తమ్ముళ్లూ..జర జాగ్రత్త!
టీనేజ్‌లోనే మందుకు బానిసైన వారు ఆరోగ్యం, సామాజిక కోణాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి చెందిన దేశాలలోని అనుభవాలు చెబుతున్నాయి.
టీనేజర్లలో గతంలో కంటే ఎక్కువగా మందు కొట్టే అలవాటు మన దేశంలో పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి తెలియజేస్తుంది. ముఖ్యంగా పట్టణ ప్రాంత మేల్ టీనేజర్లు మందు కొట్టడంలో ముందున్నారు. కొలంబియా యూనివర్శిటీకి చెందిన అరవింద్ పిళ్ళై బృందం ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ‘‘1956-1960 మధ్య కాలంలో 19.5 శాతం మేల్ టీనేజర్లు మందుకొట్టేవారు. ప్రస్తుతం అది 70 శాతానికి మించిపోయింది’’ అంటున్నారు అరవింద్.
‘ఏ వయసులో మొదట మందు కొట్టారు?’, ‘ఎంత పరిణామంలో తాగారు?’, ‘ఏవైనా ప్రమాదాలు జరిగాయా?’, ‘ఇప్పుడు ఎంత తాగుతున్నారు?’ మొదలైనవి ప్రశ్నావళిలో ఉన్నాయి. కేవలం మద్యానికి సంబంధించినవే మాత్రమే కాకుండా మద్యపాన సమయంలో మానసిక స్థితిగతులను అంచనా వేయడానికి సంబంధించిన ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి.
‘‘ఒకప్పుడు సంపన్నదేశాల టీనేజర్లలో మందు కొట్టే అలవాటు ఉండేది. ఇప్పుడు అభివృద్ధి, వెనకబాటుతనంతో సంబంధం లేకుండా దాదాపుగా అన్ని దేశాల టీనేజర్లలోనూ ఈ జాడ్యం పెరిగిపోయింది’’ అంటున్నారు అరవింద్. టీనేజ్‌లోనే మందుకు బానిసైన వారు ఆరోగ్యం, సామాజిక కోణాలలో చాలా ఇబ్బందులు పడుతున్నారని అభివృద్ధి చెందిన దేశాలలోని అనుభవాలు చెబుతున్నాయి. ఆ అనుభవాల నుంచి మనం గుణపాఠాలు తీసుకోకపోతే...‘ఆనందం’ అనే సాకుతో తీసుకునే మద్యం మన జీవితాల్లో విషాదం నింపుతుంది. మద్యానికి దూరంగా ఉండడానికి కొన్ని సూచనలు...
మద్యపానం వల్ల ఉత్సాహం వస్తుందని, అందులో ఆనందం ఉందనే మాటలను నమ్మి మోసపోకండి. ‘‘టీనేజ్ అంటేనే ఎంజాయ్. మందు పేరు వినగానే ముక్కు మూసుకుంటే ఎలా?’’ అని రెచ్చగొట్టే స్నేహితులను ‘‘ఎంజాయ్ అంటే ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవడమా?’’ అని అడగండి. ‘‘నువ్వేమీ రోజూ తాగడం లేదు కదా... ఈ ఒక్క రోజే కదా’’ అని చెబుతూ మందును ముందు పెట్టేవాళ్లు కూడా ఉంటారు. గమనించాల్సిన విషయం ఏమంటే, ఒక్కసారి మందు కొడితే అది సంవత్సరం నుంచి నెలల్లోకి, నెల నుంచి వారం, వారం నుంచి రోజుల్లోకి మరుతుంది. ‘మందు కొట్టడం వల్ల ఆరోగ్యానికి కలిగే ముప్పు’ దీని తాలూకు సమాచారాన్ని సంపాదించి ఒకటికి రెండు సార్లు చదువుకోండి. ఫ్రెండ్స్ పార్టీలకు ఆహ్వానించినప్పుడు చదివిన విషయాలను ఒకటికి రెండుసార్లు గుర్తు తెచ్చుకోండి. అప్పుడిక మందు మీ ముందుకు వస్తే ఒట్టు!