లీ కీహో
దక్షిణ కొరియా రాజధాని స్యోల్లో ఉండే పేరుండని యూనివర్సిటీ లెక్చరర్‌కు తన ఉద్యోగమంటే విసుగు. ఊర్లో ఉన్న భార్యాపిల్లల వద్దకి రెండు మూడు వారాలకొకసారి వెళ్తుంటాడు. అతనుండే అపార్టుమెంట్ల బ్లాక్, ఊరి శివార్లలో ఉంటుంది. అతను రచయిత కూడా. కానీ బద్ధకం వల్ల ఏదీ రాయలేకపోతాడు.
అతనికెప్పుడూ కోపమే. ‘అమాయకులమీద నాకెందుకు కోపం వస్తుంది? కోపం రావాలని నాకెందుకనిపిస్తుంది?’ అని తనని తాను ప్రశ్నించుకుంటాడు. నిద్రపట్టక, మిక్ఛొ అనే స్థానిక బీర్ తాగడానికి పక్కనున్న బార్‌కు వెళ్తుంటాడు. ఇలా 8 ఏళ్ళు కొనసాగుతుంది.
అతని యీ బండిగాడి వంటి జీవితం ఒకరోజు దిశ మళ్ళుతుంది. ‘పనికెళ్ళే దారిలో కొండ ముందున్న ఖాళీ స్థలంలో రెండు దేవదారు చెట్లున్నాయి. స్తంభాల్లా నిలుచున్న ఆ చెట్లకి నీలి పందిరి వేళ్ళాడుతోంది. దానికింద చాపేసుకుని ఒక వ్యక్తి కూర్చున్నాడు. అతను రెండు పెద్ద విజ్ఞాపన పత్రాలను పట్టుకున్నాడు... ఒకదానిమీద రాసున్నది స్పష్టంగా చదవగలిగాను.’
‘అపార్ట్‌మెంట్ బిల్డింగ్ 103లోని 502వ నంబర్ యూనిట్లో ఉండే వడ్డీ వ్యాపారైన శ్రీమాన్ కిమ్ సియోక్ నా ఏడు వేల వొన్లు వెనక్కియ్యాలి. నేను తీసుకున్న ఒకే అప్పుకి– నానుంచీ, నా మరణించిన తల్లినుంచీ కూడా డబ్బు రాబట్టాడు’ అని రాసిన ఆ పత్రాన్ని పట్టుకున్నతను– కొరియన్ రచయితైన లీ కీహో రాసిన నవలిక పేరైన ‘క్వాన్ సన్ చన్ అండ్ నైస్ పీపుల్’లోని క్వాన్ సన్ చన్. అయితే, 502లో ఉండేది వృద్ధురాలు. ఊతకర్రతో నడుస్తూ, బతుకు దెరువు కోసం చిత్తుకాగితాలు ఏరుకుంటుంది. ‘అతను అదే చోట రోజుల తరబడి ఉండటం ఆశ్చర్యం కలగజేసింది. అతనొక్క మాటా మాట్లాడలేదు. బిల్డింగ్ లోపలికి కూడా రాలేదు. ఎవరితోనూ మాట్లాడలేదు.’
వ్యాపారి కనిపిస్తాడనే ఆశతో క్వాన్ నెలల తరబడి అక్కడినుండి కదలడు. మొదట చిరాకుతో అతన్ని వదిలించుకోవాలనుకున్న అపార్ట్‌మెంట్ నివాసులు చివరకు, ‘తప్పుగా అనుకోకు. నీ ప్రవర్తన వల్ల ఏ పరిష్కారం దొరకదు. నీక్కావల్సిన వ్యక్తి 502లో లేడని నీకు తెలిసినదే. యువకుడివి. ఇలా ఆరుబయట పడుకోవడం బాలేదు. అక్టోబర్ వచ్చేసింది. చలి మొదలయింది’ అని నచ్చజెప్పినప్పుడు, క్వాన్ మౌనం వహిస్తాడు.
‘వేడి భోజనం తింటున్నప్పుడూ, వేణ్ణీళ్ళ స్నానం చేస్తున్నప్పుడూ అతని పలచని డేరాయే నా ముఖం ముందు మెదులుతోంది. అపార్టుమెంట్ల నివాసులకూ అలానే అనిపించింది కాబోలు. చందా పోగు చేయడం ప్రారంభించారు. నవంబర్ కల్లా ఏడు వొన్లకి మరి రెండు ఎక్కువే కూడాయి. డబ్బుని కవర్లో క్వాన్‌కు అందజేసి, నివాసులందరూ ఒకరొకరుగా అతనితో కరచాలనాలు చేస్తున్నప్పుడు సూపర్ మార్కెట్ యజమాని వీడియో తీయాలని నిర్ణయించుకుంటాడు’ అంటాడు కథకుడు.
అయితే, క్వాన్ ‘నేను వడ్డీ వ్యాపారితో సంగతేదో తేల్చుకుందామనుకున్నానంతే. నాకీ డబ్బొద్దు’ అని నిరాకరించినప్పుడు, ‘మన ఔదార్యాన్ని తోసిపారేస్తాడా!’ అనుకుంటూ అందరూ వెళ్ళిపోతారు. క్వాన్ నిరసన కేవలం న్యాయం కోసమేనని వారికి తట్టదు.
కొద్ది రోజుల తరువాత పెద్ద సెడాన్ కార్ నుంచి ఒక మనిషి దిగి, అయిదవ అంతస్తుకి వెళ్తాడు. అతనే వడ్డీవ్యాపారి. అతను తన తల్లి ఫ్లాట్ నంబర్నే తన చట్టబద్ధమైన చిరునామాగా ఉపయోగించుకున్నాడని కథకుడు అర్థం చేసుకుంటాడు.
2015లో ఏష్యా పబ్లిషర్స్ ప్రచురించిన యీ 128 పేజీల నవలికను అనువదించినది స్టెల్లా కిమ్. లీ కీహో– 1972లో పుట్టారు. శైలి అసాధారణమైనదనీ కథకు కావల్సిన మర్యాదలను పాటించరనీ పేరుంది. ఆయన పాత్రలన్నీ సగటు జీవితాలపైన ఆధారపడినవే. యీ గందరగోళమైన లోకంలో జనాలకు ఇతరులతో తరచూ సంఘర్షణలు రగిలే కాలంలో ఇరుగు పొరుగు వారితో సఖ్యతగా ఉండటమెలా! అన్న ఆందోళనకరమైన అంశానికి రచయిత చమత్కారం, సూక్ష్మదృష్టితో కాల్పనిక రూపం ఇచ్చారు.
-కృష్ణ వేణి
Comments
Please login to add a commentAdd a comment