మంచు కాగడా
షబ్నమ్ అంటే తుషారం. సులువుగా చెప్పాలంటే మంచు.
హల్లా బోల్... నినదించు... అని అన్న సఫ్దార్ హష్మి ఆమెకొక ధిక్కార స్వరం ఇచ్చాడు.
తాను రాలిపోతూ ఆమె చేతికి చైతన్యం అనే కాగడా అందించాడు.
మాస్కోలో చదువుకుంటున్న యువతి షబ్నమ్... చదువును వదిలేసి కెరీర్‌ని వదిలేసి...
ఏసి గదుల్లోని సౌఖ్యాలను వదిలేసి జనంలో పడింది. జనంతో నడిచింది. మైనారిటీ స్త్రీల,
దళిత మహిళల ఆక్రందనలకు ప్రతిధ్వని అయ్యింది. మంచు మండదని ఎవరన్నారు?
షబ్నమ్ కాగడాని అందుకోండి.
1989... జనవరి.
ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ మున్సిపల్ ఎన్నికల సమయం. ప్రచారం జోరు మీద ఉంది. 21 ఏళ్ల షబ్నం హష్మి అప్పుడే మాస్కో నుంచి సెలవులు గడపడానికి వచ్చింది. ఆమె అక్కడ పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేస్తోంది. ఇక్కడ అన్నా వదినలతో సంతోషంగా నాలుగు రోజులు గడుపుదామని వచ్చింది. కాని ఆమె ఊహించినట్టుగా సంతోషం ఎదురవలేదు. విషాదం అలముకుంది. ఆమె అన్న సఫ్దార్ హష్మీ ప్రజాఉద్యమకర్త, థియేటర్ ఆర్టిస్ట్, విశేషమైన ప్రజాదరణ ఉన్నవాడు. ఆ ఎన్నికల్లో ప్రజలను చైతన్యపర్చడం కోసం ‘హల్లా బోల్’ (నినదించు!) అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఇది కొందరికి నచ్చలేదు. వేదిక మీద నాటకం నడుస్తుండగానే వందలాది మంది చూస్తుండగానే దుండగుల చేత సఫ్దార్ మీద దాడి చేయించారు. తీవ్రంగా గాయపడ్డాడు. ఆ రాత్రి హాస్పిటల్ ముందు వేలాదిమంది జనం. దేశమంతా వార్తలు... ప్రజాస్వామికవాదుల ఖండనలు. కాని జరగవలసిన నష్టం జరిగిపోయింది. తెల్లవారి ఆ తార రాలిపోయింది. షబ్నం కుటుంబానికి ఇది ఊహించని శోకం. అంత బాధలోనూ ఆమెది ఒకటే ఆలోచన.. అన్న ఆశయం అర్ధంతరంగా ఆగిపోకూడదు అని. ఆ బాధ్యత తను తీసుకోవాలి అనుకుంది. ఆ పూట నుంచే అమలు పర్చింది.
అన్న పోయిన దుఃఖాన్ని మోస్తూనే ఆయన ఆశయాన్ని సాధించే కర్తవ్యాన్ని తలెకెత్తుకుంది. సగంలో ఆగిన హల్లాబోల్ ప్రదర్శనను దుండగులు ఎక్కడైతే ఆయనపై దాడి చేశారో అక్కడి నుంచే పునఃప్రారంభించింది. ఈసారి ప్రత్యర్థులు నిస్సహాయంగా మిగిలారు. శివంగిలా పోరాటానికి దిగిన షబ్నం ముందు తల వంచారు. నాటకం నిరాటంకంగా సాగిపోయింది. ఆ ఎన్నికల ఫలితాల మీద ఆ నాటకం చాలా ప్రభావం చూపింది. జనం షబ్నంను అన్న స్థానంలో పెట్టి చూసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత షబ్నం మాస్కో వెళ్లలేదు. ఇక్కడ ప్రజాఉద్యమాల్లో పాలుపంచుకుంటూ ఉండిపోయింది! పాతికేళ్లు గడిచిపోయాయి. ఇప్పుడామెకు 54 ఏళ్లు. కాని ఎక్కడ ఏ ప్రజావ్యతిరేక నిర్ణయ చర్య జరిగినా ఆమె గొంతు వినిపిస్తుంది. హల్లా బోల్! నిలదీస్తుంది.
అన్‌హద్ (ఊఏఅఈ..యాక్ట్ నౌ ఫర్ హార్మనీ అండ్ డెమొక్రసి)
నాటకం మనుషులను చైతన్య పరుస్తుంది. నిజమే. కాని ప్రదర్శన స్థలికి ఆవల చాలా జరుగుతోంది. ప్రజల మనసులను కలుషితం చేసే పని చాలా జరుగుతోంది. మతం పేరుతో విద్వేషం బీజాలు వేసుకుంటోందనీ లౌకిక భావనలకు భంగం వాటిల్లే పరిస్థితులు వస్తున్నాయని ఆమెను ఉత్తర భారతదేశంలో అప్పుడప్పుడే చోటు చేసుకుంటున్న మతఘర్షణలు, దళిత, మైనార్టీ వర్గాల స్త్రీల మీద జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాలు హెచ్చరించాయి. మత ఛాందసానికి వ్యతిరేకంగా మానవత్వం కోసం ‘అన్‌హద్’ అనే సంస్థను ఏర్పాటు చేసిందామె. దేశంలో లౌకికత్వాన్ని కాపాడ్డంలో మిగిలిన ప్రజాఉద్యమ సంస్థలకు మద్దతుగా నిలబడింది. అంతే. అన్న మీద పగబట్టిన శక్తులే ఆమె మీద కూడా పగబట్టాయి. ప్రతిసారీ దాడులకు దిగాయి. ప్రతిసారీ ఆమె ఎదుర్కొంది. ‘నేను చేసిన పనులకు నాకు వచ్చిన అవార్డులు కాదు నిదర్శనం.. నా తల మీద పడ్డ కుట్లు’ అంటారు హష్మీ నవ్వుతూ!
గుజరాత్.. గోద్రా
2002. గోధ్రా ఘటన జరిగింది. ఆ తర్వాత గుజరాత్ అంతా అల్లర్లు చెలరేగాయి. మత ఛాందసానికి వ్యతిరేకంగా పని చేస్తున్న షబ్నం వెంటనే తన భర్త గౌహర్ రజా, కొడుకును తీసుకొని అక్కడకు వెళ్లింది. పరిస్థితి చూసి హతాశురాలైంది. అప్పుడే నిర్ణయించుకుంది.. తన శేష జీవితాన్ని ఆ దమనకాండకు బలైన వారికి న్యాయం జరిపించడానికే అంకితం చేయాలని. ఇప్పటికీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంది హష్మీ. గోద్రా అల్లర్లలో గ్యాంగ్‌రేప్‌కి గురైన 50 మందిని ఇంటర్వ్యూ చేసింది హష్మీ. ‘ఆ ఇంటర్వ్యూలలో బయటపడ్డ నిజాలు నా కాళ్ల కింది భూమిని కదిలించాయి. నాగరికులమనుకునే మనం ఇంత దారుణానికి పాల్పడగలమా అని షాకయ్యాను. అల్లర్ల కంటే ముందు స్త్రీలను ఎలా వెంటాడాలి? ఎలా రేప్ చేయాలి? అని శిక్షణ ఇచ్చారట. అలాంటి వాళ్లంతా ఈ రోజు సమాజంలో స్వేచ్ఛగా.. నిర్భయంగా తిరుగుతున్నారు. ఎంత అమానవీయం?’ అంటుంది హష్మీ. రేప్‌కి గురైన స్త్రీలకు, అనాథలైన పిల్లలకు పునరావాసం కల్పించడంలో అనహద్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. మతసామరస్య భావన కోసం ఈ రేప్ బాధితులతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓ యాత్రనూ నిర్వహించింది. ‘ఒక మనిషిని మరో మనిషి చంపాలని ఏ మతమూ చెప్పదు’ అంటుంది షబ్నమ్.
భన్వరీ కేస్
1992లో రాజస్థాన్‌లో బాల్యవివాహాన్ని అడ్డుకున్నందుకు ఊళ్లోని అగ్రకులాల వాళ్లచేత గ్యాంగ్ రేప్‌కి గురైంది భన్వరీదేవి. ఆమె న్యాయపోరాటానికి సంఘీభావం తెలిపింది షబ్నమ్ హష్మీ. ‘చేయాల్సినదానితో పోలిస్తే మేం చేస్తున్నది చాలా తక్కువే. ప్రయత్నం చిన్నదే అని ఎక్కడా ఆగిపోం. ఇప్పుడు మాకున్న ప్రధాన డిమాండ్లలో ‘మత హింస బిల్’ ఒకటి. దీన్ని ప్రవేశపెట్టాలని ప్రజాఉద్యమ సంస్థలన్నీ రికమెండ్ చేస్తున్నాయి. మా సిఫార్సులను నేషనల్ అడ్వయిజరీ కౌన్సిల్ కూడా ఒప్పుకుంది. అసహనం అంతకంతకూ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్‌ను తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది’ అంటారు షబ్నం హష్మి. ఢిల్లీ వేదికగా పనిచేసే ‘అన్‌హద్’ అంటే హద్దులు లేనిదీ అని అర్థం. నిజంగానే వీళ్ల ఈ సంస్థ చేసే పనులకు ఆకాశమే హద్దు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ప్రజాఉద్యమ సంస్థకు అన్‌హద్ సంఘీభావం తెలపడమే కాదు.. భాగస్వామ్యమూ నెరుపుతుంది. ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా అలుపెరగక పోరాడుతున్న ఈ ధీర వనితను నోబెల్‌పీస్ ప్రైజ్‌కీ సిఫారసు చేసింది ఆ కమిటీ.
- (ది వీకెండ్‌లీడర్స్ డాట్ కామ్ సౌజన్యంతో)
రాజీలేని పోరాటం
మానవ హక్కుల, ప్రజాస్వామ్య హక్కుల పట్ల ప్రజల్లో చైతన్యం కల్పించే పోరాటంలో జీవితాన్ని అంకితం చేసిన షబ్నం హష్మీ ఢిల్లీ వేదికగా పనిచేస్తున్నారు. ఇటీవల దేశంలో అసహనం అలుముకుందంటూ నిరసన వ్యక్తం చేస్తున్న బృందాలతో కలిసి ఆ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు ఆమె. 2002 అల్లర్ల తర్వాత వచ్చిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయానికి కాంగ్రెస్ ఉదాసీనతే కారణమని కేంద్రంలో తను సభ్యత్వం వహిస్తున్న... సెంట్రల్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మౌలానా అజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్, నేషనల్ మానిటరింగ్ కమిటీ ఫర్ మైనార్టీ ఎడ్యుకేషన్, నేషనల్ లిట్రసీ మిషన్ కౌన్సిల్, అసైన్‌మెంట్ అండ్ మానిటరింగ్ ఆథారిటీ ఆఫ్ పస్లానింగ్ కమిషన్ మొదలైన అయిదు గవర్నమెంట్ ప్యానల్స్ నుంచి వైదొలగిన రాజీలేని పోరాటం ఆమెది.