అయామ్ శక్తి
అతివ తెగువ
ఇవి సెల్‌ఫోన్‌తో తీసిన వీడియో చిత్రాల ిస్టిల్స్. అందుకే స్పష్టంగా కనిపించడం లేదు. కానీ ఈ చిత్రాలలో కనిపిస్తున్న అమ్మాయిలోని ధైర్య సాహసాలు మాత్రం స్పష్టంగా వ్యక్తమౌతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటి? మీరట్ (ఉత్తరప్రదేశ్)లో రద్దీగా ఉండే రహదారిలో ఇటీవల ఈ అమ్మాయి, ఆమె తండ్రి మోటర్ బైక్ మీద విక్టోరియా ప్రాంతానికి వెళుతున్నారు. తండ్రి డ్రైవ్ చేస్తున్నారు. అమ్మాయి వెనక కూర్చుంది. వీరి వెనకే కారులో వస్తున్న ఐదుగురు యువకులు తండ్రీ కూతుళ్లను ఆటపట్టించడం, అల్లరి చేయడం మొదలు పెట్టారు. చివరికి కారుతో బైక్‌ని డీకొట్టారు. అమ్మాయి, అమ్మాయి తండ్రి బైక్‌తో పాటు కిందకు పడిపోయారు.
‘‘ఏమిటీ న్యూసెన్’’ అని తండ్రి గట్టిగా అరవడంతో ఐదుగురు యువకులూ ఆయనపై కలియబడ్డారు. వారిలో ఇద్దరైతే ఆయనపై చెయ్యి కూడా చేసుకున్నారు! అది చూసిన కూతురిలో కోపం కట్టలు తెంచుకుంది. ఒకడి కాలర్ పట్టుకుని చెంపలు వాయించింది. ఇంకొకడి గూబ మీద లాగిపెట్టి కొట్టింది. తండ్రి మీద మళ్లీ చేయి వేయబోతున్న మరొకడిని దూరంగా నెట్టేసింది. మీదికి రాబోయిన మరో ఇద్దరిని కాలితో ఒక్క తోపు తోసింది. విశేషం ఏమిటంటే ఒక ఆడపిల్ల ఒంటరిగా పోరాడుతున్నా దారిన పోతున్న వారిలో ఒక్కరూ ఆగి అమ్మాయికి సాయంగా రాలేదు! ఆ యువకుల్ని ఒక్క మాటా అనలేదు. కొందరు ఆగారు. కానీ యువకుల్ని అదుపు చెయ్యడానికి కాదు. ఆ దృశ్యాలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించడానికి!!
దేశంలో మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు మితిమీరుతున్న నేపథ్యంలో ఒక అమ్మాయి తెగించి తన తండ్రిని కాపాడుకోవడం కోసం ఆగంతకులను ఇలా ఎదుర్కొవడం ఆదర్శప్రాయం మాత్రమే కాదు, మహిళా లోకానికి స్ఫూర్తిదాయకం కూడా. ఇటీవల ముంబైలో ‘అయామ్ శక్తి’ అనే ప్రచారోద్యమాన్ని ప్రారంభించిన ప్రముఖ బాలీవుడ్ నటి రాణీముఖర్జీ మహిళలు అన్ని విధాలా శక్తిమంతులు కావాలని పిలుపునిచ్చారు. అబ్బాయిలే అమ్మాయిలకు రాఖీ కట్టే రోజు రావాలని ఉత్తేజ పరిచారు. స్త్రీలు శక్తిమంతులైతే మొత్తం సమాజంలోనే పరివర్తన వస్తుందని అన్నారు. తన తాజా చిత్రం‘మర్దానీ’లో సీనియర్ ఇన్‌స్పెక్టర్‌గా నటించిన రాణీ ముఖర్జీ... అమ్మాయిల ధైర్యమే వారిని, వారి పక్కవారినీ కాపాడుతుందని అన్నారు. ఈ మాటకు ఒక చక్కటి నిదర్శనంగా మీరట్ సంఘటనను చెప్పుకోవచ్చు.