
ఆ నేడు 8 సెప్టెంబర్ 1978
బ్లాక్ ఫ్రైడే
తమ పాలకుడు రెజా షాకు వ్యతిరేకంగా ఇరాన్‌లో ప్రజల ఆగ్రహం ఉద్యమ రూపం దాల్చింది. అగ్రరాజ్యం అమెరికా అండదండలు ఉన్న తనను ఉద్యమాలేవీ చేయలేవని షా గట్టిగా నమ్మాడు. మరోవైపు... ప్రజా ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతం అవుతోంది. బంద్‌లు, ధర్నాలతో ఇరాన్ అట్టుడికి పోతోంది. తిరుగుబాటు కారణాలలో షా అనుసరిస్తున్న ‘పాశ్చాత్యీకరణ’ పోకడలు, అణచివేత స్వభావం, అవినీతి, అస్తవ్యస్త పాలన...మొదలైనవి కీలక పాత్ర వహించాయి. టెహ్రన్‌లోని జలెహ్ స్క్వేర్ దగ్గర వేలాది మంది నిరసనకారులు గుమిగూడారు. ప్రభుత్వం విధించిన మార్షల్ లా గురించి పెద్దగా ఎవరికీ తెలియదు.
ఒకవైపు హెచ్చరిస్తూనే మరోవైపు నిరసనకారులపై కాల్పులు జరిపారు సైనికులు. అధికారిక లెక్కల ప్రకారం 88 మంది ఆ కాల్పుల్లో చనిపోయారు. 88 కాదు వేలాది మంది చనిపోయారని అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇరాన్ చరిత్రలో రక్తపు మరకగా నిలిచిన ఈ హత్యాకాండకు ‘బ్లాక్‌ఫ్రైడే’గా పేరుబడి... ఇరాన్ విప్లవం తారస్థాయికి చేరేలా, షా దేశం విడిచి ప్రవాసం వెళ్లేలా చేసింది.