ఇది అవగాహన పెంచే మాసం
మీకు తెలుసా?
అమెరికాలో మే నెలను ‘హెపటైటిస్ అవేర్‌నెస్ మంత్’గా వ్యవహరిస్తారు. హెపటైటిస్‌కు సంబంధించి పరీక్షలు, చికిత్స చేయించుకోవడం మీద ప్రత్యేకంగా దృష్టి పెడతారు.
కాలేయం వాపుకు లోనవడాన్ని హెపటైటిస్‌గా వ్యవహరిస్తారు. వైరల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కాలేయం రోగగ్రస్థం కావడం అన్నమాట. ఇందులో ‘ఎ,బి,సి, డి, ఇ’ అనే రకాలుంటాయి. వైరస్‌ను బట్టి లక్షణాలు కొద్దిగా మారుతాయి, దానిని బట్టే పేరు కూడా మారుతుంది. సాధారణంగా హెపటైటిస్ ‘ఎ,బి,సి’లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. వైరస్ కారణంగా కాలేయం వాపుకు లోనవడం అనేది దీర్ఘకాలంలో కాలేయ క్యాన్సర్‌కు దారి తీసే ప్రమాదం ఉంది.
అందుకే సామాన్యులను చైతన్యవంతం చేయడానికి అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ సుమారుగా యాభై లక్షల మంది అమెరికావాసులు హెపటైటిస్‌తో బాధపడుతున్నారు. అయితే వారిలో చాలామంది తాము ఆ వ్యాధి బారిన పడ్డట్టు కూడా తెలియకనే జీవనాన్ని కొనసాగిస్తున్నారు.