మిసెస్ మొగుడు | work women special | Sakshi
Sakshi News home page

మిసెస్ మొగుడు

Published Tue, Jun 21 2016 10:28 PM | Last Updated on Mon, Oct 8 2018 8:34 PM

మిసెస్ మొగుడు - Sakshi

మిసెస్ మొగుడు

నేటి మధ్యతరగతి కుటుంబాల్లో పెళ్లానికి ఆదాయం ఉన్నా మొగుడి పెత్తనమే చెల్లుతుంది. పెళ్లాలు పేరుకే ఆర్థికంగా స్వతంత్రులు. నిజానికి - దే ఆర్ జస్ట్... ‘మిసెస్ మొగుళ్లు’. ఆఫీస్‌కి వెళ్తూ ఇప్పటికీ భర్త దగ్గర చిల్లర కోసం చెయ్యి సాచాల్సిందే. ‘‘ఆడవాళ్లకు కంట్రోల్ ఉండదు. ఏది చూసినా కొనేయాలనుకుంటారు. ఎక్కడపడితే అక్కడ ఖర్చు పెట్టేయాలనుకుంటారు.వీళ్లకేమైనా ఫ్రెండ్సా? తాగుళ్లా? బజార్లలో తిరుగుళ్లా? మగాళ్లకైతే ఖర్చుంటుంది కానీ పెళ్లాలకేముంటుంది’’ అని కొట్టి పారేస్తున్నారు మొగుళ్లు! మొగుళ్లు ‘మిస్’ అవుతున్న మ్యాటర్ ఒకసారి గుర్తు చేద్దామని  ఈ ‘మిసెస్ మొగుడు’.

 

ఈ ముగ్గురూ మధ్యతరగతి మహిళలే! భర్తల కన్నా ఎక్కువే చదువుకున్నారు. భర్తల కొలువులకు దీటైన ఉద్యోగాలే చేస్తున్నారు. నళిని బ్యాంక్ ఎంప్లాయ్. శైలజ కలక్టరేట్‌లో చేస్తోంది. శిరీష సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్. అయినా డబ్బుల కోసం అంత కటకట ఏంటి? వాళ్లకు కావల్సినవి వాళ్లు కొనుక్కోలేని దుస్థితి ఏంటి? కుటుంబ అప్పుల భారమేమన్నా మోస్తున్నారా? కాదు! మరి ఎందుకంత సర్దుబాటు? వాళ్ల సంపాదన వాళ్ల చేతుల్లో లేదు కాబట్టి.  ఈ రోజుల్లో జీతాలన్నీ పర్సనల్ అకౌంట్లోనే కదా పడేది? నిజమే కాని ఆ అకౌంట్లోంచి మనీ డ్రా చేసే ఏటీఎమ్ కార్డ్ వీళ్ల చేతుల్లో ఉండదు. వాళ్ల ఆయనల జేబుల్లో ఉంటుంది.  అదేంటి? ఈ ఆశ్చర్యాన్నే భార్యల ఏటీఎమ్‌కార్డ్స్‌ను మెయిన్‌టైన్ చేస్తున్న కొంతమంది భర్తల దగ్గర కనబరిస్తే... ‘ఉద్యోగం చేయడం వేరు. జీతాన్ని మేనేజ్ చేయడం వేరు. సెకండ్‌ది ఆడవాళ్లకు చేతకాదు. అందుకే ఏటీఎమ్‌ను మా దగ్గర పెట్టుకుంటాం’ అన్నారు. అయినా వాళ్లకేం  ఖర్చుంటుంది? బయట తినడాలు, ఫ్రెండ్స్‌తో మందుకొట్టడాలు ఉండవ్ కదా మనీకార్డ్ క్యారీ చేయడానికి? వాళ్లకు  కావల్సిన డబ్బు ఇస్తుంటాం’ అని ముక్తాయింపు ఇచ్చారు.

 
ఖర్చులకు ఆడ, మగ తేడానా?

ఎన్నో ఏళ్ల నుంచి ఆడవాళ్లే ఏలుతున్న ఇళ్లు ఉన్నాయి. మగవాళ్లు సంపాదనపరులుగా ఉన్నా ఆర్థిక వ్యవహారాలు, ఇంటి బాధ్యతలను స్త్రీలే చూసుకున్న ఉదాహరణలూ చాలానే కనపడ్తాయి. అంతెందుకు ముందు చెప్పుకున్న మూడు సంఘటనల్లోని మొదటి ఇద్దరూ పెళ్లికి ముందునుంచే ఉద్యోగస్తులు. తండ్రులకు ఆర్థికసహాయం అందించిన అమ్మాయిలే. శైలజ అయితే ఉద్యోగం చేసుకుంటూనే చదువుకుంది. పైగా ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడ్డ మరుసటి రోజు నుంచే తోబుట్టువుల చదువు బాధ్యతనూ  తీసుకుంది.  తండ్రి ఇంటి కోసం చేసిన అప్పు భారాన్ని కొంత మోసింది. ‘ఆర్థికంగా ఇంకొకరి మీద ఆధారపడడం నాకు నచ్చదు. అవమానంగా కూడా ఫీలవుతాను. అలాంటిది నేను సంపాదిస్తూ కూడా పదీపరకకు నా భర్త మీద ఆధారపడ్డం ఇన్‌సల్టింగ్‌గా ఉంటోంది. ప్రతి పదిరోజులకు ఒకసారి 250 నుంచి మూడు వందల వరకు ఆయనే నా పర్స్‌లో డబ్బు పెడ్తుంటారు. చాలా సార్లు అయిదు రోజులకే అయిపోతుంటాయవి. అప్పుడే అయిపోయాయా అని లెక్కలు అడిగితే ఏం చెప్తాం? ఖర్చులకు కూడా ఆడ, మగ అనే తేడా ఏంటి? మా సంపాదన మాకివ్వడానికే లెక్కలు అడుగుతారు... వాళ్ల జీతమెంతో కూడా చెప్పరు. మా పెళ్లయి 22 ఏళ్లవుతోంది. పెళ్లయ్యేటప్పటికీ మా వారి జీతమెంతో నాకు తెలియదు. ఇప్పటికీ  తెలియదు. ఒకటి రెండు సార్లు అడిగితే ‘నీకేం లోటయిందని లెక్కలడుగుతున్నావ్?’ అన్నారు. తను మాత్రం నా జీతభత్యాలు, నా ప్రమోషన్స్ వగైరాలు తెలుసుకున్నాకే సంబంధం ఖాయం చేసుకున్నారు’ అంటూ తన ఆర్థికస్వతంత్రలేమిని వివరించారు శైలజ. 

 
వర్కింగ్ విమెన్ వ్యధ

చాలామంది వర్కింగ్ విమెన్ వ్యధ ఇదే! ఆర్థిక భద్రతకోసమే కదా స్త్రీలూ ఉద్యోగాలు చేసేది. మరి ఆ సంపాదనకూ మొగుడే హక్కుదారయ్యాక స్త్రీకి భద్రత, ఆర్థికస్వాతంత్య్రం ఎలా వచ్చినట్టు?’ అన్నది కొంతమంది ఉద్యోగినుల ప్రశ్న. ‘మహిళలకు ఆర్థికవ్యవహారాలు చూసుకోవడం రాదు అన్నది అపవాదు మాత్రమే. వీళ్ల నుంచి డబ్బు లాక్కోవడానికి మగవాళ్లు.. మొగుళ్లు చూపిస్తున్న  బహానా మాత్రమే’ అని వాళ్ల విమర్శ, వాదన. అనూరాధ అనే గవర్నమెంట్ టీచర్ ఆర్థికస్వేచ్ఛలేమి బాధితురాలే. ఆమె భర్త కూడా టీచరే. ఇల్లు కట్టుకున్నారు. లోన్ తన పేరుమీదే తీసుకున్నాడు కాబట్టి ఇంటి రిజిస్ట్రేషన్ ఆయన పేరుతోనే అయిపోయింది. భర్త జీతం భారీమొత్తంలో కట్ అవుతుండడంతో ఆమె జీతాన్నే ఇంటి కోసం ఖర్చుపెట్టేది. ఈలోపల ఆడబిడ్డ పెళ్లి కుదిరింది. అప్పుడు ఆమె చేత లోన్‌కి అప్లయ్ చేయించి పెళ్లి చేశాడు. తర్వాత భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చాయి. విడిపోయేంతగా. ఆమె అప్పులతో బయటకు వచ్చింది. ఆయన ఇంటితో లాభపడ్డాడు. అభద్రతతో మానసిక ఆరోగ్యం దెబ్బతింది అనూరాధకు. అందుకే తనకు తెల్సిన పెళ్లికాబోయే అమ్మాయిలందరికీ ఒకటే సలహాఇస్తుంది అనూరాధ ‘మీ జీతం మీ దగ్గరే పెట్టుకోండి. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌లోనూ మీ పేరూ ఉండేలా చూసుకోండి. లేకపోతే మన డబ్బుని మనమే మొగుడి దగ్గర ముష్టి అడుక్కోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది’ అని! సంపాదిస్తున్నా భార్యలకు తమ డబ్బుమీద అధికారం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా విస్తృత ఉదాహరణలు అవసరం లేదేమో! 



కాంక్రీట్‌వనం...
చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళుతోంది శిరీష. అసలు తను ఉద్యోగంలో చేరగానే మొదటి జీతంతో అమ్మకు, నాన్నకు బట్టలు కొని పంపాలనుకుంది. ఆర్నెల్లయినా ఆ ఆశ తీరలేదు. మదర్స్‌డేకి, మొన్న ఫాదర్స్‌డేకీ  గి్‌ఫ్ట్స్  కొని పంపాలనుకుంది. అదీ కుదరలేదు. కనీసం ఇప్పుడైనా అమ్మకు, నాన్నకు ఇష్టమైనవి పట్టుకెళ్లాలి. తమ్ముడికి ఓ మొబైల్ కొనివ్వాలి... రాజి వాళ్లకు హైదరాబాద్ గాజులంటే చాలా ఇష్టం. తీసుకెళ్లాలి... ఓ వారం ముందునుంచి ప్లాన్ చేసుకుంది. ఏదీ కాలేదు. నానమ్మకు హైదరాబాద్ ద్రాక్షలంటే ఇష్టం. కనీసం అవైనా... ‘హైదరాబాద్‌లో ద్రాక్షతోటలేవి? అంతా కాంక్రీట్ వనమేనని మీ నానమ్మకు చెప్పు. అంతగా పళ్లు తీసుకెళ్లాలనుకుంటే మీ ఊళ్లో బస్ దిగాక బస్టాండ్‌లో అరటిపళ్లు కొని పట్టుకెళ్లు. బస్ చార్జెస్ పోనూ... ఇదిగో ఇవి దగ్గరపెట్టుకో. నానమ్మకు అరటిపళ్లు లాంటి ఏవో ఖర్చులుంటాయి కదా ఉంచు’ అంటూ ఉదారంగా ఆయన తన బ్యాగ్‌లో వం...ద... రూపాయలు సర్దాడు! ఉక్రోషం, కోపం ముంచుకొచ్చాయి శిరీషకు.

 

యాభై రూపాయలే...
చార్మినార్ దగ్గర షాపింగ్ చేస్తున్నారు మానస, శైలజ. కొనాల్సిన అవసరాలు చాలా కనపడ్డా తన పర్స్‌లో మనీ అకౌంట్ అంచనాకొచ్చి కేవలం చెప్పుల జతకే పరిమితమైంది శైలజ. బాగా నచ్చాయి. పెద్దగా బేరం ఆడకుండానే ఓకే చేసేసుకుంది. ఆత్రంగా పర్స్ తీసింది. కేవలం యాభై రూపాయలు మాత్రమే ఉన్నాయి. మౌనంగా పర్స్ క్లచ్ క్లోజ్ చేసి... భయ్యా.. అభీ యాద్ ఆయా.. ఇస్ కలర్ మే ఏక్  జోడా మేరే పాస్ హై... అంటూ అక్కడ లేని కలర్ గురించి వాకబు చేసింది. ‘వో తో నయ్యే అమ్మా...’ అన్నాడు చెప్పుల షాప్ అతను. నిట్టూర్చి బయటకు నడిచింది.

 

మగవాళ్ల స్వభావంగా...
ఉద్యోగం చేస్తున్న భార్యల జీతభత్యాల మీద పెత్తనం చేస్తున్న భర్తలను స్వభావమనే కోణం నుంచి అర్థంచేసుకోవాలి. సహజంగానే మగవాళ్లది ఆధిపత్యధోరణి. అది ఆర్థికవ్యవహారాల నుంచే వచ్చింది. కాబట్టి కాలం మారినా వాళ్ల స్వభావం మారలేదు. పురుషులకు, మహిళలకు ఒకేరకమైన అవసరాలుంటాయనుకోవడం లేదా మహిళలకు అవసరాలేముంటాయి అనుకోవడం తప్పు. ఇదే భార్యభర్తల మధ్య స్పర్థలకు దారితీస్తుంది. ఆర్థికస్వేచ్ఛలేదనే భార్య బాధ, తను మాత్రమే కుటుంబ బాగోగుల బాధ్యతలను నెత్తినేసుకోగలడు అనే భర్త తత్వం చివరకు ఆ కుటుంబాన్ని కలహాల్లోకి నెడుతున్నాయి. కాలానికి తగ్గట్టు మగవాళ్లూ తమ స్వభావాన్ని మార్చుకోవాలి. కుటుంబ ఆర్థికవ్యవహారాల పట్ల తామూ అంతే బాధ్యతగా ఉంటామన్ని విషయాన్ని భార్యలూ చెప్పాలి.   - సి. వాణీమూర్తి, ఫ్యామిలీ కౌన్సెలర్

 

బూడిదలో పోసిన పన్నీరు
ఆర్థికస్వాతంత్య్రం లేని ఉద్యోగినులు దాదాపు 70 శాతం మంది ఉంటున్నారు.  కుటుంబ క్షేమాన్ని ఆశించే భర్తలు భార్యల సంపాదన మీద అధికారం తీసుకుంటున్నా వాళ్లు చేసే ఇన్వెస్ట్‌మెంట్లు, పాలసీలు, పొదుపులకు సంబంధించిన వివరాలను భార్యలకు చెప్పడం లేదు. వీళ్లూ అడగడం లేదు. దాంతో ఆర్థిక విషయాల మీద భార్యలకు పట్టు రావడంలేదు. ఈలోపు  కుటుంబపెద్దకు హఠాత్తుగా జరగరానిదేదైనా జరిగితే ఆ కూడబెట్టిన ఆ డబ్బంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతోంది.    - రజని భీమవరపు,ఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’

 

ముప్పై సార్లు వెదికినా...
ఉదయమే రావాల్సి ఉండి.. బాక్స్ తెచ్చుకోలేదు. ఆకలి నకనకలాడుతోంది. బాయ్‌తో తినడానికి ఏదైనా తెప్పించుకుందామని డబ్బుల కోసం బ్యాగ్ తెరిచింది నళిని. మూడు కంపార్ట్‌మెంట్లున్న ఆ బ్యాగ్‌ను ముప్పైసార్లు వెదికింది. అయిదు రూపాయల కాయిన్ తప్ప పదుల నోట్లు కనపడలేదు. కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. ఆకలి బాధతో కాదు.. అవమాన భారానికి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement