స్వరం వినిపించాలి బలం నిరూపించాలి
మహిళలు బయటికి రావాలి, వాళ్లు చదువుకోవాలి, ఉద్యోగాలు చేయాలి, ఉన్నత శిఖరాలు అందుకోవాలి అని చాలామంది సందేశాలు ఇస్తుంటారు. అయినా కూడా ఇప్పటికీ మనదేశంలో చీకట్లోనే మగ్గుతోన్న స్త్రీలు చాలామంది ఎందుకున్నట్టు! ఎందుకంటే... మాటలు చెప్పే ఎవరూ వారికి చేయూతనివ్వరు. నువ్విది చేయగలవు అంటూ ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నం చేయరు. ఇలా చెయ్యి అంటూ దారి చూపించాలని అనుకోరు.
జాతీయాదాలను లెక్కలేసి, ఎగుమతి దిగుమతులను విదేశీ మారకద్రవ్యాలను అంచనాలు వేసి అభివృద్ధిని కొలవడం నా దృష్టిలో సరికాదు. అసలు ఓ దేశపు అభివృద్ధి ఈ విషయాల మీద కాదు ఆధారపడి ఉండేది. ఏ దేశంలో మహిళల స్థితిగతులు బాగుంటాయో, ఏ దేశంలో మహిళలు చైతన్యవంతులుగా ఉంటారో... ఆ దేశం నిజంగా అభివృద్ధి పథంలో సాగుతున్నట్టు లెక్క.
నిజానికి ఇప్పటి మహిళలకు తెలివితేటలు ఉన్నాయి. సాధించే తెగువ, ముందడుగు వేసే తెగింపు ఉన్నాయి. కానీ ఎన్నో అవరోధాలు వాళ్ల కాళ్లకు బంధనాలు వేస్తున్నాయి. ప్రోత్సహించడం సంగతి తర్వాత, నువ్వు చేయలేవు అంటూ నిరుత్సాహపర్చి వెనక్కి లాగేసేవాళ్లు అడుగడుగునా అడ్డుపడుతుంటే ఏ మహిళ అయినా ఎలా ముందుకు సాగుతుంది! మన మహిళలు విజయం సాధించాలంటే వారికి కావలసింది కాస్తంత ప్రోత్సాహం. అదే దొరికిననాడు మహిళలు ఈ సమాజాన్నే మార్చేయగలరు. రాజకీయాలను సైతం మలుపు తిప్పగలరు. ఉన్నత పదవులను అలంకరించగలరు. అభివృద్ధి అనేదానికి అసలైన నిర్వచనాన్ని ఇవ్వగలరు.
కాబట్టి మాటలు కాదు, మనకి చేతలు కావాలి. చెప్పి ఊరుకోవడం కాదు, చేసే దిశగా వారిని నడిపించాలి. అప్పుడు ఏ మహిళా వంటింటికి పరిమితమైపోదు. కట్టుబాట్లకు తలవంచి నిస్సహాయంగా మిగిలిపోదు. తన స్వరం బలంగా వినిపిస్తుంది. తన బలం నిజంగా నిరూపిస్తుంది.
- షబానా అజ్మీ, నటి, సంఘ సేవకురాలు