యోగ ముద్రాసనం
‘యోగ’ అంటే కలయిక అని అర్థం. ముద్ర అంటే హావభావాలు. ఈ ఆసన సాధన... హావభావాలు అంతర్ముఖమై అంతరాత్మతో కలవడానికి తోడ్పడుతుంది. అందువలన దీనిని యోగముద్ర లేదా యోగముద్రాసనం అంటారు.
ఎలా చేయాలి?
పద్మాసనంలో కూర్చుని వెన్నెముక నిటారుగా ఉంచాలి. తర్వాత చేతులను వెనక్కి తీసుకుని వేళ్లకు కలిపి (ఫింగర్స్ ఇంటర్‌లాక్)పట్టుకోవాలి.
ఇప్పుడు పూర్తిగా శ్వాస తీసుకుని శరీరాన్ని పైకి లాగి మెల్లగా శ్వాసను వదులుతూ ముందుకు వంగాలి. రెండు చేతులను వీలైనంత నిటారుగా తీసుకురావాలి. ఫొటోను గమనించండి.
ఈ స్థితిలో గడ్డం నేలను తాకాలి, పిరుదులు నేల మీద నుంచి పైకి లేవకూడదు. పాదాలు పొట్టభాగాన్ని తాకుతుంటాయి.
ఈ స్థితిలో శ్వాస తీసుకోకుండా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత మెల్లగా యథాస్థితికి రావాలి. ఇలా రోజుకి మూడు నుంచి ఐదుసార్లు చేయాలి.
ఉపయోగాలు
పద్మాసనంలో ఉండే ఫలితాలన్నీ ఈ ఆసనంలో కూడా ఉంటాయి.
పొట్టలోని అన్ని భాగాలకూ మంచి వ్యాయామం అందుతుంది.
జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం, గ్యాస్ సమస్యలు తొలగిపోతాయి.
లివర్, ప్లీహం పనితీరు మెరుగవుతుంది, వెన్నెముక శక్తిమంతం అవుతుంది.
ఈ ఆసనం బ్రహ్మచర్యానికి ఉపయోగపడుతుంది. అనేక రకాల లైంగిక వ్యాధులను తొలగిస్తుంది.
మోకాళ్లు, భుజాలు, మోచేతులు, మణికట్టు కండరాలు శక్తిమంతం అవుతాయి.
పార్శ్వపు నొప్పి, తలనొప్పి, ఒత్తిడి తొలగిపోతాయి. ముఖంలోని అన్ని భాగాలకు రక్తప్రసరణ బాగా జరగడంతో కండరాలు చైతన్యవంతం అవుతాయి. ముఖం కాంతిమంతం అవుతుంది.
జాగ్రత్తలు
బ్యాక్ పెయిన్, హైబీపీ, సయాటికా, హెర్నియా, స్పాండిలోసిస్ ఉన్నవాళ్లు చేయకూడదు.
మోకాళ్ల నొప్పులు అధికంగా ఉన్నవాళ్లు కూడా చేయరాదు.
మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్
బీరెల్లి చంద్రారెడ్డి
యోగా గురువు, సప్తరుషి యోగ విద్యాకేంద్రం,
హైదరాబాద్