ఒక గాడిద తనను తాను గుర్రమని నమ్మసాగింది. మనల్ని మనం గుర్తు పట్టకపోవడం, మనల్ని ఇంకెవరో అనుకోవడం ప్రకృతి సహజం. అబద్ధాన్ని నిజంగా చలామణి చేయాలనుకుంటే తప్పులేదు గానీ, నోరు విప్పకుండా జాగ్రత్త పడటం నేర్చుకోవాలి. స్వరం భాస్వరం లాంటిది. నిప్పుని ఎగదోస్తుంది. అలంకారం వల్ల రూపురేఖలు మారాయి కానీ గొంతు మారలేదు. గాండ్రింపునకు, ఓండ్రింపునకు అక్షరమే తేడా కానీ, అనాటమీ మారిపోతుంది. గాడిద వెళ్లి ఒక మిమిక్రీ ఆర్టిస్టును కలిసింది.
‘‘నా సకిలింపు ఎలా వుండాలంటే, వెయ్యి వాయులీనాలు ఒకేసారి మోగినట్టుండాలి.’’ అని అడిగింది గాడిద. ఆర్టిస్ట్ కప్పలా బెకబెకలాడి, కోతిలా కిచకిచమని, వూపిరిని దీర్ఘంగా కుక్కలా వదిలాడు. హైనాలా నవ్వి, తోడేలులా వూళవేసి, పరిషత్ నాటకాల పాత్రధారిలాగా ‘‘కుదరదు’’ అని అరిచాడు. ‘‘క్షణానికో ముఖంతో జీవించే మానవులకి, కుదరని పని అంటూ వుందా?’’ అని ప్రశ్నించింది గాడిద. ‘‘నిజమే కానీ, మనుషులు మాత్రమే రకరకాల కూతలు కూయగలరు. జంతువులకు అది చేతకాదు’’‘‘సాధనం వల్ల కానిది ధనం వల్ల అవుతుంది’’ అని గాడిద ఒక క్రెడిట్ కార్డు తీసి ఆర్టిస్ట్ వీపుపై గోకింది. ‘‘నువ్వు నన్ను కొనదలుచుకున్నావా?’’ అనుమానంగా అడిగాడు ఆర్టిస్ట్.
‘‘ఈ ప్రపంచంలో కొనలేని వాళ్లు వుండొచ్చు కానీ, అమ్ముడుపోని వాళ్లు మాత్రం లేరు. అమ్మకం ఒక కళ. కొనడం ఒక ప్రేతకళ.’’‘‘వాక్య నిర్మాణంలో ఏదో దోషముంది’’‘‘మానవ నిర్మాణంలోనే దోషమున్నపుడు, వాక్యాల గురించి ఎందుకు వ్యాఖ్యానం’’‘‘గాడిదలు కూడా వేదాంతం మాట్లాడతాయా?’’‘‘వేదాంతం పుట్టిందే గాడిదల వల్ల, దీన్ని డాంకీస్ థియరీ ంటారు’’‘‘ఇంత స్వీయజ్ఞానం వున్నప్పుడు, సకిలింపు కూడా నువ్వే నేర్చుకోవచ్చుగా, యూట్యూబ్‌లో బోలెడు వీడియోలున్నాయి.’’‘‘ప్రయత్నించాను కానీ సాధ్యంకాలేదు. గురువులేని విద్య గుడ్డి విద్యగా భావించి నీ దగ్గరికొచ్చాను’’‘‘ఏది నీ స్వరం వినిపించు’’
‘క’ గుణింతం లాగా ‘కి కీ కె కే కై’ అంటూ అవరోహణ నుంచి ఆరోహణకి ఎత్తుకుంది. ఆర్టిస్ట్‌కి గుండెలు జారిపోయి, మోకాళ్లలోకి వచ్చి టకటక కొట్టుకున్నాయి. ఎందుకైనా మంచిదని గాడిద వెనుకవైపు లేకుండా జాగ్రత్తపడ్డాడు. సంగీతకచేరీ ముగిసిన తర్వాత గాడిదలు వెనుక కాళ్లు గాల్లోకి లేపి చప్పట్లు కొట్టి లేపమని తమని తాము అభినందించుకుంటాయి. ఆ సమయానికి ఖర్మగాలి అక్కడెవరైనా వుంటే వాళ్ల పళ్లు రాలగొట్టి డెంటిస్ట్‌ల దగ్గరకు పంపుతాయి. డెంటిస్ట్‌ల ప్రాక్టీస్ పెరగడానికి, గాడిదల సంగీత సాధన ఒక ముఖ్య కారకం. కుక్కర్‌లాగా విజిల్ వేసి, ఓండ్రింపుకి శుభం కార్డు వేసింది గాడిద. ఆర్టిస్ట్‌లో వణుకు తగ్గలేదు. సర్వీస్ ఆటోకి వేలాడుతున్నప్పుడు కూడా అతడు ఇంతలా భయపడలేదు. ఫ్యాన్ గాలికి ఆరుతున్న ఖద్దరు పంచెలా వణుకుతున్నాడు.
‘‘అంత మైమరుపా?’’ అని అడిగింది గాడిద.‘‘మైమరుపునకి, జలదరింపునకి తేడా తెలుసుకోలేకపోవడమే కళాకారుల లక్షణం. ప్రపంచంలో వున్న సౌండ్ ఇంజనీర్లంతా ఏకమైనా నీ ఓండ్రింపుని సకిలింపుగా మార్చలేదు. మనదగ్గర ఏముందో దాన్నే అద్భుతవిద్యగా చలామణి చేయాలి. అయినా గాడిదలు, గుర్రాలకి తేడా తెలియని కంపెనీలు చాలావున్నాయి. పైగా ఓండ్రింపు శబ్దం హెచ్‌ఆర్‌లో బాగా పనికొస్తుంది. వెళ్లి ఏదైనా సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరు’’ అని ఉచిత సలహా ఇచ్చాడు ఆర్టిస్ట్. ‘‘సాఫ్ట్‌వేర్ కంపెనీ అంటేనే గాడిద చాకిరికి బ్రాండ్ అంబాసిడర్. సజాతి ధ్రువాలు వికర్షించుకుంటాయి. నాకు అవసరం లేదు.’’
‘‘నువ్వు తెలివైన అడ్డగాడిదలా మాట్లాడుతున్నావ్.. ఎవరూ మనల్ని పొగడనపుడు మనకి మనమే ఓ సభ పెట్టించుకొని పొగిడించుకోవాలి. ఎవరూ మనల్ని గుర్తించనపుడు మనమే ‘బిగ్ యాస్’ ప్రోగ్రామ్ పెట్టించుకోవాలి. ప్రమోట్ చేసుకోవడం నేర్చుకో. అప్పుడే లోకానికి ఓండ్రింపులో సౌండ్ ఆఫ్ ది మ్యూజిక్ వినిపిస్తుంది’’గాడిద వెళ్లి ఆ పనిలో దిగింది. సభలు, సన్మానాలు, ఇంటర్వ్యూలు అన్నీ జరిగిపోయాయి. జస్ట్ పెయిడ్ అంతే. ఓండ్రింపులో ఎన్ని డెసిబుల్స్ సంగీతముందో లెక్కలేసే పనిలో విద్వాంసులున్నారు. రాగయుక్త ఓండ్రింపు – ఒక తులనాత్మక పరిశీలన అనే అంశంపై ఒకరిద్దరు కుర్రాళ్లు పరిశోధనలోకి కూడా దిగినట్టున్నారు. నీ దగ్గర వున్న దాన్ని బ్రాండెడ్‌గా అమ్మగలిగితే నువ్వే జేమ్స్‌బ్రాండ్.
Comments
Please login to add a commentAdd a comment