భారత్ అంటే బ్రిటన్ భయపడుతోంది!
వార్తా భారతం
నిన్నమొన్నటి వరకు ప్రధానంగా మోడీ వార్తల్లో ఉండేవారు. ఇప్పుడు బాదాన్ రేప్‌లు ఇండియాలో పెద్ద వార్తలయ్యాయి. ఎంత పెద్ద అంటే, బ్రిటన్ కూడా తన మహిళా పౌరులను ‘ఇండియా వెళుతుంటే కనుక జాగ్రత్త’ అని హెచ్చరిస్తోంది. రేపుల కంటే కూడా రేపులపై మన నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మరింత ఘోరంగా ఉంటున్నాయి. ఒళ్లంతా కప్పుకుంటే, ఎవరికి మాత్రం తప్పుడు బుద్ధి పుడుతుందని బాబూలాల్ గౌర్ అనే మంత్రిగారు (పైగా హోమ్‌మంత్రి) తాజాగా వాక్రుచ్చారు. ఆయనది మధ్యప్రదేశ్. ఆయన వ్యాఖ్యానించింది ఉత్తరప్రదేశ్‌లోను, మిగతా రాష్ట్రాల్లోనూ ఇటీవల కొంతకాలంగా జరుగుతున్న రేపుల గురించి.
బాదాన్ ఉత్తరప్రదేశ్‌లో ఉంది. కొద్దిరోజుల క్రితం అక్కడ ఇద్దరు అక్కచెల్లెళ్లపై అత్యాచారం చేసి చెట్టుకు ఉరివేశారు. తర్వాత అదే రాష్ట్రంలో మరో బాలికను కూడా చెట్టుకు ఉరేసి ఉసురు తీశారు. హర్యానాలోని భగానాలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. వీటిని ఖండిస్తూ వందలాది మహిళలు ఢిల్లీలోని భారత ప్రభుత్వ కార్యాలయాల ముందు ధర్నా జరిపారు. ఈ ఘటనల విషయంలో ఆయా ప్రభుత్వాలు ఇంతవరకు తీసుకున్న చర్యలేమిటో వెల్లడించాలని పట్టుపట్టారు. అయితే ఈ వార్తలు మనకన్నా కూడా బ్రిటిష్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి! ‘డైలీ టెలిగ్రాఫ్’ పత్రికలో ఇండియా ట్రావెల్ ప్రతినిధిగా పనిచేస్తున్న గిల్ చార్ల్‌టన్ రాసిన వ్యాసంతో కలవరపడిన బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ ‘‘మహిళలూ జాగ్రత్త. ఆ దేశంలో ఆడవాళ్లను తినేసేలా చూడ్డం ఒక అలవాటు’’ అంటూ తక్షణం తన మహిళలను హెచ్చరించింది. అంతేకాదు, ‘‘మీరు ఇండియా వెళితే కనుక స్థానిక సంప్రదాయాల ప్రకారం ఒళ్లంతా కప్పివుంచే దుస్తులను ధరించడం క్షేమకరం’’ అనే సూచన కూడా చేసింది. ఇండియాలోని తన పౌరులను, ఇండియా టూర్ వెళుతున్న వారిని మరింత అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఈ సందర్భంగా గతంలో గోవా, ఢిల్లీ, బెంగళూరు, రాజస్థాన్‌లలో బ్రిటిష్ మహిళలపై జరిగిన అఘాయిత్యాలను, అలాగే ఈ ఏడాది ఇండియాలో పోలెండ్, జర్మనీ, నెదర్లాండ్స్ మహిళా యాత్రికులపై జరిగిన అత్యాచార యత్నాలను గుర్తుచేసింది. బహుశా బ్రిటన్... ఇండియాకు ఇంతగా భయపడడం ఇదే మొదటిసారి కావచ్చు. అయితే ఇదేం గర్వించాల్సిన విషయం కాదు. భారత్ పరువు బజారుకెక్కడం వంటిది. మోడీ ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ముందుగా పరిగణనలోకి తీసుకోవలసిన అంశమిది.