సందడి సరి కంటిన్యూ మరి
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అందరూ పండుగలా జరుపుకున్నారు. ఇప్పటికే ఆసనాలతో ఆరోగ్యానందాలను అందుకుంటున్నవారు మరింత స్ఫూర్తిని పొందితే, ఈ రోజు, రేపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్న వారు... ఎంతో మంది యోగసాధనకు నడుం బిగించారు. అటువంటి ప్రారంభ సాధకుల్లో ఎన్నో అపోహలు, ఎన్నో సందేహాలు ఉంటాయి. అవి అడుగడుగునా అడ్డుపడుతుంటాయి. వీలైనంత వరకూ వాటిని తీర్చే ప్రయత్నమే ఈ అవగాహనా కథనం. యోగా మీద అవగాహన పెరిగింది కానీ... ప్రక్రియ మీద అవగాహన పెరగాలి.
అపోహ: జిమ్‌లో వర్కవుట్స్ చేస్తే వచ్చే శక్తి యోగాలో రాకపోవచ్చు.
వాస్తవం: మానవ శరీరానికి బలం, సామర్థ్యం, శక్తి, బ్యాలెన్స్, ఫ్లెక్సిబులిటీ... ఈ ఐదూ తప్పనిసరిగా కావాలి. జిమ్‌కి వెళితే బలం, జాగింగ్‌కి వెళితే సామర్ధ్యం, మార్షల్ ఆర్ట్స్ వంటివి శక్తి... ఇలా ఒక్కోదాని వల్ల ఒక్కో ఫలితం వస్తుంది. అయితే కేవలం యోగా ద్వారా మాత్రమే ఈ ఐదూ లభిస్తాయి.
అపోహ: యోగాపెద్ద వయసు వారికే కానీ యూత్‌కు కాదు.
వాస్తవం: వయసు ముదిరిన వాళ్లు, ఇంటి పట్టున ఉండే వృద్ధులకు యోగా అనేది పెద్ద అపోహ. నిజానికి 9 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాల వరకూ ఏ వయసు వారైనా యోగసాధన చేయవచ్చు. చిన్న వయసు నుంచి చేయడం వల్ల మరింత అద్భుతమైన ఆరోగ్యలాభాలు కలుగుతాయి.
అపోహ: అనారోగ్యం తగ్గడానికే యోగా... ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదు.
వాస్తవం: ఇది తప్పు. మన దేశంలో యోగాని చికిత్సాపద్ధతిగానే ఉపయోగిస్తున్నారు తప్ప శారీరక సామర్ధ్యం కోసం వాడడం లేదు. యోగా... రోగం రాకుండా నివారించడానికి, చికిత్సా పద్ధతిగా, ఫిట్‌నెస్ సాధనకూ ఉపకరిస్తుంది.
అపోహ: యోగాని నిర్ణీత సమయంలోనే చేయాలి.
వాస్తవం: రోజూ ఒకటే సమయంలో చేస్తే మంచిదే అయినా... అలా కాకపోయినా నష్టమేం లేదు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో ఎప్పుడైనా చేయవచ్చు. అయితే ఆహారం తీసుకోవడానికి ఆసనాలు వేయడానికి 4గంటలు వ్యవధి ఉండాలి. అలాగే పండ్లు తీసుకుంటే మాత్రం గంట వ్యవధి చాలు. ద్రవపదార్థాలు తీసుకుంటే పెద్దగా గ్యాప్ అక్కర్లేదు.
అపోహ: యోగా విశాలమైన స్థలంలోనే చేయాలి.
వాస్తవం: అక్కర్లేదు. ఎక్కడైనా సరే చేయవచ్చు. గాలి, వెలుతురు ధారాళంగా ఉన్న 6/3 అడుగుల స్థలం సరిపోతుంది. అయితే ఆసనాలు వేసే నేల సమతులంగా ఎగుడుదిగుళ్లు లేకుండా ఉండాలి. లేకపోతే వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే మంచం మీద కూడా చేయవచ్చు. అయితే పడుకుని చేసే ఆసనాల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
అపోహ: ఆసనాలకు ముందు దేహానికి ప్రిపరేషన్ అక్కర్లేదు...
వాస్తవం: తప్పకుండా కావాలి. ఉదయం వేళ అయితే మల, మూత్ర విసర్జనలు అన్నీ కావించాలి. మూత్రాశయం, పెద్ద ప్రేగు ఖాళీగా ఉండడం వల్ల సాధన సులువు అవుతుంది.
అపోహ: సాధన సమయంలో నీరు బాగా తాగాలి.
వాస్తవం:ఆసనాలు వేసేటప్పుడు దాహం వేస్తే స్వల్పంగా గొంతు తడుపుకోవాలే తప్ప లీటర్ల కొద్దీ నీరు తాగడం సరైంది కాదు. ముఖ్యంగా బోర్లా పడుకుని చేసే ఆసనాల వల్ల మూత్రాశయం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఎక్కువ నీరు తాగడం సరైంది కాదు.
అపోహ: సాధన అనంతరమే స్నానం చేయాలి. ముందు చేయరాదు.
వాస్తవం:ఆసనాలు వేసి, చెమట పట్టాక స్నానం చేద్దాం అనుకుంటారు. కానీ స్నానం చేసిన తర్వాత ఆసనాలు చేస్తే చాలా మంచిది. స్నానంతో చర్మ గ్రంథులు శుభ్రపడి, యోగా చేసిన సమయంలో పట్టే చెమట వల్ల మలినాలు సులువుగా బయటకుపోతాయి.
అపోహ: జిమ్‌కు వెళ్లే వారికి యోగా అక్కర్లేదు.
వాస్తవం: జిమ్ వల్ల కండరాలు వృధ్ధి చెందుతాయి. దీని వల్ల టైప్ 2 మజిల్ వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే మజిల్ బాగా గట్టి పడిందో ఆక్సిజన్ ఆ కండరం లోపలి కణజాలంలోకి పూర్తిగా వెళ్లదు. దీని వల్ల చెమట పట్టినప్పటికీ కూడా శరీరంలోని ఫ్రీరాడికల్స్ బయటకి పోని పరిస్థితి తలెత్తవచ్చు. యోగా చేసినట్లయితే టైప్ 1ఎ, 1బి అనే పల్చగా, మృదువుగా ఉన్న కండర వ్యవస్థ నిర్మితమవుతుంది. తద్వారా ఆక్సిజన్ లోపలికి బాగా చొచ్చుకుపోయి ప్రతి కణజాలానికీ ఆక్సిజన్ అందుతుంది. దీంతో శరీరంలోని కండరాలు అన్నీ సమర్ధవంతంగా పనిచేస్తాయి. అథ్లెట్స్ లేదా ఇతరత్రా ప్రత్యేకమైన అవసరాలు ఉన్నవారికి తప్ప రొటీన్ హెల్త్, ఫిట్‌నెస్ కోసం యోగానే మంచిది.
అపోహ: ఆసనాలయ్యాక వెంటనే ఇతర పనులకు రెడీ కావచ్చు.
వాస్తవం:ఆసనాలు వేయడం పూర్తయ్యాక శవాసనంలో కొంత సేపు విశ్రాంతి తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి మనసుకు ప్రశాంతత పరిపూర్ణంగా కలుగుతుంది.
అపోహ: యోగా మ్యాట్ మీదనే చేయనక్కర లేదు. నేలమీదైనా చేయవచ్చు.
వాస్తవం:తప్పకుండా మ్యాట్ మీదనే చేయాలి. కనీసం 6 ఎం.ఎం మందం ఉన్నది వాడితే మంచిది. అప్పుడే సాధన సమయంలో గ్రిప్ ఉండి, మోకాళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. శరీరం, భూమికి మధ్య అనుసంధానించబడినప్పుడు రబ్బర్ మ్యాట్ లేదా పివిసి షీట్ గాని వినియోగిస్తే అది ఇన్సులేటర్‌గా ఉపయోగపడుతుంది. దాని వల్ల శక్తి మనకు సరైన రీతిలో వినియోగమవుతుంది.
అపోహ: చెమట పట్టకపోతే సాధన సరిగా లేనట్టు...
వాస్తవం: చెమట బాగా పడుతోంది అంటే ఆక్సిడేటివ్ ఒత్తిడి బాగా పెరుగుతోందని, శరీరంలో ఆక్సిజన్‌స్థాయులు బాగా తగ్గిపోతున్నాయని అర్థం. కాబట్టి చెమటతో తడిసిపోతూ చేసే యోగా కన్నా... మధ్యలో కావల్సినంత శ్వాస బాగా తీసుకుంటూ, వదులుతూ ఆహ్లాదకరంగా చేసే సాధన వల్లనే సరైన ఆరోగ్యం చేకూరుతుంది.
అపోహ: వేగంగా చేయకపోతే ఉపయోగం ఉండదు...
వాస్తవం: 108 సూర్య నమస్కారాలు ఒకేసారి చేస్తే మంచి ఫలితం ఉంటుందని అనుకుంటారు. నాన్‌స్టాప్ యోగా సరికాదు. వేగంగా ఏ వ్యాయామాన్ని 3 నిమిషాలకు మించి చేసినా గుండె సామర్ధ్యం తగ్గే అవకాశం ఉంది.
అపోహ: ఆసనం వేయడంలో నైపుణ్యం వస్తేనే పూర్తి ఫలితం...
వాస్తవం: ఆసనం ఎంత వరకు వేయగలిగితే అంతవరకూ చేస్తే చాలు. అంతే తప్ప రాకపోయినా విపరీతంగా శ్రమిస్తూ చేయనక్కర్లేదు. బాగా నైపుణ్యం ఉన్న సాధకులు పూర్తి స్థాయిలో చేస్తున్న ఆసనం వల్ల కలిగే ఫలితాలు ఎంత బాగుంటాయో అలాగే ప్రారంభంలో ఉన్నవారు కొంత వరకూ చేసినా అంతే ఫలితం కలుగుతుంది. అన్ని అవయవాలను స్టిమ్యులేట్ చేయడమే యోగా పరమార్థం.
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
సమన్వయం: ఎస్. సత్యబాబు, సాక్షి ప్రతినిధి