ఉదయాన్నే లేవండి! ఉత్సాహాన్ని సొంతం చేసుకోండి!
మనలో చాలామందికి పొద్దెక్కాక లేవడం అలవాటు. దీన్ని సమర్థించుకోవడానికి కూడా బోలెడు కారణాలు ఉంటాయి. ఈ విషయాన్ని పక్కన పెడితే...త్వరగా లేవడం, త్వరగా పడుకోవడం మన ఆరోగ్య సంస్కృతిలో భాగం. అదే ఆరోగ్య రహస్యం కూడా!
‘‘మేము కూడా పొద్దున్నే లేవాలి అనుకుంటాం. ఎందుకో మరి వీలుకావడం లేదు!’’ అంటారా? అయితే కింద ఇచ్చిన సలహాలను పాటించి చూడండి.
త్వరగా నిద్రపోండి!
రాత్రి పది లేదా పదకొండుకల్లా నిద్రపోండి. మొదట్లో నిద్ర రాక పోవచ్చు. వారం రెండు వారాల్లో అది అలవాటుగా మారి నిద్రపడుతుంది.
అలారం... కాస్త దూరంగా!
మీ మంచం పక్కనే చేతికి అందుబాటు దూరంలో అలారం ఉండకూడదు. మనం సెట్ చేసిన టైమ్‌కు -
‘‘నిద్ర లే గురూ’’ అని అలారమ్ మనల్ని మేల్కొలుపుతుంది. మనమేమో నిద్రమత్తులో, దాని పీక నొక్కేసి మళ్లీ గుర్రు పెట్టి నిద్రపోతాం. అలారం దూరంగా ఉందనుకోండి... బెడ్ మీది నుంచి లేచి అలారం ఆఫ్ చేసే లోపు నిద్ర ఎగిరిపోతుంది.
పని చేయండి!
నిద్ర లేవగానే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పనిలో నిమగ్నం కండి. లేకపోతే మళ్లీ నిద్ర చుట్టుముడుతుంది. అందుకే బ్రష్ చేయడం, టీ చేయడం, తోటపని చేయడంలాంటివి చేయాలి.
ఒక విషయం
ఇటీవల జర్మనీలోని హైడెల్‌బెర్గ్‌కు చెందిన జీవశాస్త్ర ప్రొఫెసర్ ఒకరు వేకువజామునే నిద్ర లేచే విద్యార్థులు, ఆలస్యంగా నిద్ర లేచే విద్యార్థుల మీద ఒక అధ్యయనం నిర్వహించారు. ఆలస్యంగా నిద్ర లేచే విద్యార్థులతో పోలిస్తే, త్వరగా నిద్ర లేచే విద్యార్థులు చదువుతో పాటు అనేక విషయాల్లో చురుగ్గా ఉన్నట్లు కనుగొన్నారు.