బియ్యంలో పురుగు | Worm in the rice | Sakshi
Sakshi News home page

బియ్యంలో పురుగు

Published Wed, Jun 6 2018 12:39 AM | Last Updated on Wed, Jun 6 2018 12:39 AM

Worm in the rice - Sakshi

బియ్యంలో పురుగు ఉంటుంది.బియ్యపు గింజలా ఉంటుంది.కలగలిసిన పురుగును కనిపెట్టడం కష్టం.కాని క్లూ ఉంటుంది.సరైన క్లూ దొరికితే పురుగు పట్టుబడుతుంది.చట్టం ఆ పురుగు చుట్టూ బిగుసుకుపోతుంది.

హార్యానాలో ఆర్మీ క్యాంప్‌.‘ఘర్‌ జానా హై’... అని పెద్దగా అరిచాడు ఒక జవాను.అది సెలవులు ఇచ్చే టైము. అందరూ ఉత్సాహంగా ఉన్నారు.‘బీవీ కో చుమ్మా దేనా హై’ అని నవ్వాడు కిరణ్‌.‘ఏయ్‌... ఏంట్రా నీ వాగుడు’ అన్నాడు ఒక మిత్రుడు కిరణ్‌తో.‘లేకుంటే ఏంట్రా మీరంతా. ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా పెళ్లాం పాదాల దగ్గర వాలిపోదామా అని. నాకు చూడు ఒంటరిగాణ్ణి. హాయిగా సెలవుల్లో తిరుగుతా. అన్నింటిమించి మా అన్నయ్య వొదిన దగ్గర సరదాగా గడుపుతా’ అన్నాడు కిరణ్‌.‘ఈ వయసులో పెళ్లి పిచ్చో సినిమాల పిచ్చో ఉండాలి. నువ్వు మాత్రం అన్నా వదినల పిచ్చోడివి’ అని ఆటపట్టించారు ఫ్రెండ్స్‌.కిరణ్‌ హాయిగా నవ్వేశాడు. అన్నా వదినల దగ్గరకు వెళ్లినా ఈసారి పెళ్లి బలవంతం తప్పదేమో అనుకుంటూ బ్యాగ్‌ సర్దుకొని స్టేషనుకు చేరుకున్నాడు.


‘ఇది కోడి కూరా.. ఇది చింతాకు పులుసు... ఇది గోంగూర రొయ్యలు’... వరుస పెట్టి పెడుతూ ఉంది వదిన మణి.‘ఇంకో నాలుగు తెచ్చి పెట్టవే. ఏ ఆర్మివాడైనా బుల్లెట్‌తో పోయాడంటే గౌరవం. భోం చేసి పోయాడంటే ఎంత అప్రదిష్ట’ నవ్వుతూ అన్నాడు.నెల్లూరు జిల్లాలోని ఒక టౌన్‌ అది.సెలవు ఇవ్వగానే కిరణ్‌ సరాసరి అన్నా వదినల ఇంటికి వచ్చేశాడు. అక్కడికి పది మైళ్ల దూరంలో ఉన్న పల్లెలో కిరణ్‌ తల్లిదండ్రులు ఉంటారు. కాని సాధారణంగా అక్కడికి వెళ్లడు. వచ్చాడంటే ఇక్కడే.‘కిరణ్‌ సంగతి ఏమోకాని మీరు తినకపోతే బడితె పూజే’ భర్త ప్లేట్లో కూడా అన్నీ వడ్డిస్తూ అంది మణి.కిరణ్‌ నవ్వుతూ వాళ్లనే చూస్తూ ఉన్నాడు.వచ్చిన ప్రతిసారీ వాళ్లనే చూస్తూ ఉంటాడు. ప్రసాద్‌ బియ్యం వ్యాపారం చేస్తాడు. మణి ఇంట్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లలు. ఐదొకరు, ఏడొకరు చదువుతున్నారు. నలుగురూ హ్యాపీగా ఉంటారు. ప్రసాద్‌ మాటే వేదవాక్కు అన్నట్టుగా మణి ఉంటుంది. ప్రసాద్‌ తిన్నాక అదే కంచంలో తింటుంది. ఎంత ఆలస్యంగా వచ్చినా ఎదురు చూస్తూ ఉంటుంది. అన్నింటికి మించి ఎప్పుడూ నవ్వుతూఉంటుంది.  వారిద్దరు కొట్లాడుకున్నట్టు కిరణ్‌ ఎప్పుడూ చూళ్లేదు.అందుకే ఆ వాతావరణంలో ఉంటాడు తను. ఇది చూసి ఇరుగూ పొరుగూ ‘సొంత అన్నదమ్ములు కూడా ఇలా ఉండరు’ అంటూ ఉంటారు. అవును. ప్రసాద్, కిరణ్‌ చిన్నాన్న పెదనాన్న పిల్లలు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. కిరణ్‌ అందుకే చనువుగా ఇక్కడ ఉంటాడు.భోజనం ముగిస్తుండగా పిల్లలు లోపలికొచ్చారు.
‘బాబాయ్‌... మా స్కూల్‌ యానివర్సరీ ఉంది ఎల్లుండి... నువ్వు రావాలి’ అంది పెద్దమ్మాయి. 

‘అవును కిరణ్‌.. నువ్వు రా. ఈ మనిషికి అలాంటివేవీ పట్టవు. ఎంత పిలిచినా రాడు’ అంది మణి.‘అలాగే... తప్పకుండా వెళ్దాం వదిన’ అన్నాడు కిరణ్‌.అందరూ హాల్లోకి వచ్చి కూర్చున్నారు.‘ఈసారి సంబంధం ఖాయం చేసి వెళ్రా’ అన్నాడు ప్రసాద్‌.‘బాబోయ్‌... ఇప్పుడే పెళ్లొద్దు’ హాస్యమాడాడు కిరణ్‌.ప్రసాద్‌ సీరియస్‌ అయ్యాడు.‘పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఇలా ఎంత కాలం’మణి కూడా అందుకోసమే ఎదురు చూస్తున్నట్టుంది.‘అవునయ్యా. పెళ్లికి ఓకే అనకపోతే ఇక మా ఇంటికి రావద్దు’ అంది.ప్రసాద్‌కు వ్యవహారం సీరియస్‌గా ఉన్నట్టుందని అర్థమై ‘సరే... మీ ఇష్టం’ అన్నాడు.

ఏప్రిల్‌ 18. 2016.తెల్లవారి మంచం మీద నుంచి హడావిడిగా నిద్ర లేపుతోంది తల్లి.‘రేయ్‌ కిరణ్‌... లేవరా... అన్నయ్య కనపడటం లేదట’‘ఏంటి?’‘ప్రసాద్‌ కనిపించడం లేదట’కంగారుగా లేచాడు కిరణ్‌. రాత్రే తల్లిదండ్రుల దగ్గరకు వచ్చాడు. ఏమై ఉంటుంది? ఆఘమేఘాల మీద టౌన్‌కు చేరుకున్నాడు.ఇంటి దగ్గర ప్రసాద్‌ ఫ్రెండ్స్‌ వచ్చి ఉన్నారు. సెల్‌ నాట్‌ రీచబుల్‌ వస్తోంది.‘కిరణ్‌’... కిరణ్‌ను చూసి మణి ఏడ్చేసింది.‘ఏం అయ్యుండదులే వదినా. కంగారు పడకు’ అన్నాడు కిరణ్‌. ఈలోపు ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్‌ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్‌ బండే.  మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్‌ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.‘సార్‌... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి.  పోలీసులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. వాళ్లనూ వీళ్లనూ ఆచూకీ తీశారు. గట్టిగా ఏమీ కనిపించలేదు. మూడు రోజులు గడిచాయి. కిరణ్‌ తిరిగి తిరిగి అలసిపోయాడు. మరోవైపు అతడికి సెలవులు అయిపోవచ్చాయి. అసలే ఆర్మీతో వ్యవహారం. వెళ్లి తీరాలి. బరువెక్కిన గుండెతో వదిన దగ్గరకు వచ్చాడు.‘వదినా! నా సెలవులైపోయాయి. లీవ్‌ పొడిగించుకోవడం కుదరడం లేదు. అన్నయ్య త్వరలోనే ఇంటికి వస్తాడు ధైర్యంగా ఉండు. పిల్లలు, నువ్వూ జాగ్రత్త’ అన్నాడు.కన్నీరుతో మౌనంగా ఉండిపోయింది మణి.

ఏప్రిల్‌ 21, 2016 వింజమూరు–గుండెమడకల మధ్య చిట్టడవిలో ప్రసాద్‌ మృతదేహం దొరికింది.మెడపై, ఛాతిపైభాగాన, కడుపులో, భుజాలపై 11 కత్తిపోట్లు ఉన్నాయి. అంతక్రూరంగా హత్యచేశారంటే పగబట్టిన వాళ్లే అయి ఉంటారు. వాళ్లెవరనేది ఇప్పుడు తేలాలి.పోలీసులు విభిన్న కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. బియ్యం వ్యాపారంలోని లావాదేవీలే హత్యకు కారణమై ఉండవచ్చని నిర్ధారణకొచ్చారు. ప్రసాద్‌తో సంబంధాలున్న ప్రతి ఒక్క వ్యాపారిని వేరువేరుగా విచారణ చేపట్టారు. ప్రసాద్‌ కాల్‌ డీటైల్స్‌ను పరిశిలించారు. ఏ చిన్నపాటి క్లూ లభ్యం కాలేదు.
కేసు ఎటూ తేలడం లేదు. ఎనిమిది నెలలు గడిచిపోయాయి.

జనవరి 28, 2017. కేరళ నుంచి ఒక పార్శిల్‌ మణి ఇంటికి వచ్చింది. అది అక్కడి ఒక ఆయుర్వేద హాస్పిటల్‌ నుంచి వచ్చిన మందుల ప్యాకెట్‌. దాని మీద కిరణ్‌ పేరు ఉంది. సెలవుల్లో ఇక్కడకు వచ్చే ముందు కేరళ తిరిగి వచ్చినట్టు కిరణ్‌ చెప్పడం మణికి గుర్తు ఉంది. మరి అక్కడ ఆయుర్వేద హాస్పిటల్‌కు ఎందుకు వెళ్లాడు? మణి మందుల పేర్లు చూసింది. ఇంటర్నెట్‌లో సెర్చ్‌ కొట్టింది. అవన్నీ పురుషపటుత్వానికి ఉపయోగపడే మందులు. సర్‌ప్రైజ్‌ గిఫ్ట్‌గా వాటిని పంపుతున్నట్టు మళ్లీ విజిట్‌ను ఆశిస్తున్నట్టు ఆ లెటర్‌లో ఉంది. వాటిని తండ్రికి చూపించింది మణి.  ఆయనకు కిరణ్‌ వ్యవహారం ముందు నుంచి గిట్టదు. అంత ప్రేమించే అన్నయ్య కనిపించకపోతే సెలవైపోయిందని వెళ్లడమే ఆయనకు నచ్చలేదు. ఎందుకైనా మంచిదని పోలీసులను కలిశాడు.ఎస్‌.ఐ ఆ మందులను చూసి ‘ఇలాంటివి కుర్రాళ్లు వాడటం మామూలే. దీని ఆధారంగా ఎలా అనుమానిస్తాం’ అన్నాడు.‘అది కాదండీ... పోయినసారి వచ్చినప్పుడు ఫ్రెండ్‌ పెళ్లి ఉందని సెలవు ఎక్స్‌టెన్షన్‌ చేసుకున్నాడు. అప్పుడు ఎక్స్‌టెండ్‌ చేసుకోగా లేనిది అన్నయ్య కనపడకపోతే చేసుకోడా’ అన్నాడు మణి తండ్రి.ఎస్‌.ఐకి ఏదో క్లూ దొరికినట్టే అయ్యింది.కిరణ్‌కు సంబంధించిన ఒక్కొక్క వివరం సేకరించడం మొదలుపెట్టాడు. సరిగ్గా పది రోజులకు ఆర్మీ పర్మిషన్‌ తీసుకుని కిరణ్‌ను పట్టుకొని జైల్లో తోశాడు.

కిరణ్‌ హర్యానాలోని మానేసర్‌ ఎన్‌ఎస్‌జీ క్యాంప్‌లో జవాన్‌గా పనిచేస్తున్నాడు. అప్పుడప్పుడు సొంత ప్రాంతానికి వచ్చి వెళుతుంటాడు. ఒక్కడే కొడుకు. కాని చిన్నతనం నుంచి ఇంట్లో శాంతి లేదు. తల్లిదండ్రుల వైవాహిక జీవితం సరిగా లేదు. ఎప్పుడూ కాట్లాడుకుంటూ ఉండేవారు. తను మాత్రం ఇలా కాకుండా కాబోయే భార్యతో బాగా ఉండాలని అనుకునేవాడు. కాని ఒకసారి ఊహించనిది జరిగింది. వేశ్యావాటికకు వెళ్లినప్పుడు అతడి లోపం తెలిసింది. పెళ్లి జరిగితే అవమానం తప్పదని అర్థమైంది. మెరుగు కోసం రకరకాల మందులు వాడేవాడు. లాభం లేకపోయింది. కేరళలో డూప్లికేట్‌ ఆయుర్వేదశాలకు వెళ్లి అక్కడా మోసపోయాడు. ఆత్మవిశ్వాసం పూర్తిగా పోయింది. బుద్ధి పాడైంది. ఈ నేపధ్యంలో ప్రసాద్‌–మణిల దాంపత్యం చూసి ఈర్ష్యతో రగిలిపోయాడు. తన జీవితంలో కుదరనిది అన్న జీవితంలో మాత్రం ఎందుకు అని భావించాడు. సెలవు మీద వచ్చినప్పుడు ప్రసాద్‌ని హత్యచేయాలని కత్తి కొనుగోలుచేసి తన వద్దనే ఉంచుకొన్నాడు. ఏప్రిల్‌ 17వ తేది సాయంత్రం స్కూల్‌ వార్షికోత్సవం కోసం ప్రసాద్‌ భార్య, ఇతర కుటుంబసభ్యులు స్కూల్‌కు వెళ్లారు. ప్రసాద్‌ ఇంటి దగ్గరే ఉండటంతో కిరణ్‌ వచ్చి స్నేహితులు పార్టీ ఇస్తున్నారని రమ్మని  కోరాడు. ఇద్దరు ప్రసాద్‌ బైక్‌పై బయలుదేరారు. కొద్దిదూరం వెళ్లాక బైక్‌ను నడపమని ప్రసాద్‌కు ఇచ్చి తను వెనుక కూర్చొన్నాడు. అటవీప్రాంతం వచ్చేసరికి బైక్‌ని స్లో చేయమన్నాడు. ఒక్కసారిగా ప్రసాద్‌ను విచక్షణారహితంగా కత్తితో పొడిచాడు. ప్రసాద్‌ అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని బోర్లపడవేసి అక్కడ నుంచి బైక్‌పై టౌన్‌కి బయలుదేరాడు. దారిలో పెట్రోల్‌ అయిపోవడంతో చెట్లలో పడేసి ఎవరికీ అనుమానం రాకుండా స్కూల్‌ వార్షికోత్సవ ఫంక్షన్‌లో పాల్గొని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లిపోయాడు. ప్రసాద్‌ కోసం గాలించినట్టు నటించాడు. తాను చేసిన ఘాతుకం ఎప్పటికీ బయటకు రాదని భావించాడు. నేరం చేసిన వాళ్లు చట్టం నుంచి తప్పించుకోలేరని, పోలీసులు చిన్నపాటి క్లూతో నిందితుడ్ని కటకటాల వెనక్కి పంపారు. 

ఊరి పొలిమేరలో పొదల దగ్గర ఓ బైక్‌ పడి ఉందని ఊర్లో వాళ్లు ఇంటికి వచ్చి చెప్పారు. వెళ్లి చూస్తే అది ప్రసాద్‌ బండే.  మణి ఆలశ్యం చేయలేదు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్‌ కేసుగా నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. ‘సార్‌... మా అల్లుడికి బియ్యం వ్యాపారులతో కొన్నిసార్లు పడకపోవడం మేం చూశాం. వాళ్లే ఈ పని చేసి ఉంటారు’ అన్నాడు అనుమానంగా మణి తండ్రి.
– కె. హరిబాబు, సాక్షి, నెల్లూరు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement