కెరటాల కచేరీ
సమ్‌థింగ్ స్పెషల్
సముద్రం ఒడ్డుకు వెళితే ఎక్కడైనా అలల ఘోషే వినిపిస్తుంది. ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక రీతిలో, ఆటు పోట్ల తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకో రీతిలో, తుపానుల వంటి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు మరో రీతిలో ఉండే అలల ఘోష ఏ తీరానికి వెళ్లినా దాదాపు ఒకే రీతిలో ఉంటుంది. ఎగసిపడే అలల సవ్వడిలో సరిగమల స్వర మధురిమలను ఆలకించడం దాదాపు అసాధ్యం. అయితే, ఈ అసాధ్యాన్ని క్రొయేషియన్ ఆర్కిటెక్ట్ నికోలా బాసిక్ సుసాధ్యం చేశాడు. జదార్ నగరంలో సముద్రం ఒడ్డున అతగాడు కెరటాల కచేరీ కోసం ఏకంగా శాశ్వత వాద్య పరికరాన్నే నిర్మించాడు. పియోనో మెట్ల తీరులోనే సాగర తీరాన అతడు నిర్మించిన సోపానాలే ఆ వాద్యపరికరం.
ఈ మెట్లకు మౌత్ ఆర్గాన్‌లోని రంధ్రాల మాదిరిగా, స్వరాలకు అనుగుణమైన రంధ్రాలను ఏర్పాటు చేశాడు. రంధ్రాలలో ఆర్గాన్ పైప్స్ ఏర్పాటు చేశాడు. ఎగసిపడే అలలు ఈ మెట్లను తాకి, వాటి రంధ్రాల గుండా నీరు లోపలకు పోయి, అలలు వెనక్కు మళ్లేటప్పుడు ఆ నీరు బయటకు వచ్చేటప్పుడు సుస్వరాలు వినిపిస్తాయి. ఐదు స్థాయుల్లో సప్తస్వరాలు వినిపించేలా ఏర్పాటు చేసిన ఈ సంగీత సోపానాలు క్రొయేషియాకు ప్రత్యేక పర్యాటక ఆకర్షణగా మారాయి. కెరటాల కచేరీని ఆలకించేందుకు ఇక్కడకు పెద్ద సంఖ్యలో విదేశీ పర్యాటకులు ఎగబడుతుండటం విశేషం.