
ప్రార్థన... అంటే..! దేవునితో సంభాషణే!!
రోజూ ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల మానసికంగా ఎంతో బలం కలుగుతుంది. క్రమబద్ధంగా చేసే ప్రార్థన మనసు బలం పుంజుకోవడానికి ఉపకరిస్తుంది. ఏ వ్యాకులత, దిగులు లేకుండా గడిపేందుకు తోడ్పడుతుంది. రోజూ ప్రార్థన చేసే అలవాటు లేనివారికి ప్రార్థన చేయడం చాలా కష్టం అవుతుంది. ఏకాగ్రత కుదరదు. అనునిత్యం తోటివారితో, కుటుంబ సభ్యులతో మాట్లాడటం అలవాటైన వాళ్లకు ప్రార్థనలో మౌనంగా కూర్చోవడం కష్టమే. సమయం భారంగా కదులుతున్నట్లు ఉంటుంది. నిమిషం... గంటలా దీర్ఘంగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. దీనితో సహనం సడలి, ప్రార్థన సరిగా సాగదు. కానీ ఒకరు చెప్పడం వల్ల లేదా ఒకరు శాసించడం వల్లనో ప్రార్థన చేయడం సాధ్యం కాదు. ప్రార్థనను దినచర్యలో భాగంగా అలవరచుకోవడం అవసరం.
అది తెలుసుకుంటే జీవితానికి చాలా ఉపయోగం. స్నానం, భోజనం, ఉద్యోగం, నిద్ర ఎలాగో, ప్రార్థన కూడా అలాగే చేయాలి. ప్రతిరోజూ దైవప్రార్థనతోనే రోజును ప్రారంభించాలి. దైవప్రార్థనతోనే రోజును ముగించాలి. అలా క్రమ క్రమంగా ప్రార్థన చేయడం అలవాటు చేసుకుంటే, మెల్ల మెల్లగా అది బాధ్యత కన్నా కూడా భగవంతుడితో విడదీయరాని మహోన్నతమైన బంధంగా మారుతుంది. చివరగా ఒకమాట... ‘మనుషులతో అయితే మాట్లాడవచ్చు’ అనుకునేవారు... మౌనంగా దేవునితో మాట్లాడవచ్చు... అని కూడా తెలుసుకోవాలి. నిజానికి కష్టం సుఖం పంచుకోవడానికి దేవునికి మించిన ఆత్మబంధువు ఎవరున్నారు!?
ఆత్మీయం