'టాయ్లెట్' కోరిన వధువుకు 10 లక్షల నజరానా
ముంబై: పెళ్లికానుకగా బంగారు ఆభరణాలకు బదులు టాయ్లెట్ కావాలని కోరిన మహారాష్ట్రకు చెందిన అమ్మాయికి 10 లక్షల రూపాయల నజరానా ప్రకటించారు. అలోకా జిల్లా అందురా గ్రామానికి చెందిన చైతలీ గలాఖే అనే అమ్మాయికి యవత్మాలా జిల్లాకు చెందిన దేవేంద్ర మకోడే అనే అబ్బాయితో ఇటీవల పెళ్లి జరిగింది. అత్త వారింట్లో మరుగుదొడ్డి లేదన్న సంగతి తెలుసుకొని.. ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిందేనని పెళ్లికి ముందు స్పష్టంగా చెప్పడంతో ఆ ఏర్పాటు చేశారు. పుట్టింటివారు, మెట్టింటివారు కలిసి అన్ని వసతులు ఉన్న ఓ టాయిలెట్ (ప్రిఫ్యాబ్రికేటెడ్)ను కట్నకానుకలతో కలిపి ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సులభ్ ఇంటర్నేషనల్ నిర్వాహకులు చైతలీకి 10 లక్షల రూపాయల నగదు బహుమతి ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి ఆకర్షితురాలైన చైతలీని వారు అభినందించారు.