పిడుగు పడదు... పైకి లేస్తుంది!
సీజన్లు మారిపోయాయి. పోతే పోయాయి. కానీ తారుమారైపోయాయి! ఈ ఏడాదైతే మరీను. ఎండల్లో వడగండ్ల వానలు పడ్డాయి. వర్షాకాలంలో ఇప్పుడు ఎండలు అదరగొడుతున్నాయి. ఈ విపరీతానికి లేటెస్టుగా పిడుగులూ తోడయ్యాయి! గత ఆదివారం ఒక్కరోజే ఆంధ్రప్రదేశ్‌లో పిడుగుపాటుకు 20 మందికిపైగా చనిపోయారు. గుంటూరు జిల్లా పేరేచర్ల ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ గ్రౌండ్‌లో ఓ తాటిచె ట్టయితే పిడుగుపాటుకు భగ్గుమంది. జ్వాలలు పైకి ఎగశాయి. నరకంలోంచి నేరుగా ఎవరో విసిరితే పడినట్టుగా పడిన పిడుగు అది. అసలు పిడుగంటే ఏమిటి? అది పడడం ఏమిటి? ఎక్కడి నుండి పడుతుంది? ఎందుకు పడుతుంది?
మేఘం మేఘం డీకొంటే కాంతి వస్తుంది. దాన్ని ‘మెరుపు’ అంటారు. మేఘం మేఘం డీకొంటే శబ్దం వస్తుంది. దాన్ని ‘ఉరుము’ అంటారు. మేఘం మేఘం డీకొంటే క రెంటు పుడుతుంది. దాన్ని ‘పిడుగు’ అంటారు. భూమి మీద ఉండి చూసే మనకు మెరుపు మొదట కనిపిస్తుంది. (ధ్వని కన్నా కాంతి వేగం ఎక్కువ కాబట్టి). తర్వాత ధ్వని వినిపిస్తుంది. మూడో స్టేజ్‌లో... మేఘాల ఒరిపిడి తీవ్రతను బట్టి పిడుగుపాటు ధ్వనిస్తుంది. ఈసారి గమనించండి. ఆకాశంలో మెరుపు మెరిసిందంటే... ఆ తర్వాత కొద్ది క్షణాలకు తప్పనిసరిగా ఉరుము వినిపిస్తుంది.
పిడుగు పడింది అని అంటుంటారు కానీ, నిజానికి అది పడడం కాదు. వినపడడం. ధ్వనించడం! ధ్వనించడం అని అనడం దేనికంటే... పిడుగుకి రూపం లేదు. అదేమీ ఇనుప కడ్డీకాదు, ఇతర లోహమూ కదా. దాని కసలు రూపమే లేదు. దాని శబ్దం మాత్రం ఫేడేల్మని గగనం గాజు అయి పగిలినట్టుగా వినిపిస్తుంది.
సైంటిఫిక్‌గా చెప్పాలంటే... మేఘంలో ఉన్న రుణ విద్యుదావేశం భూమిని తాకినప్పుడు వచ్చే మెరుపుధ్వనే పిడుగు.
మేఘంలో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ చార్జ్‌తో ఉంటే, కింద ఉన్నది నెగటివ్ చార్జితో ఉంటుంది. ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్, నెగటివ్ ఎనర్జీలతో ఉంటాయి. మేఘంలోని నెగటివ ఎనర్జీ, పక్క మేఘంలోని పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే ఆకాశంలో మెరుపు కనిపిస్తుంది. మేఘంలోని నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీకి టచ్ అయితే పిడుగుపాటు అవుతుంది. పిడుగంటే పైనుంచి కిందికి పడేది అనుకుంటాం కదా. నిజానికి కింది నుంచి పైకి వెళ్లేదే ‘పిడుగు’! ఎందుకంటే భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ తనే వెళ్లి, మేఘంలోని నెగటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఇంకా చెప్పాలంటే... పిడుగు పడేటప్పుడు మనకు కనిపించే మెరుపు, భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై మేఘాన్ని చేరుతుంది కానీ, మెరుపు... మేఘం నుండి భూమికి చేరదు. సో... పడేది పిడుగు కాదు. పైకి లేచేది పిడుగు.
ఇంతకీ మేఘాల్లోని ఈ నెటిటివ్, పాజిటివ్ ఏమిటి? మళ్లీ సైన్స్‌లోకి వెళ్లాలి. సృష్టిలోని ప్రతి పదార్థంలో ఉన్నట్లే మేఘాల్లోనూ ప్రోటాన్లు, ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీ. ఎలక్ట్రాన్లు నెగటివ్ ఎనర్జీ. మేఘాలు ఒక చోటి నుంచి ఒకచోటికి ప్రయాణిస్తున్నప్పుడు వాటిల్లో నీరు ఘనీభవించి, ఐస్ అవుతుంది. ఆ ఐస్ గడ్డలు ఒకదానికొకటి తగిలినప్పుడు రాపిడి జరిగి పాజిటివ్ ఎనర్జీ ఉండే ప్రోటాన్లు మేఘం పైభాగానికి చేరతాయి. అలాగే నెగటివ్ చార్జి ఉండే ఎలక్ట్రాన్లు మేఘం అడుగు భాగానికి చేరతాయి. వీటిని, భూమిపై ఉండే ప్రోటాన్లు పాజిటివ్ ఎనర్జీతో మీదికి ఆకర్షిస్తాయి. అప్పుడు పిడుగు పడినట్టవుతుంది. అందుకే భూమీ మీద ఎత్తయిన ప్రదేశంలో ఉండే కొండలు, చెట్లు, ఎత్తయిన మనుషుల ఈ పిడుగు ప్రభావానికి లోనవుతారు. కాబట్టే ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు ఉన్నప్పుడు చెట్లకు దగ్గరగా ఉండకూడదంటారు.