అత్తారింటికి దారిదే... | Woman to get Rs.10 lakh for seeking toilet | Sakshi
Sakshi News home page

అత్తారింటికి దారిదే...

Published Sun, May 17 2015 11:28 PM | Last Updated on Tue, Aug 28 2018 5:25 PM

అత్తారింటికి దారిదే... - Sakshi

అత్తారింటికి దారిదే...

భర్త మరుగుదొడ్డి కట్టించడంలేదని, కట్టించాకే తిరిగి వస్తానని చెప్పి పుట్టింటికి వెళ్లిపోయింది ప్రియాంక. ఆమెది ఉత్తరప్రదేశ్‌లో కంచన్‌కుయా గ్రామం.

అదే రాష్ట్రంలో ఈ నెల పదిహేనో తేదీన ఖేసియా అనే ఊళ్లో నీలమ్, కళావతి, షకీనా, నిరంజన్, గుడియా అనే ఆరుగురు కొత్త కోడళ్లు అత్తింట్లో టాయ్‌లెట్ లేదని పుట్టింటికి వెళ్లిపోయారు.
 
సరిగ్గా అదే రోజు మహారాష్ట్రలో చందా అనే ఒక వధువు తనకు వేరే ఏమీ వద్దనీ, రెడీమేడ్ మరుగుదొడ్డిని పెళ్లికానుకగా ఇవ్వమని బంధువులను అడిగి మరీ సాధించుకుంది. చందా, మిగతా మహిళలు చూపిన ఈ చొరవ  మన గ్రామాల్లోనూ ప్రతి మహిళకూ స్ఫూర్తిదాయకం కావాలని సాక్షిఫ్యామిలీ’ ఆకాంక్షిస్తోంది.

 
మనకు స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాలలోనూ సామాజికంగా, సాంకేతికంగా ఎంతో అభివృద్ధి సాధించాం. చట్టసభల్లో స్త్రీలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నాం... కానీ స్త్రీ స్వేచ్ఛగా తిరగగలిగే పరిస్థితిని సాధించుకోవడం కోసం ఏమీ చేయలేకపోతున్నాం. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లిన స్త్రీ క్షేమంగా తిరిగి వస్తుందనే భరోసా తెచ్చుకోలేకపోతున్నాం. అత్యవసరాలైన కాలకృత్యాలకోసం సైతం మన పల్లెటూళ్లలో ఆడవాళ్లు బహిర్భూమికి వెళ్లవలసి వస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం తప్పితే టాయిలెట్ నిర్మాణానికి చొరవ తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో  టాయిలెట్ కోసం చందా అనే నవ వధువు చొరవ చూపడం తాజా ఉదంతం.
 
చొరవ చూపక తప్పలేదు
మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. యావత్మాల్ జిల్లాలోని మోజర్ కు చెందిన కృష్ణకుమార్ మాకోడెతో అకోలా జిల్లా కారంజా రమజాన్‌పూర్ (నయా అందురా)కి చెందిన చందా అలియాస్ చైతాలి గలాఖే (రాఠోడ్)కు మే 15న వివాహం నిశ్చయమైంది. తాను కోడలిగా అడుగుపెట్టబోయే ఇంట్లో మరుగుదొడ్డిలేదని, పెళ్లయి అత్తగారింటికెళ్తే ఆ అవసరం కోసం ఆరుబయటకే వెళ్లాలన్న విషయం వధువుకు తెలిసింది.

ఈ పరిస్థితి రాకూడదంటే, అత్తగారింట్లో కూడా మరుగుదొడ్డి ఉండి తీరాలనుకుంది. దాంతో, మొహమాటాన్ని వదిలి పెట్టి, తనకు పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగు దొడ్డిని ఇవ్వాలని తల్లిదండ్రులను, ఇతర బంధువులను కోరింది. ఆమె కోరికను తీర్చాలనుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు పెళ్లికి ముందే ఓ రెడీమేడ్ మరుగుదొడ్డిని సిద్ధం చేశారు. శుక్రవారం వివాహం అనంతరం కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఆమె పెదనాన్న గజానన్ నాడే ఆమెకు అందించారు.
 
నో ప్రాఫిట్, నో లాస్...    
ఇదిలా ఉంటే, ఈ రెడీమేడ్ టాయిలెట్లకు గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరుగుతోందని, రెడీమేడ్ టాయిలెట్లను పెళ్లిలో కానుకలుగా ఇవ్వాలనుకునేవారికి ‘నో ప్రాఫిట్, నో లాస్’ ప్రాతిపదికన ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు రెడీమేడ్ టాయిలెట్ మ్యానుఫ్యాక్చరర్ అరవింద్ దేతే తెలిపారు.
 
ఆనందంగా ఉంది...    
కాబోయే అత్తారింట్లో మరుగుదొడ్డిలేదని తెలిసి చాల బాధవేసింది. అంతే! ఎవరు, ఏమి అనుకున్నా ఫర్వాలేదు కాని, నాకు పెళ్లి కానుకలకు బదులుగా రెడీమేడ్ మరుగుదొడ్డిని ఇవ్వాలని పట్టుబట్టాను. దీనికి మా కుటుంబసభ్యులతోపాటు బంధువులూ అంగీకరించి నా గౌరవాన్ని మరింత పెంచారు. ఇది నాకెంతో ఆనందాన్నిచ్చింది.    
 - వధువు చందా
 
 
స్వచ్ఛత ‘ఐకాన్’...  
పెళ్లి కానుకగా రెడీమేడ్ మరుగుదొడ్డిని అందుకుని వధువు చందా స్వచ్ఛభారత్‌కు ఐకాన్‌గా మారిందని బ్లాక్ డెవలప్ మెంట్ ఆఫీసర్  ఉమేష్ దేశ్‌ముఖ్ అభివర్ణించారు. కానుక విషయం తెలుసుకున్న ఆయన మరికొందరు అధికారులతో కలసి పెళ్లి మంటపానికి చేరుకుని, వధూవరులను ఆశీర్వదించారు. ఆడపిల్లలందరూ చందాను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
 - గుండారి శ్రీనివాస్, సాక్షి, ముంబై

వధువు చందాకి కానుకగా వచ్చిన టాయిలెట్

 
దేశవ్యాప్తంగా టాయిలెట్ అవసరాల కోసం యాభై శాతానికిపైగా ఇప్పటికీ బహిర్భూమిపై ఆధారపడక తప్పడం లేదు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలలో అధిక భాగం ఆరుబయట టాయిలెట్‌కి వెళ్లినప్పుడే జరుగుతున్నట్లుగా సర్వేల్లో తేలింది.
 
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా వివిధ కారణాల వల్ల మృత్యువాత పడుతున్న ఏడులక్షల మంది చిన్నారుల్లో బహిరంగ మలవిసర్జన కారణంగా అంటువ్యాధులు సోకి మరణిస్తున్న వారు రెండు లక్షలమంది ఉంటారని అంచనా.
 
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటున 42 శాతం మందికే టాయిలెట్లు ఉన్నాయి.
 
దేశంలోనే అతి పేద రాష్ర్టంగా పేరు పొందిన బీహార్‌లో గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 85 శాతం మందికి టాయిలెట్లు లేవట.
 
బీహార్‌లో గత సంవత్సరం నమోదైన రేప్ కేసులలో 870 కేసులు బహిరంగ టాయిలెట్‌కి వెళ్లిన వారిపైన జరిగినట్లుగా నమోదైంది.
 
యూపీలో బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు యువతులు ఇటీవల అత్యాచారానికీ, హత్యకూ గురయ్యారు.
 
దేశవ్యాప్తంగా నమోదవుతున్న రేప్ కేసులలో కనీసం 500 కేసులు బాధిత మహిళలకు ఇంటిలో టాయిలెట్ ఉంటే జరిగేవి కావని అంటున్నారు పోలీసులు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement