ఈ వారం యూట్యూబ్ హిట్స్ | This week YouTube hits! | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్

Published Mon, Oct 3 2016 12:45 AM | Last Updated on Mon, Sep 4 2017 3:55 PM

ఈ వారం యూట్యూబ్ హిట్స్

ఈ వారం యూట్యూబ్ హిట్స్

జారా లార్సన్ : ఎయిన్ట్ మై ఫాల్ట్
‘నా తప్పు కాదు’ అంటోంది స్వీడిష్ సింగర్ జారా లార్సన్! దేని గురించి మాట్లాడుతోంది ఈ 18 ఏళ్ల పాప్ సింగర్? ‘నీ ప్రియుడు నా వైపు చూస్తే అది నా తప్పు కాదు’ అని తనలాంటి ఇంకో అమ్మాయికి చెబుతోంది జారా. ‘పిల్లా... నేను చూడకూడదనుకున్న చోట నువ్వు చేతులు అడ్డుపెట్టుకో. అయినప్పటికీ ఆ చేతి వేళ్ల ఖాళీల్లోంచి అతడు గనుక నన్ను చూస్తుంటే అందుకు నన్ను తప్పు పట్టకు.

చెబుతున్నా’ అంటూ పాడుతుంది జారా లార్సన్. ‘అసలు నాకేం బాధ్యత లేదు’ అని కూడా అంటుంది. పాపం, ఆ అమ్మాయి ఎవరో కానీ ఎలా తన ప్రియుణ్ణి జారా లార్సన్ నుంచి, మిగతా అమ్మాయిల నుంచి కాపాడుకోవడం?! ప్రేమలో పడితే అంతే మరి. ప్రేమను కాపాడుకోవడంతోనే సరిపోతుంది! జారా సెకండ్ స్టుడియో ఆల్బమ్‌లోని సింగిల్ లీడ్.. ఈ సాంగ్. జారా అంత తేలిగ్గా ఏమీ ఈ గీతాన్ని ఆలపించలేదు. ‘ఓవ్ ఓవ్ ఓవ్ ఐ కాంట్ సింగ్ దిస్’ అన్నారు. ‘అసలు నేను ఆ టైపే కాదు.

నాలాంటి ఒక ఆడపిల్ల ప్రియుడిని దొంగిలించడం నా వల్ల కాదు’ అంటూ పాటలోని ఇన్‌సెన్సిబిలిటీని పలచబార్చుతూ కొన్ని మార్పులు చేయించారు. ఆ తర్వాత మాత్రమే పాడేందుకు అంగీకరించారు. ‘ఎవరి ప్రియుణ్ణి వాళ్లే చేజారకుండా చూసుకోవాలి’ అనే అర్థం వచ్చినట్లున్న మొదటి వెర్షన్ కాస్తా... ఇలా.. ‘నీ బాధను నేను అర్థం చేసుకోగలను’ అనే లైన్‌లోకి మారిపోయింది. రైట్. అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికి మాత్రమే అర్థమౌతుంది. గ్రేట్ జారా!
 
బిల్లీ ఆన్ ది స్ట్రీట్ : సీజన్ 5 ట్రైలర్
బిల్లీ ఈజ్ బ్యాక్! నవంబర్ 15 నుంచి అమెరికన్ టీవీ ఛానెల్ ‘ట్రూ టీవీ’లో! ఎవరీ బిల్లీ? బిల్లీ ఐక్నర్. అమెరికన్ కామెడీ గేమ్ షో హోస్ట్. న్యూయార్క్ వీధులలోకి వెళ్లి... దారినపోయే దానయ్యలను, దానమ్మలను ఆపి ప్రశ్నలు అడిగి ఫన్‌ని క్రియేట్ చేస్తుంటాడు బిల్లీ. ‘ఫర్ ఎ డాలర్’, ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’, ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచ్’ అనేవి ఈయన మళ్లీ మళ్లీ ఆడుతుంటే ఆటలు! 2011లో ఈ కామెడీ షో మొదలైంది. శాంపిల్‌గా ఇందులో ‘ఫర్ ఎ డాలర్’ గేమ్‌ని చూపించారు. బిల్ ఒక ప్రశ్న అడుగుతాడు. కరెక్ట్ సమాధానం చెప్పినవాళ్లకు ఒక డాలర్ ఇస్తాడు.

(ఈ వీడియోలో ఒక అమెరికన్ మహిళ విండో షాపింగ్ చేస్తూ ఉంటుంది. బిల్లీ వెళ్లి ‘మిస్.. మిస్.. ఒక లయర్ పేరు చెప్పండి’ అని అడుగుతాడు. ఆమె నవ్వుతూ, డొనాల్డ్ ట్రంప్ అంటుంది. బిల్లీ ‘వావ్’ అంటాడు. ఆమెకు గిఫ్ట్‌గా ఓ డాలర్ ఇస్తాడు). ఇక ‘క్విజ్డ్ ఇన్ ది ఫేస్’ మూడు రౌండ్‌ల గేమ్. మొదటి రెండు రౌండ్‌లలో పాప్ కల్చర్ గురించి మూడు ప్రశ్నలు ఉంటాయి. ఫైనల్ రౌండ్‌లో ఒక జనరల్ క్వొశ్చన్ ఉంటుంది.

దాని ఆన్సర్ బిల్లీ దగ్గరున్న ఆన్సర్‌కి సరిపోవాలి. గెలిస్తే గిఫ్ట్. ‘అమెచ్యూర్ స్పీడ్ స్కెచింగ్’లో మళ్లీ మిస్టర్ దానయ్యలు, మిస్ దానమ్మలు అక్కడికక్కడ ఒక సెలబ్రిటీ బొమ్మ గీయాల్సి ఉంటుంది. దాన్ని బిల్లీ ఇంకో దానయ్య /దానమ్మకు చూపించి ఎవరో చెప్పమంటారు. వాళ్లు చెప్పింది, వీళ్లు గీసిందీ ఒకటే అయితే విన్ అయినట్టు. అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తనతో రోడ్ల మీద తిప్పుతూ గేమ్స్ ఆడుతుంటాడు బిల్లీ!
 
హైదరాబాద్ ట్రాఫిక్ సీన్స్ : మహాతల్లి
కొంతమంది కంత్రీ గైస్ కొలాబరేషన్ ఈ వీడియో. షార్ట్ ఫిల్మ్‌లా ఉంటుంది. తీరూతెన్నూ లేని హైదరాబాద్ ట్రాఫిక్‌ను కూడా తీరుగా చూపించిన ఆ మహాతల్లి జాహ్నవీ దాసెట్టి. ‘మహాతల్లి’ అనే టాగ్‌తో ఫన్నీ సీన్స్‌ని షూట్ చేసి అప్‌లోడ్ చేస్తున్న ఈ షార్ట్‌ఫిల్మ్ సూపర్ స్టార్... కర్నూలు అమ్మాయి. శేఖర్ కమ్ముల టీమ్‌మేట్‌లా అనిపిస్తాయి ఆ యాక్సెంట్, ఆ హావభావాలు. అమ్మాయిలు బండేసుకుని బయటికొస్తే ఎన్ని అనుభవాలు ఎదురౌతాయో, అబ్బాయిల్ని ఈ అమ్మాయిలు డ్రైవింగ్‌లో ఒకోసారి ఎలా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారో ఈ వీడియోలో చూడొచ్చు. ఫన్నీగా ఉంది. ట్రాఫిక్ రూల్స్ పాటించనివారి చెవుల్ని ఇన్‌డెరైక్టుగా మెలేయడమూ ఉంది.
 
ఫెన్సెస్ టీజర్ ట్రైలర్ : పారామౌంట్ పిక్చర్స్
ఈ క్రిస్మస్‌కి విడుదలౌతున్న అమెరికన్-కెనడియన్ డ్రామా మూవీ ‘ఫెన్సెన్’ టీజర్ ఇది. అగస్ట్ విల్సన్ నాటకం ఫెన్సెస్ ఆధారంగా డెంజిల్ వాషింగ్టన్ ఈ చిత్రాన్ని డెరైక్ట్ చేశారు. 1983లో పబ్లిష్ అయిన ఫెన్సిస్... ప్రతిష్టాత్మకమైన పులిట్జర్ ప్రైజ్, టోనీ అవార్డ్‌లను గెలుచుకుంది. ఇప్పటికే రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్న డెంజిల్ వాషింగ్టన్ చేతిలో నాటకం పడింది కాబట్టి.. ఈ సినిమా వెండితెరపైన  కూడా పండినట్టే.

1950ల నాటి పిట్స్‌బర్గ్‌లో కథ మొదలౌ తుంది. ఒకప్పుడు నీగ్రో లీగ్ బేస్‌బాల్ ఆటగాడైన ట్రాయ్ మాక్సన్ పరిస్థితుల ప్రాబల్యం వల్ల చెత్త ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. తన కుటుంబాన్ని పోషించడానికి జీవితం విధించిన షరతులన్నిటికీ తలవొగ్గుతాడు. భార్యనీ కష్టపెడతాడు. డెంజిల్ వాషింగ్టన్, వయోలా డేవిస్ భార్యాభర్తలుగా నటించారు. వీళ్లిద్దరి ఎమోషన్స్ ఎంత హైట్స్‌లో ఉన్నాయో టీజర్‌లో కనిపిస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement