భుజాలకు, చేతులకు శక్తినిచ్చే ఆసనాలు
యోగా
కుర్చీ సాయంతో చేసే యోగా కేవలం వయసు పైబడిన వారికి, అనారోగ్యంతో బాధపడేవారికి మాత్రమే అని అనుకుంటే అది అపోహ. శరీరంలో ఉన్న 640 కండరాలకు, 360 కీళ్లకు ఫ్లెక్సిబిలిటీ రావాలన్నా, శరీరంలోని FIBROMYALGIA అనే కండరాలు పట్టుకుపోయే సమస్య పరిష్కారం కావాలన్నా, అడ్వాన్స్‌డ్ ఆసనాలు నేర్చు కోవాలన్నా ఏ రకమైన సాధనాన్ని ఎంచుకోవాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు దానికి ఒకే ఒక సమాధానం కుర్చీ యోగా!
చతురంగాసన
మోకాళ్లు, అరచేతుల సపోర్ట్ మీద పిల్లి లేదా ఒంటె భంగిమలో విశ్రాంతి పొందుతూ ముందు కుడిపాదాన్ని ఆ తరువాత ఎడమపాదాన్ని కుర్చీ సీటులో వెనుక వరకూ తీసుకెళ్లి రెండు మోకాళ్లను నిటారుగా ఉంచాలి. వేళ్లు, షిన్ బోన్ కుర్చీకి సపోర్ట్ చేస్తూ అరచేతుల సపోర్ట్‌తో శరీరాన్ని స్ట్రెయిట్ లైన్‌లో ఉంచే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ ఆసన స్థితిలోకి వెళ్ళి 3 లేదా 5 సాధారణ శ్వాసల తరువాత పూర్వస్థితికి రావాలి.
జాగ్రత్తలు: చేతులు రెండూ భుజాల దూరంలో ఉంచాలి. మణికట్టు బలహీనంగా ఉన్నవారు నేల మీద ఉంచిన అరచేతులను భుజాల పొజిషన్ కన్నా ముందుకు ఉంచాలి. దీని వల్ల మణికట్టు మీద భారం ఎక్కువగా పడదు. అలాగే మోచేతులు కూడా భుజాలు దాటి బయటకు పోకుండా వీలైనంతవరకూ సమంగా ఉంచాలి.
ఉపయోగాలు: భుజాలు, మణికట్టు, నడుము భాగాలు బలపడతాయి. పొట్టలోని భాగాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. ఛాతీ పక్కన ఉన్న కండరాలు – లాటిస్సిమస్ డోర్సి, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ ఆబ్లిక్, పెక్టోరాలిస్ కండరాలకు టోనింగ్ జరుగుతుంది.
ప్రిపటేటరీ, ఫాలోఅప్ ఆసనాలు – అధోముఖ, ఊర్ధ్వముఖ శ్వాసాసనాలు, భుజంగాసనం.
రాజ కపోతాసన (ప్రిపరేటరీ)
చతురంగాసనంలో నుంచి మోకాళ్లను భూమికి దగ్గరగా తీసుకువచ్చి పాదాలను కుర్చీ సీటు ముందు భాగంలో తలను ఛాతీని అరచేతులను నేలకు గట్టిగా ప్రెస్ చేస్తూ, పైకి లేపాలి. భుజంగాసన స్థితి అయినప్పటికీ, తొడలు నేల మీద సపోర్ట్ పెట్టకపోవడం వలన నడుము భాగం ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. అందువల్ల లంబార్ స్పైన్‌కి చాలా రిలీఫ్ కలుగుతుంది. రాజ కపోతాసనానికి మంచి ప్రిపరేటరీ పోజ్‌గానూ సాధన చేయవచ్చు. ఇంతకు ముందు ఆసనంలో చెప్పబడిన కండరాలే కాకుండా రెక్టస్ ఎబ్డామినస్, ట్రాన్స్‌వర్స్ ఎబ్డామినస్, గ్లూటియస్ కండరాలు బాగా స్ట్రెచ్ చేయబతాయి.
ఉపయోగాలు
వెన్నెముక సమస్యకి ముఖ్యంగా లంబార్ స్పైన్ సమస్యలకు సయాటిక, పించ్ నెర్వ్ సమస్యలకు, ఛాతీ భాగాలు తెరుచుకోవడానికి, గ్రాయిన్ భాగాలు బలపడటానికి ఉపయోగపడుతుంది. చాలా వపర్‌ఫుల్ హిప్ ఓపెనర్. హిప్ ఫ్లెక్సర్ ఓపెన్ అవడానికి ఉపయోగపడుతుంది.
మయూరాసన (ప్రిపరేటరీ)
ముందు చెప్పబడిన రాజకపోతాసన నుండి పూర్వస్థితికి అంటే ఏదో ఒక రిలాక్సింగ్ పోజ్‌లోకి... అంటే మోకాళ్ళు నేల మీద ఉంచి పొట్టను ఛాతీని కూడా ఆనించి రెండు చేతులు మడచి గడ్డాన్ని చేతుల మీద ఉంచి కాళ్లను రిలాక్స్ చేయాలి. ఈ భంగిమలో కొంచెం సేపు విశ్రాంతి తీసుకుని తిరిగి పాదాలను కుర్చీలో ముందువైపు సీట్ అంచుకు సపోర్ట్‌గా ఉంచి మోచేతులు పొట్టకి ఇరువైపులా నొక్కుతూ చేతివేళ్లను వెనుకకు చూపించే విధంగా అరచేతులను పొజిషన్ తీసుకుంటూ శ్వాస వదులుతూ కాళ్లను పైకి లేపే ప్రయత్నం చేయాలి. కేవలం రెండు అరచేతుల ఆధారంగా శరీరం మొత్తాన్ని గాలిలో ఉంచే ఆసనమే మయూరాసనం. రెండు మూడు సాధారణ శ్వాసల తరువాత పూర్వస్థితికి రావాలి.
జాగ్రత్తలు: మణికట్టు దృఢంగా లేనివాళ్లు ఈ ఆసనం సాధనం చేయడం మంచిది కాదు. శరీర భారాన్ని కేవలం రెండు అరచేతుల మీద పైకి లేపాలి కనుక నిపుణుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి.
ఉపయోగాలు: భుజాలు, చేతులు దృఢంగా అవుతాయి. పొట్ట కండరాలకు మంచి టోనింగ్ జరుగుతుంది. రీ ప్రొడక్టివ్ సిస్టమ్ పనితీరు మెరుగుపడుతుంది. డయాబెటిస్ ఉన్న రోగులకు మంచిది. లైంగిక పటుత్వం పెరుగుతుంది.
⇒ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్ యోగా ఫౌండేషన్
⇒సమన్వయం: సత్యబాబు