చాలాసార్లు క్రైం ఉంటుంది.అన్నిసార్లు అనుమానాలు ఉంటాయి.కొన్నిసార్లు క్లూ ఉండదు.తెలివైన ఆఫీసరు అనుమానాన్ని క్లూగా మార్చాడు.అనుమానానికి పూతపూసి దుర్మార్గుణ్ణి పల్టీ కొట్టించాడు.మే 15, 2018. వరంగల్ జిల్లా హసన్‌పర్తి.రాత్రి తొమ్మిది దాటి ఏడు నిమిషాలు అయ్యింది. శివారులో రామూర్తి ఇల్లు అది. రామ్మూర్తికి 65 ఏళ్లు. అతనికి భార్య గంగాదేవికి 58.పిల్లలు పుట్టలేదు కనుక ఒకరికొకరుఅన్నట్టు ఇద్దరే ఆ ఇంట్లో బతుకుతున్నారు. అదే ఇంట్లో కిరాణా షాపును నడుపుతుంటారు. కాస్త దూరమైనా రామ్మూర్తి ఇంటికి కిరాణ సరుకుల కోసం జనం వచ్చిపోతుంటారు. సాధారణంగా రాత్రి ఏడు గంటలు దాటితే పెద్దగా జన సంచారం ఉండదు ఆ ప్రాంతంలో. అందుకే ఏడు దాటక ముందే కొట్టు మూసేస్తాడు రామ్మూర్తి. తిరిగి ఉదయం 5 గంటలకు పాల వ్యాన్ వచ్చినప్పుడు తెరుస్తాడు.
ఇప్పుడు రాత్రి 9 దాటడంతో జనసంచారం పూర్తిగా తగ్గిపోయింది. రామ్మూర్తి టీవీ చూస్తున్నాడు.గంగాదేవి పెరటివైపు తలుపు తీసింది బాత్రూమ్‌కి వెళ్లడానికి.అప్పటికే మూలన చీకట్లో నక్కి ఉన్న ఓ ఆకారం అప్రమత్తమైంది. గంగాదేవి బాత్‌రూమ్‌లోకి వెళ్లి తలుపు దగ్గరగా వేసింది. ఒక్క ఉదుటున ఆ ఆకారం బాత్‌రూమ్‌లో దూరింది. గంగాదేవి మీద దూకింది. గంగాదేవికి ఏం జరుగుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరయ్యింది. భయంతో అరవబోయేలోగా మెడపై కత్తి రావడం, కంఠం తెగడం క్షణాల్లో జరిగిపోయాయి.అరిచే అవకాశమే లేకుండా గంగాదేవి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్నానాల గది అంతా రక్తంతో నిండిపోయింది.టైమ్ 9.15.ఆ ఆకారం బాత్రూమ్ డోర్ తెరిచి మెల్లగా పెరటి తలుపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. టీవీలో వార్తలు చూసున్న రామ్మూర్తిని వెనక నుంచి సమీపించింది. అలికిడి వినిపించినా గంగాదేవే అనుకుని వెనక్కి తిరగలేదు రామ్మూర్తి. ఆ ఆకారం చేయి పైకి లేచింది. చేతిలో ఇటుకరాయి. రామ్మూర్తి తలమీద ఒకే ఒక్క దెబ్బ పడింది. అంతే. రామ్మూర్తి అడ్డంగా పడిపోయాడు.
తెల్లవారింది.‘ఏమోయ్.. టైం 7 దాటుతోంది. కాస్త నా ముఖాన చాయ్ పోస్తవా లేదా?’ అంటూ అరిచాడు పక్కింటి సురేశ్. బాబాయ్ ఇంకా షాప్ తెరవలేదు. లేకుంటే ఎపుడైనా ఆలస్యం చేశానా’ వంటింట్లో నుంచి బయటికి వచ్చింది లక్ష్మి. ‘బాబాయ్ ఊర్లోనే ఉన్నాడు కదా.. బహుశా పాలు రాలేదేమో వెళ్లి చూస్తానుండు’ అంటూ కదిలాడు సురేశ్. పాలవ్యాను వచ్చి వెళ్లింది. పాల ప్యాకెట్ల ట్రేలన్నీ అలాగే షాప్ ముందు వదిలేసి ఉన్నాయి. వచ్చి చూసి రామ్మూర్తి లేడని వెళుతున్నారు ఒకరిద్దరు. ‘అదేంటి బాబాయ్ నిద్ర లేవలేదా? పిన్ని అయినా లేవాలి కదా?’ అంటూ తలుపు కొట్టాడు. లోపలి నుంచి అలికిడి రాలేదు. అతని మనసు ఏదో కీడు శంకించింది. పాల ప్యాకెట్ల కోసం వచ్చిన వాళ్లు ‘ఏం జరిగి ఉంటుందంటారు’ అన్నారు. డోర్ బద్దలు కొట్టి చూద్దాం’ అన్నాడు సురేశ్.వద్దు. ముందు పోలీసులకు ఫోన్ చేయండి. వాళ్లు వచ్చి చూస్తారు’ అన్నారు అక్కడ గుమికూడిన వాళ్లలో నుంచి ఓ వ్యక్తి.సురేశ్ పోలీసు స్టేషన్‌కి ఫోన్ కలిపాడు. నిమిషాల్లో పెట్రోలింగ్ పోలీసులు వచ్చారు రామ్మూర్తి ఇంటికి. లోపలి నుంచి డోర్ పెట్టి ఉంది. ఎలా వెళ్లడం అని చూస్తున్నారు పోలీసులు.‘ఇంటి వెనక చిన్న గోడ ఉంది సార్’ అని గుంపులోని వారు చెప్పడంతో వెనకవైపుగా వెళ్లారు. గోడ దూకి చూసిన పోలీసులు ఇంట్లో కనిపించింది చూసి ఉలిక్కిపడ్డారు.ఒకే ఇంట్లో రెండు శవాలు.వెంటనే వైర్‌లెస్‌లో పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశాడు కానిస్టేబుల్.
ఈ వివరాలతో కేసు జటిలంగా మారింది. హంతకుడి గురించి ఏమీ తెలియడం లేదు. కాని ఇంత కిరాతకంగా మర్డర్ చేశారు కాబట్టి ఒకరి కంటే ఎక్కువమంది హత్యలో పాల్గొని ఉంటారని పోలీసు లు అంచనాకు వచ్చారు. వరంగల్ చుట్టుపక్కల వివిధ పనులకు వచ్చిన ఉత్తర భారతీయలను విచారించడం మొదలు పెట్టారు.సీఐ బృందం రామ్మూర్తి, గంగాదేవిల కుటుంబ వివరాలు సేకరించింది. ‘వీరికి ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. శత్రువులూ లేరు. అలాంటప్పుడు ఇంత కిరాతకంగా హత్యచేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది?’అన్న విషయం పోలీసులకు అంతుచిక్క లేదు. వారికి పక్కింటి సురేశ్‌పై అనుమానం వచ్చింది. అతణ్ణి పట్టుకెళ్లి అన్ని కోణాల నుంచి ప్రశ్నలు సంధించారు. సురేశ్ హడలిపోయాడు. అతడికేం తెలియదనిఅర్థమైంది.ఆ వీధిలో సీసీ కెమెరా లేదు. కాని అది వెళ్లి కలిసే మెయిన్ రోడ్డు మీద ఈ వైపు నుంచి ఓ బైక్ ఆ రాత్రి 9:30 గంటల వెళ్లడం పోలీసులు గమనించారు. మరోవైపు సెల్‌టవర్ పరిధిలోని కాల్స్‌ను జల్లెడ పట్టడం మొదలుపెట్టారు. బైక్‌నంబర్ ద్వారా మనిషి వివరాలు తెలిశాయి. కాని అనుమానించడానికి పెద్దగా ఏమీ లేదు. ఎందుకైనా మంచిదని ఆ ఊళ్లోనే ఉన్న అతని ఇంటికి వెళ్లారు. ఇంట్లో లేడు. ముసలి తల్లి ఉంది.‘హైదరాబాద్ వెళ్లాడు’ అని చెప్పింది.ఆమె ఇచ్చిన ఫోన్ నెంబర్‌కి పోలీసులు ట్రై చేస్తే కాల్ కనెక్ట్ కాలేదు. ఫోన్‌ను ట్రాక్ చేయడం మొదలెట్టారు. వరంగల్ శివారులోని అటవీ ప్రాంతం దగ్గర ఆ ఫోన్ ఆపరేట్ అవుతూ ఉంది. హైదరాబాద్ వెళ్లాల్సిన వ్యక్తి అక్కడ ఎందుకు ఉన్నట్టు?మరో గంటలో మఫ్టీలో ఉన్న పోలీసులు అతణ్ణి చుట్టుముట్టారు.
‘ఎంత ఇంటరాగేట్ చేసినా నిజం చెప్పడం లేదు సార్..’ అలిసిపోయిన కానిస్టేబుళ్లు సీఐతో చెప్పారు.అప్పుడే సీఐ బృందం ఇంటరాగేషన్ రూమ్‌కి వచ్చింది. వాళ్లను చూడగానే అతడు ‘సార్.. నాకే పాపం తెలియదు. నన్నిలా ఇరికించడం న్యాయం కాదు’ అని కన్నీరు మున్నీరు అయ్యాడు. వాలకం చూస్తే జాలి వేసేలా ఉంది. ఇంటరాగేషన్ టీమ్‌కు ఏం చేయాలో తోచలేదు. ఈ లోగా సి.ఐ వచ్చి అతని ముందు ఓ మూట పడేశాడు. దాంట్లో నుంచి కొన్ని చిల్లర నాణేలను తీసి అతనిపై విసిరేశారు. ‘ఇవి నువ్వు కొట్టేసిన నగలు, ఇవి కిరణాషాపులో నువ్వు కొట్టేసిన చిల్లర. ఇవి చాలా.. ఇంకా ఆధారాలు చూపించాలా?‘ అని గద్దించాడు.అంతే. అతని ముఖం మాడిపోయింది.సార్, తప్పయిపోయింది...’అన్నాడు ఏడుస్తూ. అతని మాటలు వింటూనే పోలీసులు అవాక్కయ్యారు. ‘నీతోపాటు ఇంకెవరెవరు ఉన్నారు ఈ హత్యల్లో?’‘నేనొక్కడినే సార్. ఎవరూ లేరు’ అంత దారుణంగా ఇద్దరి వ్యక్తులను పొట్టన పెట్టుకుంది బక్కపల్చగా, పాతికేళ్లయినా లేని ఇతనా! ‘బంగారం ఎక్కడ పెట్టావు’ ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.‘అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైంది అతనికి. పోలీసులు చీకట్లో బాణమేస్తే తానే దొరికిపోయానని.‘ఒక్క క్లూ కూడా వదల్లేదు కదా సార్ ఎలా పట్టుకున్నారు?’ కానిస్టేబుల్ అడిగాడు సిఐని.నిజమే! ఒక్క క్లూ వదల్లేదు.. అతనిపై మాది కేవలం అనుమానమే. పనీపాటా లేని ఇతను అపుడపుడూ ఆ రామ్మూర్తి కిరాణ కొట్టులో పనిచేసే వాడని తెలిసింది. వారం రోజులుగా అక్కడే ఉన్న ఇతను మూడురోజుల నుంచి అసలు ఊళ్లోనే లేడు. హత్య జరిగిన రాత్రే వీధిలో నుంచి వెళ్లిన ఓ బైక్ మెయిన్ రోడ్‌లోని సీసీ ఫుటేజీలోరికార్డ్ అయ్యింది. ఆ బైక్ ఇతనిదేనని చెప్పారు కాలనీవాళ్లు. దానిని బట్టి మేం సెల్ నెంబరుకు ట్రై చేసినా ఇతను దొరకలేదు’ అంటూ నిందితుడివైపు తిరిగిన సీఐ ‘నీ లవర్‌తో నువ్వు వేరే ఫోన్‌నుంచిమాట్లాడుతున్నా వని గుర్తించాం.ఇంట్లోవాళ్లకు ఊరెళ్తున్నానని చెప్పి. వేరే ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావా? అని అనుమానం వచ్చి పట్టుకొచ్చాం. కానీ, నువ్వే నేరం అంగీకరించి మాకు దొరికిపోయావు’ అంటూ అసలు విషయం చెప్పారు పోలీసులు. జల్సాల కోసం, ప్రియురాలిని మెప్పించడం కోసం ఈ రెండు హత్యలను చేసిన ఆ వ్యక్తి ఇప్పుడు తన విలువైన జీవితాన్ని కారాగారంలో గడుపుతున్నాడు ఈసారి ఆశ్చర్యపోవడం అతని వంతైంది.అదేంటి.. నా లవర్ నుంచి మీరు రికవరీ చేసిన బంగారం ఇదే కదా’ అని మూట వైపు చూపాడు అతను. ‘అవి గిల్టు నగల్రా. చిల్లర మాత్రం కిరాణకొట్లోదే’ విషయం అర్థమైందిఅతనికి. పోలీసులు చీకట్లోబాణమేస్తే తానే దొరకిపోయానని.
– అనిల్ కుమార్ భాషబోయిన
Comments
Please login to add a commentAdd a comment