శాకాహారంతో గుండెకు మేలు..
గుండెజబ్బులకు దూరంగా ఉండాలంటే శాకాహారమే మేలని నిపుణులు చెబుతున్నారు. రోజువారీ ఆహారంలో కనీసం 70 శాతం శాకాహారం ఉండేలా చూసుకుంటే, గుండెజబ్బులు వచ్చే ముప్పు 20 శాతం వరకు తక్కువగా ఉంటుందని లండన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ నిపుణులు నిర్వహించిన విస్తృత అధ్యయనంలో తేలింది. పూర్తిగా ఒక దశాబ్దం పాటు 4.50 లక్షల మంది ఆహారపు అలవాట్లపై ఈ అధ్యయనం నిర్వహించారు. శాకాహారంతో పాటు రోజుకు మూడు కప్పుల వరకు కాఫీ తాగే వారిలో గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు ఈ అధ్యయనంలో గుర్తించారు.
పూర్తిగా శాకాహారం తీసుకోవడం లేదా రోజువారీ భోజనంలో శాకాహారాన్నే ఎక్కువగా తీసుకోవడం ద్వారా గుండెజబ్బుల కారణంగా సంభవించే అకాల మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని భరోసా ఇస్తున్నారు.