ఆ ముందురోజు అలా ఎందుకు మాట్లాడాడో | Why did that talk the day before? | Sakshi
Sakshi News home page

ఆ ముందురోజు అలా ఎందుకు మాట్లాడాడో

Published Wed, Apr 18 2018 12:28 AM | Last Updated on Wed, Apr 18 2018 12:28 AM

Why did that talk the day before? - Sakshi

సిటీలో మన జీవితాలు సౌకర్యంగా ఉండటానికి ఎంతోమందిపగలూ రాత్రి పని చేస్తుంటారు... ఎండలో వానలో చలిలో పని చేస్తుంటారు.మనకి వాళ్లందరు అనామకులుకానీ వాళ్లకీ ఒక ఇల్లూ కుటుంబం మమతలూ మమకారాలూ ఉంటాయి.త్యాగంలో పెద్దాచిన్నా ఉండదేమో. ఒక జవాను ప్రాణానికి ఎంత విలువ ఉంటుందో  ఈ ప్రాణానికీ అంత విలువ ఉంటుంది.

కార్వాన్‌ సత్యనారాయణపురంలోని ఆ ఇరుకు గల్లీలో ఆ రెండు గదుల రేకుల ఇంట్లో కరెంటు లేదు. లైటు వెలుగుతూ ఉంది. ఫ్యాన్‌ తిరుగుతూ ఉంది. కాని కరెంటు లేదు. అవును... ఆ ఇంటికి విద్యుత్తు వంటి, ప్రాణ ప్రవాహం లాంటి మగదిక్కు పది రోజుల క్రితం తన వృత్తికి తన ప్రాణం అర్పించాడు. నిన్న వరకూ ఉన్న మనిషి ఇవాళ లేడంటే ఆ ఇల్లాలి పరిస్థితి ఏమిటి? పిల్లల పరిస్థితి ఏమిటి? ఆ వెలితి పూడే
మాట ఏమిటి?‘నమస్తే’ అంది ఒక రకమైన బిడియంతో సంగీత. ఆమె పూర్తి పేరు పోగుల సంగీత. భర్త పేరు పోగుల భూమయ్య. నలభై లోపు వయసు. ఇప్పుడు లేడు. చనిపోయాడు.‘సైనికులు చనిపోతే గొప్ప పేరొస్తుంది. పోలీసులు చనిపోతే కూడా గొప్ప పేరొస్తుంది. మా ఆయన కరెంట్‌ మనిషి. కరెంటు మనిషి చనిపోతే ఎక్కడైనా పేరొస్తుందా?’ అందామె భర్తను తలుచుకుంటూ.ఏప్రిల్‌ 3, 2018న భూమయ్య చనిపోయాడు. కరెంట్‌ పోల్‌ మీద అక్కడికక్కడే చనిపోయాడు. అతడు గన్‌ఫౌండ్రీ సెక్షన్‌లోని హైదరగూడ సబ్‌డివిజన్‌లో విద్యుత్‌ పంపిణీ సంస్థ కాంట్రాక్ట్‌ వర్కర్‌. అతడు చనిపోయిన సంగతి పత్రికలలో చిన్న వార్తగా వచ్చింది. దానిని ఎంతమంది చదివారో తెలియదు.

‘చూశారా మా ఇల్లు. ఆయన లేడు. పిల్లలు లేరు. ఒక ఆడదాని బతుక్కు ఇంతకు మించిన శాపం ఏముంది?’ అంది. ఆ క్షణంలో ఆమె గొంతు దు:ఖంతో వణికింది. సంగీతకు ఇద్దరు పిల్లలు. కొడుకు ఆకాశ్‌ 6వ తరగతి చదువుతున్నాడు. కుమార్తె వెన్నెల 4వ తరగతి చదువుతోంది. తండ్రి లేని ఇంట్లో వాళ్లు ఉండలేకపోతున్నారు. గాలి మార్పు కోసం వాళ్లను ఊరికి పంపింది సంగీత. ‘పెళ్లయ్యాక ఆయన వెంట నడిచా. ఇక్కడే ఉంటున్నాం. చనిపోయాక నష్టపరిహారం చెక్‌ ఇప్పించారు కార్మిక నాయకులు. అది చెల్లుబాటు కావాలంటే ఆధార్‌లో పేర్లు సరిగా ఉండాలట. నా పేరులో తప్పు ఉంది. దానిని మార్పించుకోవడానికి తిరుగుతున్నాను. అదెప్పుడవుతుందో’ అందామె.సిక్స్‌›్తసెన్స్‌ అంటుంటారు. మనిషి చనిపోయేముందు ఆ సంగతి తెలుస్తుందా? భూమయ్య రెండు నెలల క్రితమే ఆ రెండు గదుల ఇంట్లో భార్య చేత చిన్న కిరాణా షాపు పెట్టించాడు. అంటే కొంచెం ఉప్పు, చింతపండు, బిస్కెట్‌ ప్యాకెట్లు... ‘నాకొచ్చే పద్నాలుగు వేలు ఏం సరిపోతాయి. ఇలాంటి షాపుంటే నువ్వు బతకొచ్చు... నేను ఉన్నా లేకున్నా’ అన్నాడు. అప్పట్లో ఆ సంగతి సంగీత పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ చిన్న కిరాణా షాపును చూస్తుంటే ఆమెకు భర్తే గుర్తుకు వస్తున్నాడు.

ముందురోజు రాత్రి..
ఒక మనిషితో ఎంత కాలం జీవించినా చనిపోయే ముందురోజు మాత్రం బాగా గుర్తుండిపోతుంది. ఆ రోజు పదే పదే గుర్తుకు వస్తుంటుంది. భర్త చివరిరోజు సంగీతకు బాగా గుర్తుంది.‘మా అమ్మాయి వెన్నెల అంటే ఆయనకు చాలా ఇష్టం. ఏం అడిగినా కాదనకుండా తెచ్చి ఇచ్చేవాడు. 2వ తారీఖు రాత్రి 9 గంటల ప్రాంతంలో వెన్నెలను ఒడిలోకి తీసుకుని కిందకు దించలేదు. సరదాగా గడుపుతూ ముద్దులాడాడు. డాడీ ఉన్నంత వరకు నీకు ఏమీ కాదురా.. నువ్వు పెద్ద చదువులు చదువుకుని పెద్ద ఉద్యోగం చెయ్యాలి అన్నాడు. నేను లేనప్పుడు అమ్మని విసిగించవద్దు, అమ్మ చెప్పినట్లు వినాలి సరేనా.. అంటూ ముద్దాడుతూ ఒట్టు ఏపించుకున్నాడు. డాడీ ఎక్కడ ఉన్నా మీతోనే ఉంటాడు.. మీరు మాత్రం అమ్మని ఏడిపించొద్దు అని పదే పదే అన్నాడు. ఎప్పుడూ లేనిది ఇయ్యాల ఆయనేంటీ కొత్తగా మాట్లాడుతున్నాడనుకున్నాను.మరుసటి రోజే దుర్వార్త వినాల్సి వస్తుందని కలలో కూడా ఉహించలేకపోయాను’ బోరున విలపించింది సంగీత. ‘అమ్మా.. నాన్న ఏడమ్మా? నాన్న మళ్లీ రాడా..?? మొన్న మాతో కలసి అన్నం తిన్నాడు కదా..! మళ్లీ మనందరం అలా అన్నం ఎప్పుడు తింటామమ్మా అని పిల్లలు అంటుంటే వాళ్లకు ఎలా నచ్చజెప్పాలో అర్థం కాలేదు. వాళ్లకు తెలుసు వాళ్ల నాన్న చనిపోయాడు అని. కానీవాళ్లు అలా అడుగుతుంటే నా గుండె బరువెక్కిపోతోంది’ అంటున్న ఆమె కన్నీటి పాట ఎవరికీ వినిపించనిది. ఈ రణగొణ ధ్వనులలో ఎవరూ వినలేనిది. 

పని పిచ్చోడు
‘ఆయనకు పనంటే పిచ్చి.  ఒక ఎండ లేదు, వాన లేదు, చలి లేదు. పండుగలప్పుడు కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. కరెంట్‌ లేకపోతే మనం ఒక్క నిమిషం ఇంట్లో ఉండలేం కదా. వేరే వాళ్లు ఎలా ఉంటారు? నేను వెళ్లి వాళ్లకు కరెంట్‌ తెప్పిస్తే మన పేరు చెప్పుకుంటారు అని అంటుండేవాడు. వర్షాకాలంలో అయితే నాకు మెతుకు గొంతు దిగేది కాదు. రోజుకు మూడు డ్యూటీలు చేస్తున్నట్టుగా తిరిగేవాడు. వైర్లు తెగినాయంట అంటూ వెళ్లి పోయేవాడు. ఆయన క్షేమంగా ఇంటికి తిరిగొచ్చే వరకు నా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉండేవి. ఎంత టైం అయినా సరే ఆయన ఇంటికి క్షేమంగా తిరిగొచ్చాకనే తిండి తినేదాన్ని. కరెంటు వాళ్లది కనపడని కష్టం’ అంది సంగీత. 

ఆ రోజు ఏం జరిగిందంటే...
భూమయ్య తన తోటి ఉద్యోగి రంగారెడ్డితో డ్యూటీలో ఉన్నాడు.  కింగ్‌కోఠి సమీపంలోని పర్దాగేట్‌ నుంచి ఫోన్‌ కాల్‌ వచ్చింది. మీటర్‌ బిగించాల్సి ఉంది వెళ్దాం పదా అంటూ భూమయ్య బయలుదేరి వెళ్లాడు. స్తంబం పైకి ఎక్కి సర్వీస్‌ వైర్‌ కలుపుతున్నాడు. ఆ సమయంలో లెఫ్ట్‌సైడ్‌ సర్క్యూట్‌లో నుంచి కరెంట్‌ పాస్‌ అయ్యింది. క్షణాల్లో షాక్‌ తగిలింది. పోల్‌ మీద భూమయ్య శరీరం కంపించింది. సాయం అందించే సమయం లేదు. చూస్తుండగానే పోల్‌ మీదే మాడిపోయాడు. ఆ తర్వాత గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయింది.‘ఆ రోజు ఆయన పనికి వెళ్లినప్పటి నుంచి మనసెందుకో కీడు శంకిస్తోంది. అయినా పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటున్నా. పోలీసులు ఫోన్‌ చేసి ఆసుపత్రికి రమ్మనగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఏమైంది సారూ అని అడిగినా. ఏమీ కాలేదమ్మా.. నువ్వు ముందు ఆసుపత్రికి రా అన్నారు. భయం భయంతోనే ఆసుపత్రికి వెళ్లాను. వాళ్లు నన్ను వెంట పెట్టుకుని శవాలు ఉండే చోటుకు తీసికెళ్లారు. అక్కడ నా భర్త ప్రాణం లేకుండా పడి ఉన్నాడు’ అంది సంగీత. 
 – చైతన్య వంపుగాని,
సాక్షి ప్రతినిధి, హైదరాబాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement