తెలుగు కోయిల... పడమటి పల్లవి...
సంగీతం ప్రపంచ భాష.. మదిలోని భావాలను వ్యక్తపరిచే సాధనం.. అయినా సంగీతంలో తేడాలున్నాయి. వెస్ట్రన్, ఈస్ట్రన్ అంటూ... అయితే కొంతమంది సంగీతకారులు ఈ ఎల్లలు చెరిపేస్తున్నారు. పాశ్చాత్య సంగీతపు గుబాళింపును, భారత సంగీత సౌరభాన్ని మిశ్రమం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నమే భావన రెడ్డిది కూడా. ఈ తెలుగు కోయిల ఎల్లలు దాటి హాలీవుడ్ స్థాయికి చేరింది. తను అభ్యసించింది భారత శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యాలే అయినా తను ఒక రాక్‌స్టార్‌లా రాణిస్తుండటమే గమ్మత్తు... నేర్చుకొన్నది శాస్త్రీయ సంగీతం, శాస్త్రీయ నృత్యం. కుటుంబ నేపథ్యం కూడా అలాంటిదే. అయితే వెస్ట్రన్ మ్యూజిక్‌లో వావ్ అనిపిస్తోంది. ‘జాయ్‌రైడ్-3’ అనే హాలీవుడ్ సినిమాలో పాడే ఛాన్స్‌ను సంపాదించింది.
కామన్‌వె ల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో: భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, దేశానికి చెందిన అనేకమంది రాజకీయ, సామాజిక, క్రీడాప్రముఖులందరూ కొలువైనవేళ, మనదేశం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన కామన్‌వెల్త్ గేమ్స్ ప్రారంభోత్సవ సమయంలో అద్భుతమైన తెలుగింటి కూచిపూడి నాట్యంతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ప్రజల మనసులను దోచుకొంది.
అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో: భావన ఒక రాక్‌స్టార్. సొంతంగా పాట రాసుకొని, కంపోజ్ చేసుకొని, పాటలు పాడుతూ బ్యాండ్‌తో కలసి, సోలోగా ప్రదర్శనలిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కాంపిటీషన్లలో భావన బ్యాండ్‌కు ఉన్న క్రేజే వేరు!
ఇలా రెండు విభిన్నమైన ప్రాంతాల్లో, విభిన్నమైన కళల్లో, విభిన్నమైన గుర్తింపును సంపాదించుకొంది. కూచిపూడి నృత్యంలో ప్రపంచ ప్రసిద్ధులు, పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డు గ్రహీతలైన రాజారెడ్డి, రాధారెడ్డిల కూతురే ఈ భావన. తల్లిదండ్రుల శిష్యరికంలో కూచిపూడి నేర్చుకొని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనలను ఇచ్చింది. అయితే ఇదే స్థాయిలో ఆమెకు సంగీతం మీద కూడా ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి ఆమెను ఊరకుండనీయనలేదు. ఢిల్లీలో పుట్టి పెరిగిన భావన తన వెస్ట్రన్ మ్యూజిక్ గోల్‌ను రీచ్ కావడానికి లాస్ ఏంజెలెస్ వెళ్లింది. కర్ణాటక సంగీతంపై ఉన్న పట్టు కూడా ఆమెకు బాగా ఉపయోగపడింది.
గ్రామీ నామినీలతో కలిసి పని చేసింది! సొంతంగా గీతాలు రాసుకొని ‘టాంగిల్డ్ ఎమోషన్స్’ అనే ఈపీ(ఎక్స్‌టెండ్ ప్లే)ని రూపొందించింది భావన. గ్రామీ అవార్డ్‌కు నామినేట్ అయిన వ్యక్తులతో కలసి పనిచేసి ఆ మ్యూజికల్ రికార్డ్‌ను విడుదలచేసింది. ఇందులోని భావన వాయిస్‌కు బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. భావన స్వరాన్ని విన్న హాలీవుడ్ దర్శకుడు క్లౌడ్‌ఫోయిజ్ తన సినిమాలో అవకాశం ఇచ్చాడు. దీంతో మన తెలుగమ్మాయికి అంతర్జాతీయ స్థాయిలో పేరొచ్చింది.
ఓ నిరాశాపూరిత ప్రేమికురాలి మనసు ఆవిష్కరణ...
‘‘ప్రేమ మిగిల్చిన విషాదంతో నిరాశలో కూరుకుపోయిన ఒక అమ్మాయి మనసు ధ్వనే ‘టాంగెల్డ్ ఇన్ లవ్’. గత ప్రేమ చేదు అనుభవంతో, మరొకరిని ప్రేమించలేక ఆమె పడే వేదననే అక్షర రూపంలోకి తీసుకొచ్చాను. దీన్ని రికార్డింగ్ రూపంలోకి తీసుకురావడానికి ఏడాది కాలం పట్టింది. ‘స్మెల్ లైక్ రెయిన్’ సాంగ్ నాకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తాజాగా నేను తొలిసారి హాలీవుడ్ సినిమా కోసం పాడాను. ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారి సినిమాలోని ఓపెనింగ్ సాంగ్‌లో స్వరం వినబోతున్నారు. నాకు ఇది నిజంగా గ్రేట్ ఎక్సైట్‌మెంట్. నా సక్సెస్ విషయంలో మ్యూజిషియన్ల, స్నేహితుల సహకారం మరవలేనిది.
- భావన