ప్రేమకు టూ వీక్స్ నోటీస్... | Two Weeks Notice to love ... | Sakshi
Sakshi News home page

ప్రేమకు టూ వీక్స్ నోటీస్...

Published Thu, Apr 21 2016 8:19 AM | Last Updated on Sun, Sep 3 2017 10:21 PM

ప్రేమకు టూ వీక్స్ నోటీస్...

ప్రేమకు టూ వీక్స్ నోటీస్...

హాలీవుడ్/రొమాంటిక్ కామెడీ

ప్రేమకథల్లో అలకలు, దాగుడుమూతలు, విరహాలు, వేదనలు ఎప్పుడూ బాగుంటాయి. అందులోనూ ఆ ప్రేమికులకు ఆత్మాభిమానం కాస్త ఎక్కువ ఉంటే ఇక చెప్పనక్కర్లేదు. ఆనాటి యద్దనపూడి సులోచనారాణి నవలల నుంచి మొన్నటి ‘ఖుషి’ వరకూ ఇది సక్సెస్‌ఫుల్ ఫార్ములా. ఈ ఫార్ములాని హాలీవుడ్ కూడా వదిలిపెట్టలేదు. వందలాది కోట్ల రూపాయల వ్యయంతో భారీ యాక్షన్, ఫాంటసీ చిత్రాలు తీస్తూనే ఉన్నా... రొమాంటిక్ కామెడీలను ఎప్పటికప్పుడూ తీస్తూనే ఉంటుంది. బాక్సాఫీస్‌ను కొల్లగొడుతూనే ఉంటుంది.

  

2015లో ‘పీపుల్స్’ అనే పాపులర్ పత్రిక శాండ్రా బుల్లక్‌ని ప్రపంచ సౌందర్యరాశుల్లో ఒకరిగా పేర్కొంది. హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ కూడా శాండ్రా బుల్లక్కే. శాండ్రా బుల్లక్‌కి, దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య చక్కటి ప్రొఫెషనల్ రిలేషన్‌షిప్ ఉంది. 1999లో వచ్చిన ‘ఫోర్సెస్ ఆఫ్ నేచర్’కు వారిద్దరూ కలిసి పనిచేశారు. ఆ సినిమా హిట్. దాంతో శాండ్రా బుల్లక్ నిర్మాతగా మారి 2000లో ‘మిస్ కన్‌జీనియాలిటీ’ సినిమా నిర్మించింది. ఆ సినిమా సక్సెస్ అయి, దాని సీక్వెల్ కూడా వచ్చింది.

 
మార్క్ లారెన్స్ ఓ బాస్‌కి, సెక్రటరీకి మధ్య రొమాంటిక్ కామెడీ కథ రాశాడు. సహజంగానే హీరోయిన్‌కి ప్రాధాన్యత ఉన్న ఆ కథ శాండ్రా బుల్లక్‌కి తెగ నచ్చేసింది. ఆ కథని తనే నిర్మించడానికి ముందుకొచ్చింది.

 
అలాగే హీరో హ్యూగ్రాంట్‌కి - దర్శకుడు మార్క్ లారెన్స్‌కి మధ్య నుంచి సక్సెస్‌ఫుల్ రిలేషన్ ఉంది ‘టూ వీక్స్ నోటీస్’తో ప్రారంభమైన వాళ్ల కాంబినేషన్ ఆ తర్వాత నాలుగు సక్సెస్‌ఫుల్ సినిమాలు అందించింది. అలాగే యాక్షన్ చిత్రాల దర్శకుడు క్వెంటీన్ టొరంటినోకి మార్క్ లారెన్స్ అంటే చాలా అభిమానం. టొరంటినోకి విపరీతంగా నచ్చిన సినిమాల్లో ‘టూ వీక్స్ నోటీస్’ ఒకటి. 60 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా 199 మిలియన్ డాలర్ల పైన వసూలు చేసింది.

 
ఇక కథ విషయానికొస్తే...

లూసీ కెల్సన్ (శాండ్రా బుల్లక్) ఓ లాయర్. న్యూయార్క్‌లో పర్యావరణ సమతుల్యతని కాపాడటం కోసం పోరాడుతుంటుంది. కోటీశ్వరుడు అయిన జార్జి వేడ్ (హ్యూగ్రాంట్) మహా పొగరుబోతు. తనకి తెలిసిందే లోకం, తను చెప్పిందే ధర్మం అనుకుంటూ ఉంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో విపరీతంగా సంపాదిస్తుంటాడు.

 
లూసీ బాల్యం ‘కోనీ ఐలాండ్ కమ్యూనిటీ సెంటర్’లో నడుస్తుంది. ఇప్పుడా కమ్యూనిటీ సెంటర్‌ని కూల్చేసి, ఆ స్థానంలో వేరే వెంచర్ ప్రారంభిద్దామనుకుంటాడు జార్జి. ఆ కమ్యూనిటీ సెంటర్‌ని కాపాడుకునే ప్రయత్నంలో జార్జిని కలిసి, రిక్వెస్ట్ చేస్తుంది లూసీ. తన సలహాదారు స్థానంలో పనిచేస్తే కమ్యూనిటీ సెంటర్ జోలికి రానంటాడు జార్జి. అతను జల్సారాయుడని, అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతుంటాడని తెలిసి కూడా లూసీ జార్జి దగ్గర చేరుతుంది. జార్జికి ఏమీ తెలియదని, బిజినెస్ వ్యవహారాల్లోనే కాదు.. వ్యక్తిగత అలంకరణ, అలవాట్లలో కూడా అతనికి గెడైన్స్ అవసరమని చేరిన కొద్దిరోజులకే లూసీకి తెలుస్తుంది. ఇద్దరి మధ్య తెలియకుండానే ఓ సాన్నిహిత్యం ఏర్పడుతుంది. మనసులో ఉన్న ప్రేమ బయటికి చెప్పుకోలేని పరిస్థితి.

 
అలాంటి పరిస్థితుల్లో లూసీ ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్తుంది. జార్జి దగ్గర నుంచి అర్జెంట్‌గా రమ్మని మెసేజ్ వస్తుంది. ఏమిటా అని హడావుడిగా పరుగులు తీసి వెళ్లేటప్పటికి తీరా.. ఏ సూట్ వేసుకోవాలో తెలియక సలహా కోసం పిలిపిస్తాడు జార్జి. ఇలా ప్రతి చిన్న విషయానికి, అడ్డమైన విషయానికి తనమీద ఆధారపడటం లూసీకి చిర్రెత్తుకొస్తుంది.

 

ఉద్యోగం మానెయ్యాలని నిర్ణయించుకుని రెండు వారాల నోటీస్ ఇస్తుంది. జాబ్ మానెయ్యవద్దని జార్జి బతిమిలాడతాడు. వేరే చోట లూసీకి ఉద్యోగం రానివ్వకుండా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి లూసీ ఉద్యోగం మానెయ్యాలంటే, ఆమె స్థానంలో మరొకరిని నియమించమంటాడు జార్జి. జునె కర్వర్ (అల్సియా విట్)ని తన ప్లేస్‌లో పెడుతుంది లూసీ. జునె అందంగా ఉండటమే కాదు, జార్జిని కవ్విస్తుంటుంది. జునె ప్రవర్తన లూసీలో చిన్నపాటి అసూయని, కలవరాన్ని రేకెత్తిస్తుంది. లూసీ తన దారిన తాను వెళ్లిపోతుంది. ఆమె దూరమయ్యాకే ఆమె విలువ తెలుసుకుంటాడు జార్జి. మరోవైపు లూసీ పరిస్థితి అదే! జార్జినే అనుక్షణం తల్చుకుంటుంది. ఉద్యోగానికి రెండు వారాల నోటీస్ ఇవ్వవచ్చు కాని ప్రేమకి నోటీస్ ఇవ్వలేరు కదా! చివరికి అలకలు, విరహాన్ని దాటుకుని ఇద్దరు ప్రేమికులు కలుస్తారు.  పక్కా తెలుగు సినిమా కథలా ఉండటం వల్ల ఏమో ఈ ‘టూ వీక్స్ నోటీస్’ ‘బాస్’ సినిమాకి స్ఫూర్తి అయింది. నాగార్జున, నయనతార నటించిన ‘బాస్’ సినిమాలో ‘టూ వీక్స్ నోటీస్’ ప్రభావం బాగా కనబడుతుంటుంది.

 

 - తోట ప్రసాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement