మనీ ప్లాంట్‌ | Women are Doing Miracles | Sakshi
Sakshi News home page

మనీ ప్లాంట్‌

Published Wed, Apr 24 2019 1:14 AM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

Women are Doing Miracles - Sakshi

అది ఒక పంపుసెట్ల తయారీ ప్లాంట్‌. ఇళ్లల్లో వినియోగించే  సుమారు 14 రకాల పంపుసెట్లను ఆ మహిళలు అలవోకగా  తయారు చేస్తున్నారు. టన్నుల కొద్దీ బరువైనయంత్రాలు. అత్యధిక విద్యుత్‌ వినియోగం. అడుగడుగునా పొంచి ఉండే ప్రమాదం.మూడు విభాగాలు. 200 మంది మహిళలు. ఏ విభాగంలో ఎక్కడ ఏ కొంచెం ఆదమరిచినా ముప్పే. అలాంటి ప్లాంట్‌లో ఆ మహిళల సునిశితమైన చూపులు, సన్నటి వేలి కొసలు కోట్లాది రూపాయల విలువైన సంపదను సృష్టిస్తున్నాయి.

గొప్ప విద్యావంతులు కాదు. ఎలాంటి డిగ్రీలు చదవలేదు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సముపార్జించలేదు. ఇంజనీరింగ్‌ నిపుణులు కాదు. కానీ ప్రపంచమే అబ్బురపడే విధంగా ఆ మహిళలు అద్భుతాలను సాధిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నారు.  తాము చదివిన కొద్దిపాటి చదువులకు మరికొంత నైపుణ్యాన్ని జోడించి ఏటా వందల కోట్ల రూపాయల సంపదను సృష్టిస్తున్నారు. ఆ మహిళల ప్రతిభాపాటవాలు లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్‌ అభినందనలు పొందాయి. క్వాలిటీ సెంట్రల్‌ ఫోరమ్‌ అవార్డులను అందుకున్నాయి. తమిళనాడులోని కోయంబతూర్‌ కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ మహిళా ప్లాంట్‌లో పని చేసే రెండు వందల మంది మహిళల విజయగాధ ఇది. నిమిషానికి మూడు పంపుసెట్ల చొప్పున తయారు చేస్తూ  తమ శ్రమశక్తిని, సృజనాత్మకతను, మెకానిక్‌ నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటుకుంటున్నారు. 

కాలంతో పరుగులు
కోయంబత్తూరు నుంచి సేలం వెళ్లే రహదారిలో ఉంటుంది కనియూ గ్రామం. దానితో పాటు చుట్టుపక్కల ఉన్న సూలూర్, అరసూర్, కర్మత్తంబట్టి, సోమనూరు, వాగరాయక పాలియం తదితర పల్లెల్లో ప్రజలు ఎక్కువ శాతం శ్రమశక్తిని నమ్ముకొని బతుకుతున్నారు. అంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన వాళ్లే. అలాంటి పేదకుటుంబాల్లో పుట్టి పెరిగిన ఎంతోమంది అమ్మాయిలు పై చదువులు చదివే ఆర్ధిక స్తోమత లేకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నారు. వాళ్ల సంపాదనే  కుటుంబాలకు  ప్రధాన ఆధారం. అలాంటి అమ్మాయిలకు 2010లో కన్యూ గ్రామంలో ఏర్పాటు చేసిన కిర్లోస్కర్‌  బ్రదర్స్‌ మహిళా ప్లాంట్‌ మంచి ఉపాధి మార్గంగా నిలిచింది. విద్యార్హతలతో నిమిత్తం లేని ఉద్యోగావకాశాలను కల్పించింది. అంతేకాదు. తమ శ్రమ శక్తికి తోడు సాంకేతిక నైపుణ్యాన్ని, సృజనాత్మకతను జోడించే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. తొమ్మిదేళ్ల  క్రితం ప్రారంభించిన ఈ ప్లాంట్‌లో ఎంతోమంది మహిళలు  శిక్షణ పొందారు.

కుటుంబాలకు ఆధారంగా నిలిచారు.‘‘ఎన్నో కష్టాలు, బాధల నడుమ ఈ ప్లాంట్‌లో చేరాను. మొదట్లో  పంపుసెట్లు  తయారు చేయగలనా అనిపించింది. అదంతా మెకానిక్‌లు చేసే పని కదా అనుకున్నాను. శిక్షణ తీసుకున్న తరువాత క్రమంగా నైపుణ్యం పెంచుకున్నాను. ఇప్పుడు మా టీమ్‌ అంతా కలిసి నిమిషానికి 3 పంపుసెట్‌లను ఎంతో తేలిగ్గా తయారుచేసి ఇవ్వగలుగుతున్నాం’’ అని చెప్పారు రాజీ. ఆమె   కోయంబత్తూరుకు సమీపంలోని కేరళ రాష్ట్రం పాలక్కాడ్‌ నుంచి వస్తున్నారు. భర్త తాగుబోతు. పేదరికం కారణంగా కొడుకు చదువు ఆగిపోయే పరిస్థితి తలెత్తింది. అప్పటివరకు ఇంటిదగ్గరే ఉన్న రాజీ తన  శక్తిసామర్ధ్యాలను పరీక్షించుకోవాలనుకుంది. ఒక్క రాజీయే కాదు. ప్లాంట్‌లో పని చేస్తున్న  వలార్‌మతి, సుధారాణి, తమిల్‌సెల్వి వంటి ఎంతోమంది మహిళలు ‘తామేం చేయగలం అనే స్థితి నుంచి తాము మాత్రమే చేయగలం’ అని నిరూపించుకున్నారు. 

మహిళా సాధికారతకు పట్టం
పూనే కేంద్రంగా గత వందేళ్లుగా పంపుసెట్లను తయారు చేసి అందజేస్తున్న కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ కంపెనీ మహిళా సాధికారతకు  చేయూతనిచ్చింది. ‘‘1976 నుంచి ఈ సంస్థలో మహిళల శక్తిని గుర్తించి  ప్రోత్సహించారు. ఆ రోజుల్లోనే ‘స్త్రీ’ అనే ఒక మ్యాగజీన్‌ నడిపించారు. సంస్థలో పని చేసే మహిళలకు సముచితమైన సహాయ సహకారాలను అందజేశారు. ఒక సాధారణ ఉద్యోగిగా పనిలో చేరిన వారు ఉన్నతమైన పదవులను పొందారు. ఈ క్రమంలోనే కోయంబత్తూరు మహిళా ప్లాంట్‌కు బీజం పడింది’’ అని చెప్పారు జనరల్‌ మేనేజర్‌ లక్ష్మి. ఒక సాధారణ వర్కర్‌గా చేరిన ఆమె తన ప్రతిభాపాటవాలతో ఇప్పుడు మొత్తం ప్లాంట్‌ బాధ్యతలను  భుజాన వేసుకొని నడిపిస్తున్నారు.

‘‘వర్కర్లు, మేనేజర్‌లు అనే తేడాలేం లేవు. అందరం ఒక కుటుంబంలా కలిసి పని చేస్తున్నాం. ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కలిసి పంచుకుంటున్నాం. ఈ యూనిట్‌లో పని చేస్తున్నవాళ్లంతా పేద, బడుగు, బలహీనవర్గాలకు చెందిన మహిళలే. చాలామంది ఏదో రకమైన గృహహింసను ఎదుర్కొన్నవాళ్లే. చదువుకోలేక బడి మానేసిన వాళ్లు ఉన్నారు. ఈ ప్లాంట్‌ను పంపుసెట్లు తయారు చేసే యూనిట్‌గా మాత్రమే చూడొద్దు. íఫీనిక్స్‌ పక్షిలా ఎదుగుతున్న మహిళల శక్తిని ఈ ప్లాంట్‌లో చూడండి’’ అని అన్నారామె.
 పగిడిపాల ఆంజనేయులు, 
సాక్షి, హైదరాబాద్‌

‘లక్ష’ లక్ష్యంగా..!
కోయంబత్తూరు కిర్లోస్కర్‌ మహిళా ప్లాంట్‌లో మూడు విభాగాలు ఉన్నాయి. వివిధ రకాల పంపుసెట్లకు అవసరమైన ముడిసరుకు ఉంటుంది. ఇది కీలకమైన విభాగం. మొదట పంపుసెట్లను తయారు చేసేందుకు అవసరమైన ముడిసరుకును ఎంపిక చేస్తారు. ఆ తరువాత వివిధ విడిభాగాలను ఒకచోట చేర్చి పంపుసెట్లను తయారు చేసే విభాగం. భారీ యంత్రాల నడుమ అలవోకగా పనిచేసుకుంటూ వెళ్తారు. తయారైన పంపుసెట్లను ప్యాకింగ్‌ చేసి దేశవ్యాప్తంగా మార్కెట్‌కు ఎగుమతి చేసేది మూడో విభాగం. ‘‘ మా ప్లాంట్‌లో ప్రతి 17 సెకన్‌లకు ఒక పంప్‌సెట్‌ తయారు చేస్తున్నాం. ప్రతి నెలా  60 వేల నుంచి 70 వేల పంపుసెట్లు తయారవుతున్నాయి.

ఈ ఏడాది దీనిని లక్షకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎలాంటి పని ఒత్తిడి లేదు. ప్రతి మహిళ తన ఎనిమిది గంటల పనిలోనే  ఎన్ని పంపుసెట్లు తయారు చేయగలిగితే అన్ని చేస్తుంది...’’ అంటారు లక్ష్మి. ప్రస్తుతం రూ.132 కోట్ల టర్నోవర్‌తో నడుస్తున్న కిర్లోస్కర్‌ బ్రదర్స్‌ కంపెనీలో ఆరు శాతం ఆదాయం కోయంబత్తూరు మహిళా ప్లాంట్‌ నుంచే వస్తుంది. ‘‘మూడేళ్ల క్రితం ఈ ప్లాంట్‌లో చేరాను. ఇక్కడికి వచ్చిన తరువాత ఎంతో పెద్ద కుటుంబంలో కలిసి పోయాను. పెళ్లి చేసుకొని జీవితంలో స్థిరపడ్డాను. ఒంటరిననే భావన పోయింది. ఏదైనా సాధించగలననే ధైర్యం వచ్చింది..’’ అంటూ ధీమా వ్యక్తం చేస్తోంది వలార్‌ మతి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement