ఐదేళ్లలో మహాభారత్!
మంది ఎక్కువైతే మజ్జిగ పలచనౌతుంది. మజ్జిగేనా.. అన్నీ పలచనవుతాయి. ఆఖరికి మనిషే పలచన అవుతాడు. ప్రకృతి ఇవ్వగలిగినంత ఇస్తుంది. ఇవ్వలేనంత మంది పుట్టుకొచ్చేస్తుంటే ఉన్నదాన్నే సర్దుకోమంటుంది. ఈ రోజు ప్రపంచ జనాభా దినోత్సవం. కానీ ఉత్సవం కొన్ని దేశాలకే. మన లాంటి పెద్ద దేశాలకు (జనాభాలో పెద్ద) ఉత్సవం కాదు. ఉపద్రవం. ఈ ఉపద్రవం ఎంత త్వరగా ముంచుకురాబోతున్నదంటే.. ఇంకో ఐదేళ్లలో.. అంటే 2022 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించిపోతుందట!
ఆలోచించాల్సిన విషయమే. 2028 నాటికి భారతదేశ జనాభా చైనా జనాభాను మించిపోతుంది అని 2013లో ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. అయితే అంతకు ఆరేళ్ల ముందే 2022లో మనం చైనాను దాటేయబోతున్నామన్నమాట! మన పాపులేషన్ ఎంత ఫాస్ట్‌గా పెరిగిపోతోందో చూడండి! (ప్రస్తుతం చైనా జనాభా 140 కోట్లు. భారత్ జనాభా 130 కోట్లు. మొత్తం ప్రపంచ జనాభా 750 కోట్లు.)