సంప్రదాయ హేల
వసంత ఋతువులో వాతావరణం ఒక్కసారిగా మార్పు చెందడం వలన క్రిమికీటకాదులు విజృంభిస్తాయి. అందువల్ల జ్వరాలు, జలుబు వంటివి చాలామందిని బాధిస్తాయి. ఈ వ్యాధుల నివారణ కోసం సంప్రదాయ రంగులను ఒకరిపై ఒకరు జల్లుకుంటూ పండుగ చేసుకోవడం హోలీ ప్రధాన ఉద్దేశం. సహజ రంగులలోని ఔషధ గుణాలు వ్యాధుల బారి నుంచి కాపాడతాయి. వేప, కుంకుమపువ్వు, పసుపు, బిల్వ దళాలు... వంటి ఔషధ గుణాలు కలిగిన వాటి నుంచే కాకుండా, ఆయుర్వేద వైద్యులు సూచించిన కొన్ని ఇతర కాయగూరల నుంచి కూడా సహజ రంగులను తయారుచేస్తారు. చాలా రంగులను ప్రధాన వర్ణాలను కలపడం ద్వారా తయారుచేస్తారు. సాధారణంగా ఈ రంగులను రైతులు స్వయంగా తయారుచేసి అమ్ముతుంటారు. సహజంగా దొరికే వస్తువులను పొడి చేసి, వాటి నుంచి రంగులు తయారుచేయడం వీరికి బాగా తెలుసు. ఈ ప్రక్రియ హోలీ పండుగకు కనీసం రెండు మూడు నెలల ముందు ప్రారంభిస్తారు. అటువంటి కొన్ని రంగులు...
నారింజ రంగు లేదా ఎరుపు
పలాస పుష్పాలు ఎరుపు వర్ణంలో ఉంటాయి. వీటిని అగ్నిపూలు అని కూడా అంటారు. అంతేకాదు ఈ పూలు అరణ్యంలో ఎర్రగా కనిపిస్తూ, దావాగ్నిలా భాసిస్తాయి. ఈ పూల నుంచి ఎరుపు రంగును సహజంగా తయారుచేసుకోవచ్చు. ఇంకా ఎర్రచందనం పొడి, ఎండబెట్టిన మందార పూలు, మద్ది చెట్టు కాండం, ఎర్రముల్లంగి, దానిమ్మ... వీటి నుంచి కూడా ఎరుపు రంగు త యారుచేసుకోవచ్చు. పసుపులో నిమ్మరసం కలపడం వల్ల కూడా ఎరుపు లేదా నారింజరంగు తయారవుతుంది. ఇంకా నీళ్లలో కుంకుమపువ్వు వేసి నీటిని మరిగిస్తే కూడా ఎరుపు రంగు తయారవుతుంది.
ఆకుపచ్చ రంగు...
గోరింటాకు, గుల్‌మొహర్... చెట్ల ఆకులను ఎండబెట్టి ఈ రంగు తయారుచేసుకోవచ్చు. కొన్ని ప్రాంతాలలో వసంత ఋతువులో పచ్చగా వచ్చే చిగుళ్లను, మూలికలను కలిపి ఈ రంగు తయారుచేసే సంప్రదాయం ఉంది.
పసుపు పచ్చ...
మనం ఉపయోగించే పసుపు స్వయంగా పచ్చ వర్ణం కలిగి ఉంటుంది. పసుపు కొమ్ముల నుంచి తయారయ్యే సహజ రంగు ఇది. కొన్నిసార్లు పసుపుకి మంచి ఛాయ రావడానికి పసుపులో సెనగపిండి కలుపుతారు. ఇంకా...మారేడుకాయ, చేమంతి జాతులకు చెందిన పూలను సైతం పసుపుపచ్చ రంగు తయారుచేయడానికి వినియోగించుకోవచ్చు.
ఇండిగో లేదా ఊదారంగు...
నల్ల ద్రాక్ష, నీలిరంగు జాతికి చెందిన ఇతర పుష్సాలు, ఫలాలు... వీటితో సహజంగా నీలిరంగును తయారుచేస్తారు. మజంటా లేదా పర్పుల్ (కుసుంభ లేదా ఊదా) కుసుంభ లేదా ఊదారంగు తయారీకి బీట్‌రూట్‌ను ఉపయోగిస్తారు. బీట్‌రూట్‌ను నీటిలో వేసి ఉడికించి ఈ రంగును సహజంగా తయారుచేసుకోవచ్చు.
గోధుమరంగు
ఎండిన తేయాకు నుంచి ఈ రంగును తయారు చేసుకోవచ్చు. టీ డికాక్షన్ తయారుచేయడం తెలిసిందే. అలా ఈ రంగును తయారుచేసుకోవచ్చు. ఇంకా నల్ల ద్రాక్ష, ఉసిరి, బొగ్గు... వీటిని ఉపయోగించి కూడా ఈ రంగును తయారుచేస్తారు.
- డా. పురాణపండ వైజయంతి
హోలీ ప్రత్యేకంగా వ్రజ్ ప్రాంతానికి చెందినది. ఈ పండుగ... శ్రీకృష్ణుడు, మధుర, బృందావనం, నంద గ్రామం ... పదాలతో ముడిపడి ఉంటుంది. వ్రజ్, మధుర ప్రాంతాలలో హోలీ పండుగను వారం రోజుల పాటు సంబరంగా జరుపుకుంటారు. హోలీ సందర్భంగా సూర్యాస్తమయం అయిన తర్వాత నాలుగు రోడ్ల కూడలిలో... పిడకలు, కర్రలను మంట పెట్టడానికి అనువుగా నిలబెట్టి, పై భాగంలో ప్రతిమను ఉంచి, ఆ ప్రతిమను హోలికగా భావించి, దహనం చేస్తారు. మంట మండుతున్నంతసేపు... పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ మంట చుట్టూ తిరుగుతారు. హోలిక మరణించిందన్న సంతోషంతో ఈ విధంగా చేస్తారు.
హెర్బల్ హోలీ