు ప్రసిద్ధి. ఇక్కడ వన్యప్రాణులు అత్యధికం. ఇక్కడ అగ్నిపర్వతం బద్దలై ఏర్పడిన గొయ్యి చాలా విశాలంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం పొడవునా నీరు ఉంటుంది. ఈ ప్రాంతంలో ఉన్న ఓల్డువాయి జార్జ్ అనే ప్రాంతం ఒక పురాతత్వ ప్రదేశం. ఇక్కడ మానవ పరిణామంలో మొదటి మానవుడిగా చెప్పబడే పుర్రె, ఇతర శరీర ఎముకలు ఉన్నాయి.
ఎన్ గొరొంగోరో గొయ్యి ప్రపంచంలోనే పెద్ద గొయ్యి, ఇది దాదాపు మూడు మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ ప్రాంతంలో పులులు, సింహాలు ఇతర జంతువులను వేటాడడం మనం ప్రత్యక్షంగా దర్శించవచ్చు. ఇక్కడే దాదాపు ఒకటిన్నర మిలియన్ సంవత్సరాల క్రితం ఆదిమానవులు ఉపయోగించిన ఆయుధాలు ఉన్నాయి. ఇలాంటి వాటిఆధారంగానే శాస్త్రవేత్తలు మానవుడు 2 మిలియన్ సంవత్సరాల క్రితమే ఉన్నాడని నిర్ధారణ చేయగలిగారు.
ప్రకృతి-పర్యావరణం: టాంజానియా దేశంలో మొత్తం 16 జాతీయ పార్కులు ఉన్నాయి. ఇవేకాకుండా ఎన్‌గోరోంగోరో కన్సర్వేషన్ ప్రాంతం, గోంబే స్ట్రీమ్ జాతీయపార్కులు ఉన్నాయి. ఈ పార్కులలో 130 రకాల ఉభయచరాలు, 275 రకాల పాములు ఉన్నాయి. ఎన్నో రకాల అడవి జంతువులు ఈ దేశంలో ఉన్నాయి.