ఔను...అచ్చం అలాగే!
కాపీ కళలో కాకలు తీరిన ఆర్టిస్ట్ మైక్ రోమ్. అరవై ఆరు సంవత్సరాల మైక్,
బ్రిస్టల్(ఇంగ్లండ్)లోని తన సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్‌లో మోనాలిసాలాంటి మాస్టర్‌పీస్‌లను వేగంగా గీస్తుంటాడు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన వందలాది కళాఖండాలను ఒంటిచేత్తో గీశాడు మిస్టర్ రోమ్. ఈయన ఒకప్పుడు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేశాడు.తన భార్య పామ్ చనిపోయిన తరువాత రోమ్‌ను ఒంటరితనం ఆవహించింది. దాని నుంచి బయటపడడానికి తనను తాను ఎప్పుడు బిజీగా ఉంచుకోవడానికి ఈ కళ తనకు ఉపయోగపడింది.
చిత్రకళలో ఎవరి దగ్గరా ఎలాంటి శిక్షణా తీసుకోని రోమ్ ‘సాధనను మించిన అనుభవం లేదు’ అని నమ్ముతాడు. రోమ్‌లోని ప్రతిభ మొదటిసారి కొందరు ఇంజనీర్‌ల దృష్టిలో పడింది. అప్పుడు ఆయన వారి ఆఫీస్‌లో పనిచేసేవాడు.రోమ్‌ను చిత్రాలు వేయించే దిశగా ఆ ఇంజనీర్‌లు ఎంతగానో ప్రోత్సహించారు.తాను ఒక చిత్రాన్ని చిత్రించే ముందు దాని తాలూకు ఒరిజినల్‌ను గ్యాలరీకి వెళ్లి చూసి వస్తాడు. ఆ తరువాతగానీ కుంచెకు పనిచెప్పడు రోమ్.
‘‘నేను గీసేవి నకిలీ అనుకోనక్కర్లేదు. వాటికంటూ ఒక సొంత విలువ ఉంది’’ అంటాడు రోమ్.
ఒక్కో పెయింటింగ్ వేయడానికి మూడు నుంచి నాలుగు గంటల వ్యవధి తీసుకుంటాడు.
రోమ్ కాపీ చేసిన చిత్రాలు ఎన్నో గ్యాలరీలలో కొలువవుతుంటాయి. మంచి ధరకు అమ్ముడవుతుంటాయి.
‘‘చిత్రకళలలో నా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవడానికే మొదట ఈ పని మొదలు పెట్టాను’’ అంటున్న రోమ్ ఆ తరువాత ‘రెప్లికా’ ను ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు.
ప్రసిద్ధ చిత్రాలను మాత్రమే కాపీ చేయాలనే నియమమేదీ పెట్టుకోలేదు. తన మనసుకు నచ్చిన అనామక చిత్రాలను కూడా కాపీ చేస్తుంటాడు.‘‘కాపీ కళ అనగానే కొంత చిన్నచూపు ఉంటుంది. గుర్తింపు రావడానికి కొంత సమయం పడుతుంది’’ అంటాడు రోమ్. భవిష్యత్తులో మరిన్ని ఎక్కువ చిత్రాలను అమ్మగలనంటున్నాడు మైక్ రోమ్.