నేనొక సోషల్ వెల్‌ఫేర్ హాస్టల్ వార్డెన్‌ని. మా హాస్టల్‌లో ఒక పన్నెండేళ్ల పాపకు స్వరం మారిపోయింది.. ఆ ఏజ్‌లో మగపిల్లలకు మారిపోయినట్టుగా. అయితే ఆ పాప ఇంకా పెద్దమనిషి అవలేదు. ఆ గొంతుతో ఆ అమ్మాయి చాలా సిగ్గుపడుతోంది. దాంతో మాట్లాడ్డమే తగ్గించేసింది. ఇలా అయితే పాప కాన్ఫిడెన్స్ కోల్పోతుందేమోననే భయంతో .. పరిష్కారం కోసం మీకు రాస్తున్నాను.
– పేరు, ఊరు వివరాల్లేవు.
వయసు పెరిగేకొద్దీ .. ప్యూబర్టీ టైమ్‌కి ఆడపిల్లల్లో చాలా మార్పులు వస్తాయి. (వాయిస్ బాక్స్) కూడా థిక్ అండ్ లార్జ్ అవుతుంది. అంతేకాదు ప్యూబర్టీ టైమ్‌కి సైనస్ క్యావిటీస్, గొంతు వెనుక భాగం కూడా ఎన్‌లార్జ్ అవుతాయి. వాయిస్ మారడానికి ఇవీ కారణమే. అందుకే 11 నుంచి 15 ఏళ్ల మధ్య ఉన్న మగపిల్లల్లోనే కాదు ఆడపిల్లల్లోనూ గొంతు మారడాన్ని గమనిస్తాం. ఇలా హఠాత్తుగా తన వాయిస్ అబ్బాయి వాయిస్‌లా హార్డ్‌గా అవడంతో అమ్మాయి ఇబ్బంది పడుతుండవచ్చు.
కాబట్టి వీటన్నిటినీ వివరిస్తూ అదెంత సర్వసాధారణమైన విషయమో చెబుతూ సైకాలజిస్ట్ ద్వారా కౌన్సెలింగ్ ఇప్పించాలి. అమ్మాయిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. స్పీచ్ థెరపీ, గొంతును తగ్గించి మాట్లాడ్డం వంటివి కొంతవరకు సహాయపడతాయి. అయితే జన్యుపరమైన కారణాల వల్లా కొంతమంది అమ్మాయిల్లో మేల్ వాయిస్ ఉంటుంది. కొందరికి అవాంఛిత రోమాలు కూడా రావచ్చు. అంటే ఆండ్రోజెన్ (మేల్ హార్మోన్) హార్మోన్ ఎక్కువ ఉండొచ్చు.
ఒవేరియన్ సిస్ట్స్ వల్ల కూడా ఇలా అవొచ్చు. కాబట్టి ఒకసారి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించాలి. కొన్ని కేసెస్‌లో న్యూరలాజికల్ కండిషన్స్ వల్ల కూడా ఇలా మారవచ్చు. స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి. రిపోర్ట్స్ అన్నీ నార్మల్‌గా ఉంటే వాయిస్ చేంజ్‌ను అడాప్ట్ చేసుకునే కౌన్సెలింగ్‌ని ఇప్పించాలి. విటమిన్ బీ12, విటమిన్‌డి సప్లిమెంట్స్ కూడా కొంతమందిలో ఈ హార్డ్ వాయిస్‌ని తగ్గిస్తాయి.
డా. భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment