క్షణాల్లో బ్రష్ నోరంతా ఫ్రెష్
పళ్లుతోముకోవడం క్షణాల్లో చేసుకునే పనేనా.. అని ఆశ్చర్యపోతున్నారా..? ఒకప్పటి కాలంలోనైతే తాపీగా ఏ వేపపుల్లనో తుంచుకుని, నోట్లో నములుతూ కుచ్చులా చేసుకుని ముచ్చట్లాడుతూ పళ్లుతోముకునే ప్రక్రియ పూర్తి చేసుకునే సరికి కనీసం పావుగంటైనా పట్టేది. టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాక ఈ ప్రక్రియ ముగించడానికి మూడు నుంచి ఐదు నిమిషాలు పడుతోంది. క్షణాల్లో బ్రష్ చేసుకోవడం ముగించేటట్లయితే, అసలు పళ్లు తోముకున్నట్లేనా..
అని సందేహిస్తున్నారా..? మీ సందేహాలన్నింటికీ సమాధానమే ఈ ఫొటోలో కనిపిస్తున్న ‘బ్రిజిల్‌డెంట్’ టూత్‌బ్రష్. చూడటానికి చిత్రవిచిత్రంగా ఉంది కదూ! ఇదిలాగే ఉంటుంది. ఎందుకంటే, పలువరుస మూస ఆధారంగా దీన్ని తయారు చేస్తారు. ఈ రకమైన టూత్‌బ్రష్‌లు రెడీమేడ్‌గా దొరకవు. ఇవి టైలర్డ్ టూత్‌బ్రష్‌లు. ఎవరికి కావలసిన బ్రష్‌ను వారు ఆర్డర్‌పై తయారు చేయించుకోవాల్సిందే. స్కానింగ్ ద్వారా లేదా పలువరుస ఇంప్రింట్ తీసుకోవడం ద్వారా కచ్చితమైన కొలతలతో దీన్ని తయారు చేస్తారు.
పలువరుస ముందు, వెనుకలకు. దంతాల సందులకు చేరేలా దీనికి బ్రిజిల్స్ ఉంటాయి. దీనిని 45 డిగ్రీల కోణంలో పల్వరుసకు తగిలించుకుని, నములుతున్నట్లుగా దవడలను గబగబా పది పదిహేనుసార్లు ఆడిస్తే చాలు. దంతాలన్నీ పూర్తిగా శుభ్రపడిపోతాయి. కచ్చితంగా చెప్పాలంటే, ఈ టూత్‌బ్రష్‌తో ఆరు సెకండ్లలోనే దంతధావన ప్రక్రియ ముగిసిపోతుంది.