
ఈ వారం యూట్యూబ్ హిట్స్
వార్ మూవీ ‘డంకర్క్
డంకర్క్ : ట్రైలర్ 1 :: నిడివి : 2 ని. 18 సె. :: హిట్స్ : 1,19,12,322
ఇంటర్‌స్టెల్లార్.. సైన్స్ ఫిక్షన్. ఇన్‌సెప్షన్.. క్రైమ్ థ్రిల్లర్. ది డార్క్ నైట్.. సూపర్‌హీరో యాక్షన్. ఈ మూడు చిత్రాలను తీసిన హాలీవుడ్ డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ ఇప్పుడు ‘డంకర్క్’ అనే చారిత్రక యాక్షన్ మూవీని తీస్తున్నారు. వచ్చే ఏడాది జూలై 21న సినిమా రిలీజ్ అవుతోంది. ఈ చిత్రం ఫస్ట్ ట్రైలర్ యూట్యూబ్‌లో రెండు రోజుల క్రితమే విడుదలైంది. నోలన్ బ్రిటిష్–అమెరికన్. ‘డంకర్క్’ బ్రిటిష్ వార్ ఫిల్మ్. చరిత్రలో ప్రసిద్ధి కెక్కిన ‘డంకర్క్ ఎవాక్యుయేషన్’ (కోడ్ నేవ్ : ఆపరేషన్ డైనమో) ఘటన ఆధారంగా ఈ సినిమా తీస్తున్నారు నోలన్. డంకర్క్ అనేది ఫ్రాన్స్ రేవు పట్టణం. 1940లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు హిట్లర్ నాయకత్వంలోని శత్రువుల ధాటిని తట్టుకోలేక డంకర్క్ తీరప్రాంతాల నుంచి సుమారు 3 లక్షల 30 వేల సంకీర్ణదళ సైనికులు ఖాళీ చేసి వెళ్లవలసి వచ్చింది. ఆ బ్రిటిష్ మహా ఓటమినే నోలన్.. డంకర్క్‌కు కథగా ఎన్నుకున్నారు. ‘వియ్ సరౌండ్ యు’ అని ప్రింట్ అయి ఉన్న పాంప్లెట్స్ గాలిలోంచి ఎగిరి వచ్చి, డంకర్క్‌లో మోహరించిన బ్రిటిష్ సైనికుల తలల మీద పడుతుండగా ట్రైలర్ మొదలవుతుంది. అప్పటికే ఎటాక్ మొదలై ఉంటుంది. డంకర్క్ ఒడ్డు నుంచి శవాలు కొట్టుకొస్తుంటాయి. ఇక అక్కడి నుంచి మిత్రరాజ్యాలకు, శత్రుదేశాలకు మధ్య జరిగే పోరాట సన్నివేశాలు, మధ్య మధ్య దళపతుల వ్యూహాత్మ ఎత్తుగడలను ట్రైలర్‌లో చూడొచ్చు.
హసీనో కా దీవానా : వీడియో సాంగ్
నిడివి : 2 ని. 23 సె. :: హిట్స్ : 1,89,93,433
జనవరి 25న విడుదలకు సిద్ధం అవుతున్న బాలీవుడ్ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘కాబిల్’ (కేపబుల్ అని అర్థం) రెండో పాట ‘హసీనో కా దీవానా’ వీడియో ఈ వారం విడుదలైంది. హృతిక్‌రోషన్, ఊర్వశీ రాటెల ను మీరు ఈ పాటలో చూడొచ్చు. ఇద్దరూ కలసి పాడరు కానీ, ఊర్వశి పాడుతుండగా హృతిక్ వచ్చి ఆ నైట్ క్లబ్‌ను పేల్చేస్తాడు. మొత్తం పాటంతా ఊర్వశిదే. అందరిలా నవ్వు, సంతోషం, ప్రేమ నిండిన హృతిక్ జీవితం ఊహించని మలుపు తిరిగి పగ పెంచుకుంటాడు. ప్రతీకారం తీర్చుకుంటూ ఉంటాడు. తను పుట్టి గుడ్డివాడినని తెలిసి కూడా తను ఏర్పరచుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడానికి తెగిస్తాడు. ఈ కథంతా వీడియోలో ఉండదు కానీ, వీడియో స్టార్టింగ్‌లో హృతిక్ తన విరోధికి వార్నింగ్ ఇవ్వడం కనిపిస్తుంది. అక్కడి నుంచి కథ కొంత అర్థం అవుతుంది. ఐటమ్ గర్ల్ పాట పాడుతుండగా హీరో అక్కడికి రహస్యంగా చేరుకుని విలన్‌లను మట్టుపెట్టే సన్నివేశం చాలా సినిమాల్లో ఉండేదే. కానీ ఇందులో కాస్త డిఫరెంట్‌గా ఉంది. డైరెక్షన్ సంయజ్ గుప్తా. హీరోయిన్ యామీ గౌతమ్.
సెల్ఫ్ డ్రైవింగ్ ఉబర్ రన్నింగ్ రెడ్ లైట్
నిడివి : 30 సె. :: హిట్స్ : 10,63,009
డ్రైవర్ ఉండని వాహనాలు ఎంతవరకు సురక్షితం? ఎంతవరకు అవి సురక్షితమో కచ్చితంగా చెప్పలేం అని తాజాగా జరిగిన ఒక ‘టెస్ట్ డ్రైవ్’ రుజువు చేసింది. ఉబర్ కంపెనీ తన ‘సెల్ఫ్ డ్రైవింగ్’ కారును ప్రయోగా త్మకంగా శాన్ ఫ్రాన్సిస్కోలోని ఒక రోడ్డు మీదకు వదిలినప్పుడు ఈ విషయం స్పష్టమయింది. ఈ వీడియోలో చూస్తే మీకు ఇంకా క్లియర్‌గా అర్థమౌ తుంది. ముందు ఉబర్ కారు వెళుతోంది. వెనుక డ్యాష్ క్యామ్ (డ్యాష్ బోర్డ్ కెమెరా) ఉన్న కారు ఫాలో అవు తోంది. ఉబర్ కదలికల్ని రికార్డ్ చేస్తోంది. ఉబర్‌లో డ్రైవర్ లేడు. ఆటోమేటిక్ డ్రైవింగ్. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. జీబ్రా లైన్‌కు ఇవతలే వాహనాలన్నీ ఆగిపోవాలి. ఆగిపోయాయి. డ్యాష్ క్యామ్ ఉన్న కారు కూడా ఆగింది. కానీ ఉబర్.. రెడ్ లైట్‌ను ఫాలో కాకుండా ముందుకు వెళ్లిపోయింది. ఈ దృశ్యం మన రజనీ సినిమా ‘రోబో’ లోని ఓ సన్నివేశాన్ని గుర్తు తెచ్చేలా ఉంది! ఇక్కడ ఉబర్ కూడా కనీసం తనలో ఫీడ్ చేసిన సూచనలను కూడా ఫాలో కాలేకపోయింది. ‘అయితే ఇది మానవ తప్పిదం మాత్రమేనని, టెస్ట్ సెల్ఫ్–డ్రైవ్ కోసం కారు లోపల కూర్చున్న డ్రైవర్ సరైన ఇన్ఫర్మేషన్‌ని ఫీడ్ చెయ్యకపోవడంతో అలా జరిగిందని ఉబర్ ఒక ప్రకటన విడుదల చేసింది.
లేడీ గాగా : మిలియన్ రీజన్స్
నిడివి : 4 ని. 12 సె. :: హిట్స్ : 66,90,412
యాంబియన్ట్ మ్యూజిక్ అనే మాట వినే ఉంటారు. ట్యూన్ ఉండదు. బీట్ ఉండదు. మనసును నెమ్మదిపరుస్తుంది. ఒక మూడ్‌లోకి తీసుకెళుతుంది. లేడీ గాగా లేటెస్ట్ ఆల్బమ్‌లోని సాంగ్.. ‘మిలియన్ రీజన్స్’ ఓ యాంబియన్ట్ మ్యూజిక్ వీడియో. గాగా తెలుసు కదా! అమెరికన్ పాప్ సింగర్. ‘బ్యాడ్ రొమాన్స్’, ‘పర్ఫెక్ట్ ఇల్యూజన్స్’ వంటి పాప్ గీత గుచ్ఛాలతో యువహృదయాలను సేదతీర్చిన గాగా ఇప్పుడు ‘మిలియన్ రీజన్స్’తో మన ముందుకు వచ్చారు. ఓ ఎడారి. పైన సూర్యుడు. గాగా ఆ ఎండలో నేలపై వెల్లకిలా పడుకుని, తల పట్టుకుని ఉన్నప్పుడు, పక్కనే హై వే మీదుగా వెహికిల్స్ వస్తూ ఉండడంతో వీడియో స్టార్ట్ అవుతుంది. నెక్ట్స్ సీన్‌లో పియానోతో పాట మెల్లగా ముందుకు సాగుతుంది. ‘నిన్ను వెళ్లనివ్వడానికి నువ్వు నాకు పదిలక్షల కారణాలు చూపుతున్నావు’ అని బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ‘వెళ్లిపోవడానికి నాక్కూడా కోటి కారణాలు ఉన్నాయి’ అని గాగా గాత్రం మంద్రస్థాయిలో ప్రతిధ్వనిస్తుంది! గాగా ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘జోయాన్’లోని ఈ మిలియన్ రీజన్స్ సాంగ్‌ను వినేందుకు, చూసేందుకు ఒక్క రీజన్ చాలు. లవ్! విడిపోయి, మళ్లీ కలుసుకోవాలని తపించే అమ్మాయిలు, అబ్బాయిలకు ఈ పాట తప్పక నచ్చుతుంది.