ఇందుశ్రీ
వెంట్రిలాక్విజమ్ మంచి కెరీర్. ఈ ఫీల్డులో అబ్బాయిలే ఉంటారని, అమ్మాయిలు రాకూడదని ఏ నిబంధనలూ లేవు. షోలు ఇస్తూనే ప్రస్తుతం నేను బెంగళూరులో ఎంఎస్ కమ్యూనికేషన్స్, బీఎఫ్‌ఏ కోర్సు చేస్తున్నాను. ఆసక్తి అమ్మాయిలకు, అబ్బాయిలకు వెంట్రిలాక్విజం నేర్పిస్తున్నాను. – ఇందుశ్రీ
ఇందుశ్రీ వెంట్రిలాక్విస్ట్. ఊహు.. ఈ మాట సరిపోదు. అంతర్జాతీయ వెంట్రిలాక్విస్ట్. ఈ మాట కూడా! ఇండియాలో మొట్ట మొదటి మహిళా వెంట్రిలాక్విస్ట్. ఎస్. ఈ మాట కరెక్ట్. ఈ ఏడాది జనవరి 20న న్యూఢిల్లీలో తొలి భారతీయ ఉమన్ వెంట్రిలాక్విస్ట్‌గా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఇందుశ్రీ ‘ఇండియన్ ఉమెన్ అచీవర్స్’అవార్డు అందుకున్నారు. ఈ నెల 26, 27 తేదీలలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఉత్సాహవంతులైన యువతీయువకుల కోసం రవీంద్రభారతిలో నిర్వహించిన శిక్షణా శిబిరాలకు వచ్చి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా సాక్షి ‘ఫ్యామిలీ’ ఇందుశ్రీని పలకరించింది. ఆ విశేషాలివి.
రెండేళ్ల వయసుకే ‘పట్టు’!
ఇందుశ్రీ బెంగుళూరు అమ్మాయి. రెండేళ్ల వయస్సులో టీవీలో వెంట్రిలాక్విజమ్ చూసి, మాట్లాడే ఆ బొమ్మ కావాలని పట్టుపట్టింది. తర్వాత కొన్నాళ్లు మ్యూజిక్‌లో పడిపోయి, తిరిగి వెంట్రిలాక్విజమ్‌లోకి షిఫ్ట్ అయ్యారు ఇందుశ్రీ. ఆమెకు ఆ కళను ఎవ్వరూ నేర్పలేదు. తనకు తానుగా ఆడియో, వీడియోల్లో నేర్చుకొంటూ సాధన చేస్తూ వచ్చారు!
ఇష్టం కాబట్టి.. కష్టమనిపించలేదు
వెంట్రిలాక్విజంలో ఆర్టిస్టుగా నిలదొక్కుకోడానికి రేయింబవళ్లు కష్టపడ్డారు ఇందుశ్రీ. స్క్రిప్ట్ ప్రిపేర్ చేసుకోవడం, బొమ్మలు తయారు చేసుకోవటం పెద్ద పనులు. బొమ్మల తయారీలో, ఎంపికలో మొదటి నుంచి ఆమె తండ్రి రవీంద్ర సహకారం అందిస్తూ వస్తున్నారు. ఇప్పుడిప్పుడు తమ్ముడు లకితేష్, భర్త అశ్వత్ భేరి చేదోడుగా ఉంటున్నారు. ఇందులో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కానీ, వాటిని నెగ్గుకుని వచ్చారు ఇందుశ్రీ.
లైవ్‌లో డాగ్ వెంట్రిలాక్విజమ్!
బహుశా ఎవ్వరూ ఈ తరహా ప్రదర్శన చేసి ఉండరు. ఇందుశ్రీ చేశారు! బెంగళూరులో సోనీ, స్టార్, సీఎన్‌ఎన్ టీవీల్లో కుక్క బొమ్మతో కాకుండా, నిజంగా కుక్కతోనే వెంట్రిలాక్విజమ్ షో చేశారు. ముంబైలో అయితే ‘ఇండియా హ్యాజ్ గాట్ టాలెంట్ షో’లో ఒకేసారి నాలుగు బొమ్మలతో .. (రెండు చేతుల్లో రెండు, రెండు కాళ్లతో రెండు) వెంట్రిలాక్విజమ్ చేశారు. ఒకోసారి ఆ ఈవెంట్‌ను ఎలా చేయగలిగానా అనిపిస్తుందట.
అభిమానులూ ఉన్నారు
2016లో బెంగళూరులో నారాయణ హృదయాలయంలో ఓ చిన్నారికి హార్ట్ ఆపరేషన్‌కు తేదీ నిర్ణయించారు డాక్టర్లు. కానీ ఆ చిన్నారి ఆపరేషన్‌కు రాను అంది. డాక్టర్లు కారణం అడిగారు. ‘‘ఇందుశ్రీ అక్క వెంట్రిలాక్విజమ్ ప్రోగ్రామ్ ఉంది. చూడాలి అంది. డాక్టర్లు విస్తుపోయారు. ఇది తెలిసిన ఇందుశ్రీ వండర్ అయ్యారు.
22 ఏళ్లు.. 3,500 షోలు
బెంగళూరు సిటీకేబుల్‌లో ప్రోగ్రామ్స్‌తో పాటు, బయట 3,500 పై షోలు చేశారు ఇందుశ్రీ. వెంట్రిలాక్విజమ్‌లో 22 ఏళ్ల జర్నీ ఆమెది. అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్, లండన్ లాంటి 16 దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. టీ కప్పు, పుస్తకంతో కూడా మాట్లాడించగలిగారు. అలా అన్ని వస్తువులతో మాట్లాడించాలన్నదే ఆమె ఆశయం.
– కోన సుధాకర్ రెడ్డి, ‘సాక్షి’ సిటీ
Comments
Please login to add a commentAdd a comment