నగరంలో నిర్వహిస్తున్న ఫ్యాషన్ షోలలో తారల తళుకులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు ర్యాంప్‌పై కొలువుదీరే మోడల్స్ మధ్యలో ఒకరిద్దరే స్టార్స్ కనిపించేవారు. అయితే ఆ దశ నుంచి తారల సంఖ్య
పెరుగుతూ వస్తోంది. తాజాగా ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ‘టీచ్ ఫర్ ఛేంజ్’ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్యాషన్ షో పూర్తిగా స్టార్స్‌కే పరిమితమైంది. దీంతో సిటీలో సరికొత్త ట్రెండ్‌కి నాంది పలికినట్టయింది.
సాక్షి, సిటీబ్యూరో : సిటీలో ఫ్యాషన్ రంగం ఊపందుకుంటున్నా, దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన డిజైనర్లు తమ బొటిక్‌లను ఇక్కడ నెలకొల్పుతున్నా... ముంబైతో పోలిస్తే ఇక్కడి ఫ్యాషన్ ఈవెంట్లలో సినీతారల సందడి బాగా తక్కువేనని చెప్పాలి. కారణమేదైనా... ఎక్కువగా సినిమారంగ ప్రముఖులు ర్యాంప్ మీద కనపడకపోవడం సిటీలోని ఫ్యాషన్ ఈవెంట్ల రేంజ్‌ని తగ్గిస్తోందని గత కొంత కాలంగా నగరానికి చెందిన ఫ్యాషన్ రంగ ప్రముఖులు అంటున్నారు. అయితే ఇటీవల పరిశీలిస్తుంటే నిదానంగానే అయినా... ర్యాంప్ షోలలో స్టార్స్ సందడి పెరగడం కనిపిస్తోంది.
న్యూ ‘ఛేంజ్’..
ఈ క్రమంలోనే మోడల్స్ లేకుండా పూర్తిగా స్టార్స్‌తో ఒక షోని నిర్వహించి ‘టీచ్ ఫర్ ఛేంజ్’ సంస్థ కొత్త ట్రెండ్‌కి శ్రీకారం చుట్టింది. తమ ఎన్‌జీఓకి నిధుల సేకరణ నిమిత్తం ఈ సంస్థ నిర్వహించిన షోలో నగరానికి చెందిన డిజైనర్ రాజ్యలక్ష్మి గుబ్బా డిజైన్ చేసిన బెనారస్ చీరల్ని ధరించి రకుల్, రెజీనా తదితర తారలు... మరో డిజైనర్ వరుణ్ చకిలం సృష్టించిన మెన్స్‌వేర్‌తో విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు ఫలక్‌నుమా ప్యాలెస్‌లోని డైనింగ్ టేబుల్ లాంజ్‌ని తమదైన శైలిలో మెరిపించారు. సిటీలో మంచి టాక్ తెచ్చుకున్న ఈ ఈవెంట్ మరింత మంది స్టార్స్‌ని ఫ్యాషన్ ఈవెంట్ల వైపు మళ్లించడం తథ్యంగా కనిపిస్తున్న నేపథ్యంలో.. సిటీ ర్యాంప్‌పై మెరిసే తారల సంఖ్య భవిష్యత్తులో విజృంభించడం ఖాయం.
స్టార్+డిజైనర్=గ్లామర్
ఒక తారను త‘లుక్’మనిపించాలన్నా, కొంతకాలం పాటు యూత్‌ని సినీ స్టైల్‌తో ఉర్రూతలూగించాలన్నా డిజైనర్‌దే ప్రధాన పాత్ర. గ్లామర్ రంగానికి ఫ్యాషన్‌తో విడదీయలేని సంబంధం ఉంటుంది. నగరం వేదికగా ప్రస్తుతం ఫ్యాషన్ రంగంలో తమదైన ముద్ర వేద్దామని ప్రయత్నిస్తున్న డిజైనర్లతో పాటు ఎందరో ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ అంతిమ లక్ష్యం సినిమా రంగమే అయి ఉంటుంది. మరోవైపు ఔత్సాహిక డిజైనింగ్ నిపుణులకు ఊపునిచ్చేది, వారి వర్క్‌ను ప్రపంచానికి పరిచయం చేయడంలో ప్రధాన పాత్ర పోషించేవీ ర్యాంప్ షోలే. అలాంటి షోలకు టాలీవుడ్ ప్రముఖుల హాజరు ఒక తప్పనిసరి అవసరం అనడం నిస్సందేహం.
ట్రెండీ.. బ్యూటీ
ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన ఈ షో స్టార్స్‌తో కళకళలాడింది. ఇందులో మంచులక్ష్మి, రకుల్‌ప్రీత్ సింగ్, విజయ్ దేవరకొండ, హర్షవర్ధన్ రానే, ప్రగ్యా జైస్వాల్, రెజీనా కసాండ్రా, కృతి కర్బందా, సీరత్ కపూర్, అల్లు శిరీష్, సుర్భి పురాణిక్, హెబ్బా పటేల్, నిఖిల్ సిద్ధార్థ్, సంయుక్త హర్నాడ్, ఈషా రెబ్బా, శుభ్ర అయ్యప్ప, అనీషా ఆంబ్రోస్, మధుశాలిని, తేజస్వి మడివాడ, శివానీ రాజశేఖర్, నవదీప్, అడవి శేషు, సుశాంత్ అక్కినేని, నవీన్ చంద్ర, అదిత్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రిన్స్, ప్రియదర్శి, సిద్ధు జొన్నల గడ్డ, సంధ్యారాజు తదితర తారలు పాల్గొన్నారు. ఫలక్‌నుమా ప్యాలెస్‌లో 101 డైనింగ్ ఏరియాలో ఈ షో నిర్వహించడం మరో విశేషం. కేవలం తమ సంస్థకే ఈ ప్లేస్‌ని ప్రత్యేకంగా ఇస్తారని సంస్థ ప్రతినిధి చైతన్య చెప్పారు. ఎలాంటి ప్రత్యేకమైన ర్యాంప్ నిర్మించకుండా, కార్పెట్ మీదనే అతిథుల సమక్షంలో స్టార్స్ ఈ ఈవెంట్‌లో వాక్ చేశారు. ఎంపీ జయాబచ్చన్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి, బాలీవుడ్ తార అదితిరావ్ హైదరిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
యువోత్సాహం...
టాలీవుడ్‌లో సరికొత్త తరం, యువ రక్తం పరవళ్లు తొక్కుతున్న ఫలితం ఫ్యాషన్ రంగంలో కూడా కనిపిస్తోంది. చిరంజీవి తరం తారలతో పోలిస్తే... ప్రస్తుత జనరేషన్ డిజైనర్లకు బాగా ప్రాధాన్యతనిస్తోంది. దీంతో ర్యాంప్‌పై తారల సందడి బాగా పెరిగింది. నగరంలో జరుగుతున్న ఈవెంట్లలో షో స్టాపర్స్‌గా కనిపించేందుకు వీరు బాగా ఉత్సాహం చూపిస్తున్నారు. నవదీప్, మంచులక్ష్మి, సమంత, రానా తదితరులు తరచూ ఫ్యాషన్ ఈవెంట్లలో మెరుస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకుంటున్న నాని, రకుల్‌ప్రీత్ సింగ్, రెజీనా, సాయిధరమ్ తేజ్, విజయ్ దేవరకొండ లాంటి రైజింగ్ స్టార్స్ సైతం డిజైనర్స్‌తో చేతులు కలపడంతో ఈవెంట్లకు నిండుదనం చేకూరుతోంది. ముఖ్యంగా ఎన్‌జీఓ అనుబంధ కార్యక్రమాలపై వీరు ఆసక్తి చూపుతున్నారు.
పరిస్థితి మారింది...
ఒకప్పుడు.. అంటే పదేళ్ల క్రితం ఒక సెలబ్రిటీని ఈవెంట్లకు ఒప్పించాలంటే సులభమైన విషయం కాదు. అయితే ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. తారలు స్వచ్ఛందంగా పాల్గొనడానికి ముందుకు వస్తున్నారు. మా ఎన్‌జీఓ ఇప్పటికే సేవా పరంగా మంచి అభివృద్ధి సాధించిన క్రమంలో... ఇలాంటి షోలలో పాల్గొనడానికి మాత్రమే కాదు మరిన్ని కార్యక్రమాలకూ స్టార్స్ మాకు సహకారం అందిస్తున్నారు.– చైతన్య, టీచ్ ఫర్ ఛేంజ్
Comments
Please login to add a commentAdd a comment