
చచ్చేంత చావు
మట్టి నుంచి వచ్చిన మానవుడు మట్టిలో కలవాల్సిందే.. కాని... బంధుత్వాలు, మానవత్వం మట్టిపాలు అవుతుంటే చూడలేకపోతున్నాం! స్వతంత్య్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే బ్రదర్.. అన్న ఆకలిరాజ్యం సినిమా పాట మానవత్వంలేని ఆకలిని సజీవంగా ఉంచింది! ధార్మిక ఆలోచనలు ఉన్న చాలామంది నమ్మే విషయం.. మనిషి పోయినా ఆ మనిషి ఆనవాళ్లు ప్రేమరూపంలో, ఎనర్జీ రూపంలో మనవెంటే ఉంటాయని! ఈ కథనం వాస్తవం! మన కళ్లముందే జరిగిన డబ్బు మాయ! తల్లి చావు వార్త అందరికీ తెలిస్తే ఖర్చు భరించలేమని గోప్యంగా ఖననం చేసిన కొడుకు కథ! తప్పు ఆ కొడుకుదా? తప్పొప్పులు ఖాయం చేసే వ్యవస్థదా? లేక అమ్మ ప్రేమని కూడా అమ్మేసే డబ్బుదా?మట్టిలో గింజ పెడితే చెట్టవుతుంది! కానీ ఈ చెట్టంత కొడుకు కాసుల కోసం చేసిన నిర్వాకం అందరినీ విస్మయపరిచింది! అమ్మలకు బతకడమే చావై పోయిన ఈ రోజుల్లో చావు.. మానవత్వం చచ్చినంత చావైంది!
కరెన్సీ నోటు మీద ఉన్న గాంధీజీ తన జీవితంలో ఏనాడూ డబ్బును ఆశించలేదు. కాని ఆయన బొమ్మ ఉన్న ఆ నోట్లను మాత్రం ప్రతి ఒక్కరూ ఆశిస్తూనే ఉన్నారు. ఉంటారు. ఆదర్శం కంటే అణా పైసలకే ఎక్కువ విలువ ఉన్న రోజులు వచ్చాయి. బంధాలను వెల కట్టలేము అనుకునే రోజులు పోయి ‘వెల’ను బట్టే బంధాలు మిగుల్చుకునే రోజులు ఏనాడో వచ్చేశాయి. బతికి ఉన్న మనిషి చనిపోయాడని పాలసీ క్లయిమ్ చేసిన ఘటన గతంలో ఎప్పుడో జరిగితే జనం వింతగా చెప్పుకున్నారు. కాని ఇప్పుడు అలాంటివి కోకొల్లలు. కడుపున పుట్టిన పిల్లలు భారమవుతారని వదిలేసేవాళ్లు కొందరైతే కని పెంచినవారు భారమవుతారని వదిలేసేవాళ్లు మరికొందరు. డబ్బు పాపిష్టిది అని తెలిసినా పాపిష్టి పనులు చేయడానికి సిద్ధపడేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉంది తప్ప తరగడం లేదు. కొద్దిపాటి డబ్బుల కోసం చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం చైన్ స్నాచర్లుగా, కిడ్నాపర్లుగా, దోపిడీ దొంగలుగా మారుతున్న చదువుకున్న యువకులను చూస్తుంటే ఆందోళనగా ఆనిపిస్తుంది. డబ్బు సహాయం ఎక్కడ చేయాల్సి వస్తుందోనని ప్రాణ స్నేహాలను వదలుకునేవారు కొద్ది పాటి డబ్బుల్లో తేడా వస్తే ప్రాణస్నేహితులను కడతేర్చేవారు నిత్యం కనిపిస్తున్నారు. పూర్వికులు ‘పైసా మే పరమాత్మ హై’ అన్నారు తప్ప ‘పైసా హీ పరమాత్మా హై’ అనలేదు. సాటి మనిషిలో పరమాత్ముణ్ణి చూస్తే బంధాలు అనుబంధాలు మనిషితనం మిగులుతాయి. రూపాయిలో దేవుడున్నాడనుకుంటే ఇదిగో ఇలాంటి ఘటనలే జరుగుతాయి.
వరంగల్‌జిల్లా, భూపాలపల్లి పట్టణంలోని ఎల్‌బీనగర్ నివాసి.. కట్కూరి శ్రీనివాస్. సింగరేణి సివిల్ ఆఫీస్‌లో ఉద్యోగం. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లు. తల్లి కట్కూరి మల్లమ్మ. ఎనభై ఏళ్లు. అనారోగ్యంతో బాధపడుతోంది. నలుగురు కొడుకులు మూడు నెలలకొకరు చొప్పున తల్లి బాగోగుల బాధ్యతను పంచుకున్నారు. ఈ క్రమంలో భాగంగా శ్రీనివాస్ మూడు నెలల కిందట కరీంనగర్‌జిల్లాలోని గోదావరిఖనిలో ఉంటున్న తన తమ్ముడు కృష్ణ దగ్గర్నుంచి తల్లిని భూపాలపల్లికి తీసుకొచ్చాడు. మొన్న శుక్రవారం (ఒకటవ తేదీ )ఉదయం మల్లమ్మ పెద్ద కూతురు బల్ల సరస్వతి తల్లిని చూడడానికి సోదరుడు శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. తల్లితో మంచిచెడు మాట్లాడి ఆమెకు పళ్లరసాన్ని తాగించి సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్ళింది. అదే రోజు సాయంత్రం సుమారు 4 గంటల సమయంలో మల్లమ్మ మరణించింది. తల్లి మరణ వార్తను ఊళ్లోనే బంధువుల ఇంట్లో ఉన్న అక్కకు కానీ మిగిలిన తోబుట్టువులకు కానీ తెలియపర్చలేదు శ్రీనివాస్. తెలియపర్చకపోగా అప్పటికప్పుడు ఓ టాటా ఏస్ ప్యాసింజర్ వాహనాన్ని తీసుకొని వచ్చి భార్య కృష్ణవేణి సహాయంతో తల్లి మృతదేహాన్ని కెటికె 2వ గని దగ్గరున్న శ్మశాన వాటికకు తీసుకెళ్ళాడు. మృతదేహాన్ని ఖననం చేశాడు. బంధువుల ఇంటికి వెళ్ళిన సరస్వతి సుమారు 6 గంటల సమయంలో తిరిగి శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర ఎవరూ లేకపోవడంతో చుట్టుపక్కల వారిని అడిగింది. వాళ్లు ‘మీ అమ్మ చనిపోయింది. మీ తమ్ముడు, మరదలు కలిసి శవాన్ని ఖననం చేయడానికి వెళ్లారు’ అని చెప్పారు. ఆ మాటలకు సరస్వతి అవాక్కయింది. ఏడుస్తూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ్ముడు శ్రీనివాస్, మరదలు కృష్ణవేణిపై ఫిర్యాదు చేసింది. తన తల్లి మరణంపై అనుమానం ఉందని, దర్యాప్తు జరిపించాలని కోరింది. ఈ మేరకు ఎస్సై గణపతి నరేష్ కేసు నమోదు చేసుకున్నారు. శనివారం ఉదయం శ్రీనివాస్‌ను విచారించారు. అనంతరం సంఘటన స్థలానికి వెళ్ళి స్థానిక తహశీల్దార్ సత్యనారాయణ సమక్షంలో మృతదేహాన్ని వెలికితీశారు. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని పరకాల సివిల్ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్‌మార్టమ్ నివేదికలో మల్లమ్మది సహజ మరణమనే తేలింది.
అంత్యక్రియల ఖర్చులకు భయపడేనా.. ?
కొంతకాలంగా అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లతో శ్రీనివాస్‌కు విభేదాలున్నాయట. ఇంతలోకే తల్లి మరణించడంతో ఆమె అంత్యక్రియలు, కర్మకాండల ఖర్చులు తానే భరించాల్సి వస్తుందని భావించిన శ్రీనివాస్ ఆమె మరణవార్తను గోప్యంగా ఉంచినట్లు తెలిసింది.
- పి రవిభాస్కర్
సోషల్‌స్టిగ్మా గురించి బాధపడక్కర్లేదు
కుటుంబంలో ఎవరైనా చనిపోతే కుటుంబ సభ్యులను ఓదార్చి, వాళ్లకు కొంత స్వాంతన ఇవ్వడం ఓ ఆనవాయితీ, ఆచారం. అయితే మారిన కాలంలో ఇవన్నీ ఓ భారంగా మారాయి. నిజానికి పదమూడు రోజుల పండగలాంటివన్నీ కొంతమందికి పనికల్పించే కట్టుబాటు, ఏర్పాటు. పోయిన మనిషిని కనీసం యేడాదికి ఒక్కసారన్నా స్మరించుకోవాలని చేసిన ఏర్పాట్లే తద్దినాలు, శ్రాద్ధాలు. కానీ ఇవన్నీ ఇప్పుడు దిగువమధ్యతరగతి వాళ్లకు ఆర్థికభారంగా పరిణమించాయి. అనారోగ్యంతో చనిపోతే బతికున్నవాళ్లకు మరీ కష్టం. ఆ మనిషికైన ఆసుపత్రి ఖర్చు అప్పటికే ఆ కుటుంబాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి ఉంటుంది. చనిపోయాక కర్మకాండల పేరుతో జరిగే తంతు మరిన్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు మారిన ఈ కాలంలో పరామర్శ, ఓదార్పుల పేరుతో ఇంటికి రావాల్సిన అవసరమే లేదు. ఫోన్లు వచ్చాయి. సోషల్‌నెట్‌వర్కింగ్ సిస్టమ్ ఉంది. అందులో ఓ మెసేజ్ పెడితే చాలు. ఫోన్‌చేసి పలకరిస్తే చాలు. లోయర్‌మిడిల్ క్లాస్ కూడా అయ్యో చెప్పకపోతే.. పిలవకపోతే ఎవరు ఏమనుకుంటారో.. అనే సోషల్‌స్టిగ్మా గురించి భయపడక్కర్లేదు.. బాధపడక్కర్లేదు. అంత్యక్రియలు, కర్మకాండల పేరుతో వేలకువేలు ఖర్చుపెట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. - యండమూరి వీరేంద్రనాథ్.
కుటుంబ సభ్యులకైనా చెప్పాల్సింది
శ్రీనివాస్ వాళ్లమ్మ మరణవార్తను గుప్తంగా ఉంచి, మూడోకంటికి తెలియకుండా అంత్యక్రియలు జరిపించడానికి తోబుట్టువులతో ఉన్న మనస్పర్థలే కారణమని తేలింది. ఎన్ని స్పర్థలున్నా తన దగ్గరున్నప్పుడు తల్లి చనిపోతే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పాల్సిన బాధ్యత ఆయనకుంది. ఎందుకంటే వాళ్లకూ ఆమె తల్లే కదా! తల్లిని చివరిచూపు చూసుకోవాల్సిన హక్కు వాళ్లకూ ఉంటుంది కదా! ఒకవేళ అంత్యక్రియలు, కర్మకాండలు ఆయనకు భారవమవుతాయన్న భావనే ఉంటే ఆ విషయాన్ని తోబుట్టువులకు చెప్పి కన్విన్స్ చేయాల్సింది. తలా కొంచెం ఆ బాధ్యతను పంచుకునేలా వాళ్లను ఒప్పించాల్సింది. ఇవేవీ లేకుండా.. తల్లి మరణవార్తనే గోప్యంగా ఉంచడమనేది కరెక్ట్ కాదు.
- డాక్టర్ నాగలక్ష్మి.జి, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్
కిమ్స్ హాస్పిటల్, సికింద్రాబాద్