
ప్రతీకాత్మక చిత్రం
అందంగా పుట్టక్కర్లేదు... ఆడపిల్లగా పుడితే చాలు!
కళ్లతో కాల్చేస్తారు! బతికుండగానే చితి పెట్టేస్తారు.
ఆ చితిలో... నేను, నా ఆశలు, నా కలలు..
నా కుటుంబం.. నా జీవితం.. అన్నీ బూడిదై పోతాయి.
వెంటాడే ఆ చూపుల నీడ.. నన్ను వేధించే పీడ! దేవుడా.. నువ్వెక్కడ?!
అద్దం ముందు నిలబడాలనిపించదు నాకు. కమిలిన శరీరం కలతపెడుతుంటుంది. భయంకర జ్ఞాపకాలు మనసును మెలి పెడుతుంటాయి. నా మనఃశరీరాల కల్లోల కథ చెప్పాలంటే హైస్కూలు రోజుల్లోకి వెళ్లాలి. అభద్ర వీధుల్లో అనుభవించిన నరకాన్ని మీ ముందుంచాలి. అవి నేను తొమ్మిదో తరగతి చదువుతున్న రోజులు. బడి నుంచి తిరిగొస్తుంటే వెంటబడ్డాడు ఒక అగంతకుడు. కొద్ది రోజుల తర్వాత తెలిసింది వాడు మా ఊరు వాడేనని. మొదట అంతగా పట్టించుకోలేదు. కానీ వాడు తరచూ వెంటబడేవాడు. కాలేజీలో చేరాక వేధింపులు ఎక్కువయ్యాయి. వెకిలి చూపులు చూసేవాడు. బెదరగొట్టేవాడు. తట్టుకోలేకపోయేదాన్ని. బయటకు వెళ్లాలంటేనే భయం. ఒక్కోసారి కాలేజీకీ వెళ్లాలనిపించేది కాదు. చదువుపై మనసు పెట్టలేకపోయేదాన్ని. ఇంట్లో చెప్పలేకపోయేదాన్ని. చెబితే చదువు మాన్పించడం ఖాయం. నా నంబర్ ఎలా సంపాదించాడో తెలియదు.. ఓ రోజు మొబైల్‌కి మెసేజ్ పంపాడు. వాడి భాష ఎంత టెర్రరైజ్ చేసిందంటే.. అది చదివినప్పుడు నిలువెల్లా వణికిపోయా. మెసేజ్‌లతోనూ స్టాక్ చేయడం మొదలెట్టాక.. నా పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయ్యింది. తిండి తినాలనిపించేది కాదు. ఓ గిల్టీ ఫీలింగ్ వెంటాడేది. అసలేమి జరుగుతోంది? రేపు నాకేమవుతుంది? ఊపిరాడకుండా చేసేవి ఇట్లాంటి అనేక ప్రశ్నలు. మనసు నిండా నిరంతరమూ ఆలోచనలే. ఆందోళనలే. వాటి ఒత్తిడి భరించడం చాలా చాలా కష్టమయ్యేది. ఆ దుర్మార్గుడు కన్నేసిన నా శరీరంపై నాకే అసహ్యమేసేది. వాణ్ణి ఏమీ చేయలేను. అలాగని నన్ను నేను కాపాడుకోలేను. మరేం చేయాలి? చచ్చిపోవాలి. నన్ను నేను తగలేసుకోవాలి.
మెడ.. ఛాతి.. పొట్ట కాలిపోయాయి. ఒళ్లంతా మంటలు. ఓవైపు గాయాల సలపరం. ఇంకోవైపు మా అమ్మ దుఃఖం. కమిలిపోయిన నా ఒంటిని చూసినప్పుడు మరింత హెచ్చుతోంది ఆమె దుఃఖం. ఆ క్షణాల్లోనే నాలో గూడు కట్టిన భయమంతా వెళ్లగక్కేశాను. గుండె బరువు దించుకున్నాను.నా కారణంగా మా అమ్మానాన్నా చాలా డిస్టర్బ్ అయ్యారు. చాలా యాతన పడ్డారు. నా గాయాలు నాన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ని మింగేశాయి. ఇల్లు కూడా మిగల్లేదు. నా కుటుంబాన్ని లేమిలోకి నెట్టేసినందుకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంది. ట్రీట్‌మెంట్ ఖర్చు ఇరవై లక్షల రూపాయలు దాటింది.
పదకొండు మాసాల తర్వాత ఇంటికి చేరాం. మళ్లీ వెంటబడ్డాడు వాడు. మా నాన్న హెచ్చరించినా వెనక్కి తగ్గలేదు. ఇక భయపడదలచుకోలేదు. ‘షీ టీమ్స్’కి ఫిర్యాదు చేశా. నాతో వాడికి ఫోన్ చేయించారు ఎస్‌ఐ. అలా వలపన్ని వాణ్ణి పట్టుకున్నారు. ఇప్పుడు వాడు జైల్లో ఉన్నాడు. నన్ను దక్కించుకు నేందుకు ఆస్తులు కోల్పోయిన అమ్మానాన్నలకు మరింత భారం కాదలచుకోలేదు. డిగ్రీ పూర్తి చేసి, ఉద్యోగం చూసుకున్నాను. కమిలిన శరీరం పీడకల లాంటి గతాన్ని గుర్తు చేస్తుంటుంది. కాలిపోయిన చాతి నన్ను వెక్కిరిస్తుంది. పెళ్లి గురించిన ఆలోచనలు భయపెడుతుంటాయి.
మౌనాన్ని వీడండి
స్త్రీలు మౌనాన్ని వీడాలి. సపోర్ట్ సిస్టమ్స్‌ను వాడుకోవాలి. తమకు దగ్గరగా ఉండే ఎవరో ఒకరితో బాధను పంచుకోవాలి. హింసను భరిస్తూ పోతే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. డిప్రెషన్ బారిన పడే ప్రమాదముంది. విద్యాసంస్థల్లో అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విజయ లాంటి అమ్మాయిల్ని ఇలాంటి ఘోరాల నుంచి రక్షించుకోవచ్చు. ఉదాహరణకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీటీమ్స్ – ‘భూమిక విమెన్స్ కలెక్టివ్’ కలసి ‘షీ ఫర్ హర్’ అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జూనియర్, ఇంజనీరింగ్ కాలేజీలు సహా అన్ని కాలేజీల్లోనూ ఇద్దరు యువతుల్ని ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నాయి. వేధింపులు ఎదురైతే ఏం చేయాలో, ఎవరికి కాల్ చేయాలో, షీటీమ్స్‌కి ఎట్లా లింక్ చేయాలో వివరిస్తున్నాయి. రకరకాల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నాయి. వాళ్లు చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. ఇలాంటివి ప్రతి చోటా చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో హెల్ప్‌లైన్‌కి కాల్ చేసే అవకాశం కూడా బాధితులకు ఉండకపోవచ్చు. అసలు వాటి గురించి తెలియకపోవచ్చు కూడా. అలాంటి సందర్భాల్లో చుట్టూ ఉన్న ప్రజలు ఆమెకు సాయపడగల వాతావరణం రావాలి. రోడ్డు మీద ప్రమాదం జరిగితే 108కి కాల్ చేసి చెప్పే ప్రజలు.. ఒకమ్మాయిని వేధిస్తున్నప్పుడు కూడా స్పందించి సాయపడగలగాలి. షీటీమ్స్ వంటి వాటికి కంప్లయింట్ చేయగలగాలి. హింసను అరికట్టడంలో పౌరసమాజ పాత్ర చాలా కీలకం కాబట్టి ఈ దిశగా జనరల్ పబ్లిక్‌లో అవేర్‌నెస్ తీసుకురావాలి.
– కొండవీటి సత్యవతి, వ్యవస్థాపక కార్యదర్శి, భూమిక విమెన్స్ కలెక్టివ్
మానసిక శక్తిని కూడగట్టుకోవాలి
ఇంతకు ముందు ఆ అబ్బాయి వేధించిన ప్రదేశాల్లో తిరగలేకపోవడం, తిరిగితే డిప్రెసివ్‌గా అన్పించడం వంటి స్థితి విజయను బాధిస్తుండవచ్చు. మరోవైపు ఆమె బయటకెళ్లినప్పుడు ఒంటి మీద గాయాలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ పరిస్థితి ఆమెకు అవమానకరంగా ఉండొచ్చు. రకరకాల భావనల మధ్య ఘర్షణతో ఆమె కొంత ఒత్తిడికి గురవుతుండవచ్చు. తనదైన మానసిక శక్తిని కూడగట్టుకోవడం ద్వారా ఆమె ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించాలి. కుటుంబం – దగ్గరి వాళ్లు గతాన్ని గుర్తు చేయకుండా ఆమెతో స్నేహపూర్వకంగా మెలగాలి. భవిష్యత్తు ఎంతో ఉందన్న విషయంపై విజయ ఫోకస్ పెట్టాలి. ఇప్పుడున్న పరిస్థితి నుంచి బయటపడేందుకు అవసరమైన అన్ని సాయాల్నీ ఆమె పొందాలి. వెంటాడిన వాడి గురించి లోలోన భయపడిపోవడం వల్లే, ఎవ్వరికీ తన సమస్యను చెప్పుకోకపోవడం వల్లే విజయ ఈ పరిస్థితికి నెట్టబడ్డారు. ఇలాంటి పొరపాటు మరోమారు జరగకుండా ఆమె జాగ్రత్త పడాలి.
– డాక్టర్ పాల్వాయి పద్మ, సైకియాట్రిస్ట్
(విజయ కేస్ స్టడీ) – హృదయ
ఈ హెల్ప్‌లైన్ నంబర్లు ::: నోట్ చేసుకోండి...
181 విమెన్స్ హెల్ప్‌లైన్ (తెలంగాణ – ఆంధ్రప్రదేశ్)
18004252908 భూమిక హెల్ప్‌లైన్..
1091 వేధింపులు సహా రకరకాల ప్రమాదకర పరిస్థితుల్లో ఏపీ స్త్రీలు – పిల్లలు డయల్ చేయాల్సిన నంబర్
9490616555 హైదరాబాద్ షీ టీమ్స్ వాట్సాప్ నంబర్
1098 చైల్డ్ హెల్ప్‌లైన్
24 గంటలూ పని చేస్తుంది. పిల్లలతో చాకిరి, బాల్య వివాహాలు, లైంగిక దాడులు / వేధింపుల వంటి వాటిపై ఈ నంబర్‌కు కాల్ చేయవచ్చు. దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి సహాయం పొందొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment