
మేమున్నామని...
‘2014 ఏడాదికల్లా దేశంలో మహిళా పోలీసుల సంఖ్య 5వేలు దాటాలి’ ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ ప్రధాని చెప్పిన మాటలివి. దేశంలో మహిళలపై జరుగుతున్న దాడులకు ఇదొక్కటే పరిష్కారమంటూ అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశంలో ప్రతి జిల్లా పరిధిలో పన్నెండుమంది మహిళా పోలీసులుండాలన్న నిబంధనను అమలుచేసే పనిలో భాగంగా పెద్ద ఎత్తున శిక్షణ తరగతులను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మధ్యనే ఆప్ఘనిస్తాన పోలీస్ అకాడమీలో చేరిన ఫ్రిభాని పలకరిస్తే...‘‘ఐదేళ్ల కిందట ఒక ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న సమయంలో సహ ఉద్యోగుల్లో కొందరు పురుషులు నన్ను చాలా రకాలుగా వేధించారు.
చాలాసార్లు పోలీసుల్ని ఆశ్రయించాలనుకున్నాను. కానీ, మగపోలీసులకు నా బాధ ఎలా అర్థమవుతుందనుకుని...ఊరుకున్నాను. ఇప్పుడు అలాంటి అవసరం లేదు. ఏ మహిళకు చిన్న సమస్య వచ్చినా..మేం ఉన్నాం’’ అని గర్వంగా చెబుతోంది. ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రస్తుతం 1850మంది మహిళా పోలీసులున్నారు. ఈ ఏడాది చివరికల్లా ఆ సంఖ్యను రెట్టింపు చేసే దిశగా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావాలని కోరుకుంటున్నారు అక్కడి మహిళలంతా.