విశ్వకల్యాణ యోగం | Universal Welfare yogam | Sakshi
Sakshi News home page

విశ్వకల్యాణ యోగం

Published Fri, Jan 2 2015 12:09 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

విశ్వకల్యాణ యోగం - Sakshi

విశ్వకల్యాణ యోగం

సన్నిధి
 
ప్రకృతిపై ఎప్పుడు వికృతి దాడిచే స్తూనే  ఉంటుంది (ఉదా- సార్స్, స్తైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ, ఎ బోలా, మ్యాడ్ కౌ ఇత్యాదులు) మానవశరీరంపై ప్రతినిమిషం దాదాపు 50, 000 సూక్ష్మ క్రిములు (బాక్టీరియా) దాడిచేస్తూనే ఉంటాయి. మన రోగనిరోధక శక్తి వాటిని నిరోధిస్తూ ఉంటుంది. ఆ శక్తి మనకు తగ్గినపుడు రోగగ్రస్థులమవుతాం. దేహం - దేశం రెండూ ఒక్కటే. భూమిపై ఏ జీవీ ప్రయత్నించని విధంగా మానవుడు వివిధ ఆయుధాలతో, అణుశక్తి విస్ఫోటనశక్తితో ప్రపంచంలో జీవకణశక్తిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అటువంటి వినాశకారక ఆలోచనలు మార్చుటకు చంద్ర సంబంధమైన సోమలతతో అత్యంత కఠోర నియమావళితో చేయు మా-నవ ప్రయత్నమే సోమయాగం. ఏ యజ్ఞమైనా ప్రకృతిని కాపాడడానికే. శరీరంలో వచ్చే మార్పులను ఎలా తెలుసుకుంటామో దేశకాల గమనంలో మార్పులు, మాయాజాలాన్ని గ్రహించి దేశ రక్షణ చేయడమే యాగం.
 
సోమయాగం అంటే... కలియుగంలో చేయదగిన మహాయాగాలలో అప్తోర్యామం ఏడవది. అగ్నిహోత్రంతో సశాస్త్రీయ సనాతన భారతీయ వేద విజ్ఞాన విధానం ద్వారా  ప్రకృతిలో జీవ శక్తిని పెంచేందుకు సోమలత నుండి తీయు సోమరసాన్ని ప్రకృతికి (దేవతలకు) సమర్పించటమే సోమయాగం. సోమ అనగా చంద్రుడు అని, (స+ఉమ) ఈశ్వరుడు అని అర్థం. ఉమ అంటే శక్తి. శివుడు శక్తి సహితుడు. అంటే పదార్ధాన్నీ, శక్తినీ కలిపి సంధాన పరిచే చాంద్రీయశక్తి సోమలత. ఇది ఒక లత (తీగ). భూమండలంపై ప్రతి మొక్క (ఔషధి) చంద్రశక్తి వల్లనే పెరుగుతుంది. చంద్రకళలతో సమానంగా పెరుగుతూ, సమానంగా తరిగే ఏైకక ఓషధీరాజం, అమితంగా చంద్రశక్తిని గ్రహించే ఏకైక లత సోమలత. ఇది హిమాలయాలోనూ,  కొంకణ ప్రాంత అరణ్యాలలోనూ లభిస్తుంది.
 
జీవజాలానికి ప్రయోజనం ఏమిటి?

 జీవజాతి మనుగడకి అవసరమైన స్వచ్ఛమైన నీరు, గాలి, భూమిని శుద్ధిచేయాలంటే పంచభూతాలలో మిగిలిన అగ్ని, ఆకాశం (శూన్యం లేదా శబ్దం)ల ద్వారా మాత్రమే సాధ్యం. ఆజ్యం, ఆవునేయి, సోమరసం, సమిధలు, ఔషధులు... ఇవన్నీ అగ్నిహోత్రంద్వారా, మంత్ర శబ్దాలద్వారా ఆకాశంలోకి ప్రవేశించి విశ్వంలో తగ్గినటువంటి జీవశక్తిని పెంచుతాయి. తద్వారా స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, అన్నీ శుద్ధి అవుతాయి.

సోమయాగం నియమాలు

సోమయాగాలు 3 రకాలు. ఒకరోజులో పూర్తి అయ్యేది ఏకాహం. పన్నెండు రోజులలో పూర్తి అయ్యేది అహీనం. పన్నెండురోజులకు పైన మరికొన్ని రోజులలో పూర్తి అయ్యేది సత్రం. అప్తోర్యామంలో సత్రం ఒకరోజే కాబట్టి ఏకాహం అనబడుతుంది. మొదటి మూడు రోజులు దీక్షాదినాలు. తరువాతి ఐదు రోజులు రోజుకో వరుస శ్యేనచితిని పేర ్చటం. తొమ్మిదవ రోజు శ్యేనచితిలో అగ్నిని ప్రవేశపెట్టి నిర్విరామంగా శస్త్ర స్తుతులతో సుత్యంలో సోమరసాన్ని సమర్పించి అవభృత స్నానంతో యాగపరిసమాప్తి. ఈ అప్తోర్యామం ఏకాహం.

ఫలం ఏమిటి?

 సోమయాగం ఆచరించటం వల్ల ప్రకృతికి ఏది అవసరమో అవి తప్పనిసరిగా ప్రాప్తిస్తాయి. ఆవునేతితో హోమం చేస్తే ప్రాణ వాయువు పెరుగుతుంది. సోమరసంతో హోమం చేస్తే ప్రకృతిలోని సమస్త మూలకణాలూ శుద్ధిచేయబడి జీవశక్తి పెరుగుతుంది. సోమయాగం జరిగినచోటే గాక హోమధూమం వెళ్ళినచోటల్లా స్వచ్ఛమైన గాలి ఉంటుంది. భూగర్భజలాలు పైకి అందుతాయి. భూమిలో ఖనిజ శక్తి పెరుగుతుంది. సకాల వర్షాలు పడతాయి. జీవజాతులలో వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. హానికర సూక్ష్మక్రిములు (బాక్టీరియా) ఉండవు. ఆవులు, గేదెలు పాలు ఎక్కువ ఇస్తాయి. పాలలో పోషకవిలువలు పెరుగుతాయి. సస్య వృద్ధి (పంటలు) కలుగుతుంది. ఆ ప్రాంతంలో గర్భిణీ స్త్రీలకు సిజేరియన్ ఆపరేషన్లు తగ్గి సహజమైన కాన్పులు కలుగుతాయి. ప్రమాదాలు తగ్గుతాయని శ్రుతి (వేదం) చెప్తున్నది. ఇది శాస్త్రీయ పరిశోధనద్వారా నిరూపితం.

సోమయాగ ప్రధాన దేవత ఎవరు?

సోమ యాగ ప్రధానదేవత ఇంద్రుడే. ఇంద్రుని అధిపత్యంలో ప్రకృతికి శక్తినిచ్చే పంచభూతాలు, దిక్పాలాకాదులే ప్రధానం. ఇంద్రుడు సర్వదేవతా స్వరూపుడు. కాబట్టి దేవతలలో ప్రథముడైనఇంద్రునికి ప్రీతికరంగా చేయు యాగాలే సోమయాగాలు.
 విశేషాంశాలు: ఇంద్రుడు దేవతాధిపత్యాన్ని అసురుడైన బలిచక్రవర్తితో కోల్పోతే అవతార స్వరూపుడైన శ్రీ మహావిష్ణువు స్వయంగా ఉపేంద్రునిగా (వామనుడు) అవతరించి ఇంద్రునికి తిరిగి ఆధిపత్యాన్ని ఇచ్చాడు. మనం సర్వసామాన్యంగా చేయు చండీ హోమంలో (చండీపాఠంలో) కూడా అమ్మవారు మహిషాసురుడు, చండ, ముండ, శుంభ, నిశుంభాది రాక్షసులను సంహరించింది కేవలం ఇంద్రుని కోసమే. పురాణాదులలో ఎప్పుడు ఇంద్రుడు అసురుల ద్వారా పరాజితుడైనా శ్రీ విఘ్నేశ్వరుడు, సాంబశివుడు, అమ్మవారు, సుబ్రహ్మణ్యేశ్వరుడు... ఇలా ప్రతీ దేవతా ఇంద్రాధిపత్యాన్ని నిలుపుటకై అసురులతో యుద్ధం చేశారు. మనం కూడా ప్రకృతమైన ఉగ్రవాదం, అతివాదం, వైపరీత్యాల నుండి రక్షింపబడుటకు ఇంద్ర ప్రీతికరమైన సోమయాగాలు నిర్వహించాలి.

  సోమయాగాలు 7...అవి 1) అగ్నిష్టోమం 2) అత్యగ్నిష్టోమం 3) ఉక్థ్యం 4) షోడశీ  5) వాజపేయం - 6) అతిరాత్రం 7) అప్తోర్యామం
 సోమయాగ జంతువులు... సోమ యాగంలో ప్రధాన జంతువులు తెల్ల గుర్రం, నల్లగుర్రం, ఆవు- దూడ, పాలిచ్చు మేక, కొమ్ములు లేని మగ మేక. కప్ప, తాబేలు, సర్పం.

 మా-నవ అంటే  కొత్త జన్మ వద్దు అని అర్థం. మోక్షానికి చేరుకోడానికి వేదాలు చెప్పిన 48 సంస్కారాలలో కనీసం మూడోవంతు అంటే 16 సంస్కారాలనైనా ఆచరించాలి. సంస్కారశుద్ధిని పొందినవాడికే జన్మరాహిత్యం. అందరూ విడిగా చేయలేకపోయినా ఇటువంటి మహాయాగాలలో పాల్గొంటే ఆ ఫలితం అందరికీ లభిస్తుంది.

భారతదేశంలో యజ్ఞాలు చేస్తే విశ్వశాంతి ఎలా అవుతుంది?

భారత (భరతులు) అంటే యజ్ఞం చేయువారు అని అర్థం. భరత శబ్దం వేదాలలో చెప్పబడింది. మనం నోటితో తిన్న ఆహారం కుక్షిని (కడుపు) చేరి, శరీరంలోని అన్ని అంగాలకు కావలసిన శక్తిని ఎలా ఇస్తుందో సమస్త భూమండలానికి ప్రధాన మధ్యభాగమైన భారతదేశంలో యజ్ఞ, యాగాదులు ఆచరించుటవలన విశ్వమంతటికి ఆ జీవశక్తి చేరుతుంది.
 
గతంలో నిర్వహించిన యాగాల ఫలితాలు ఏమిటి?  

 2012లో భద్రాచలంలో నిర్వహించిన అతిరాత్రం - మహోత్కృష్ట సోమయాగం సందర్భంగా సమతాలోక్ సేవా సమితి - సేక్రెడ్ సోమ వేదిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన శాస్త్రీయ పరిశోధనలలో అనేక అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. ప్రధానంగా ప్రభుత్వ ఆసుపత్రులు, వాతావరణ శాఖ, పోలీసు శాఖ, జలవనరుల శాఖ, గ్రామీణ నీటిపారుదల శాఖ, ఆచార్య ఎన్.జి.రంగా (ప్రస్తుత ప్రొ.జయశంకర్) అగ్రికల్చరల్ యూనివర్సటీఇత్యాది ప్రభుత్వ శాఖల సమన్వయంతో శాస్త్రీయ పరిశోధనలు చేశారు. నెలరోజుల ముందుగా భద్రాచల పరిసర ప్రాంతాలలో భూసారం, జలం, పశువులు, గాలి, గర్భిణీ స్త్రీలలో సాధారణ కాన్పులు, ప్రమాదాలు, వర్షపాతం... ఇవన్నీ నమోదు చేసి యజ్ఞసమయంలోనూ, యజ్ఞం పూర్తయిన తరువాత దాదాపు సంవత్సరం పాటు పరిశోధన నిర్వహించారు.

సోమయాగం వల్ల మానవాళికి ఏ ఋణం తీరుతుంది?

మానవునికి ఆజన్మాంతం దేవ,  ఋషి, పితృ ఋణములను మూడు ప్రధానమైన ఋణాలు ఉంటాయి. ధర్మాచరణ వల్ల దేవఋణం, అర్థజ్ఞాన సముపార్జన వలన ఋషిఋణం, కామం వలన పితృఋణం తీరతాయి.  ప్రస్తుతం అందరూ అర్థ కామాలనే అనుభవిస్తూ ఋషి ఋణ పితృఋణాలు మాత్రం తీర్చుకుంటున్నాం. కానీ దేవఋణం తీరనిదే మోక్షం ప్రాప్తించదు. దేవఋణం తీరాలంటే మనందరమూ యజ్ఞం ఆచరించాలి.  సోమయాగంలో భాగమవటం వలన వంశంలో సర్పశాపం, పితృశాపం, దైవ శాపాలు నివారించబడి వంశాభివృద్ధి కలుగుతుంది. అందువల్లే యజ్ఞం ఆచరించటం ఆవశ్యకం.

యజ్ఞ ఫలితం అందరికి సమభాగంగా ఎలా వస్తుంది?

నేటి కాలమాన పరిస్థితులలో అందరికీ యజ్ఞయాగాలాచరించి దైవఋణం తీర్చుకోవటం అసాధ్యం. అందుకోసమే మనమందరం సామూహికంగా దైవఋణాన్ని తీర్చుకొనటానికి యజ్ఞఫలాన్ని పొందే విధానమే ఈ ఉత్కృష్ట అప్తోర్యామశ్రౌత మహాయాగాలు, మహాసౌర స్మార్త మహాయాగాలు చేయుటకు ప్రజాహిత సేవా సమితి ఈ బృహత్తర కార్యాన్ని సంకల్పించింది.పైన పేర్కొన్న విషయాలన్నీ స్వోదితం కావు. ఎందరో మహానుభావులు యజ్ఞ విజ్ఞానాన్ని శోధించి సాధించిన ఫలిత సారాంశాలు.
 - కేసాప్రగడ ఫణీంద్ర రాజశేఖర శర్మ
 కార్య నిర్వాహక సభ్యులు, ప్రజాహిత సేవా సమితి
 
అప్తోర్యామం... ఎప్పుడు..? ఎక్కడ?

జనవరి 20, మంగళవారం నుండి ఫిబ్రవరి 1, ఆదివారం వరకు కర్నూలు జిల్లా గార్గేయపురంలోని మయూరి సరోవర్ లే ఔట్, కర్నూలు- నందికొట్కూర్ రోడ్ (10 కి.మీ. దగ్గర) అప్తోర్యామం అని పిలవబడే మహాగ్నిచయన పూర్వక శ్రౌత మహాసోమయాగం, మహాసౌరం అని పిలవబడే మహోత్కృష్ట విశ్వశాంతి మహాయాగాలు జరగనున్నాయి. ఈ యాగాలలో ప్రతి ఒక్కరూ పాల్గొని, యాగఫలాలు అందుకోవలసిందిగా ప్రజాహిత సేవాసమితి కోరుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement