ఒక అనానంద కథ | A story of ananandha seventh nizam rule | Sakshi
Sakshi News home page

ఒక అనానంద కథ

Published Tue, Dec 30 2014 12:23 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

ఒక అనానంద కథ - Sakshi

ఒక అనానంద కథ

ఎవరి జీవితమూ ఎవరి చేతుల్లో ఉండదు. రాజ్యం ఎలా ఉంటుంది? అని తెలిసినా..  అలా జరిగి ఉంటే, ఇలా జరిగి ఉంటే.. అనుకోకుండా ఉండలేం కదా! ఇంగ్లిష్ వారి వీర విధేయుడు ఏడో నిజాం, భారత ప్రభుత్వంతో విలీనం కాను అని బీరాలు పోకపోతే, రజాకార్లను ప్రోత్సహించకపోతే, ఉపఖండం చరిత్ర మరో రకంగా ఉండేది. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ 1911లో 43వ ఏట చిన్నవయసులో మరణించి ఉండకపోతే..?  మీర్ ఉస్మాన్ అలీఖాన్ గద్దెనెక్కేవాడు కాదు. మీర్ అహ్మద్ మొహియుద్దీన్ ఏడో నిజాం అయ్యేవాడు. ఆ పరిస్థితుల్లోకి తొంగి చూద్దాం!
 
 ఇంటిలోని పోరు ఇంతింత కాదయా!
 ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ ఇష్టసఖి ఉజ్జల్ బేగం. ఆమె సంతానంలో తొలి ఎనిమిది మంది పురిట్లోనే చనిపోయారు. ఆరో నిజాం భార్యలలో మరొకరు మొదటి సాలార్‌జంగ్ మీర్ తురబ్ అలీ ఖాన్ మనుమరాలు జహిరా బేగం. ఆరో నిజాం ఆమెను రాణివాసానికి తెచ్చేసరికే గర్భవతని విస్తృతంగా చెప్పుకునేవారు. ఆమెకు 1886లో మీర్ ఉస్మాన్ అలీఖాన్ జన్మించారు. ఆరో నిజాం ఇష్టసఖి ఉజ్జల బేగం 1907లో మొహియుద్దీన్‌కు జన్మనిచ్చారు. తన కుమారుడిని ఏడో నిజాంగా ప్రకటించాల్సిందిగా ఉజాలా బేగం భర్తను డిమాండ్ చే సేది.
 
  ‘అలాగే, మొహియుద్దీనే నా వారసుడు తొందరెందుకు’ అని ఆయన సముదాయించేవాడు. ఒక రోజు వారసత్వ ప్రకటన చేయవలసినదిగా ఉజ్జల బేగం భర్తను ఆరడిపెట్టింది. కైకను గుర్తు చేస్తూ ‘ఆజీచ్, అభీచ్’ (ఈరోజే, ఇప్పుడే) అన్నది! మెహబూబ్ అలీఖాన్ కోపావేశంతో విసురుగా పురానాహవేలీ నుంచి బయటకు వచ్చాడు. కారు యాక్సిలేటర్ మట్టానికి తొక్కి  ఫలక్‌నుమా చేరాడు. చిత్తుచిత్తుగా తాగాడు. మూడు రోజులు, వరుసగా! సోయి తప్పిన మహబూబ్ అలీఖాన్ కోమాలోకి వెళ్లాడు.  1911 ఆగస్ట్ 29 మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగిరానిలోకాలకు చేరాడు.
 
 ‘రాయల్’ పాలన!
 మహబూబ్ అలీఖాన్ తన బాధను ప్రజల బాధ చేయలేదు. ప్రజల సౌఖ్యాన్ని తన సౌఖ్యంగా భావించాడు. తెల్లవారుజామున మారువేషంలో సామాన్యులతో మిళితయమ్యేవాడు. ఇరానీచాయ్ తాగుతూ ముచ్చట్లు పెట్టి పాలనపై ఫస్ట్‌హ్యాండ్ రిపోర్ట్ తీసుకునేవాడు. దేశంలో తొలిసారిగా ఎడ్వర్డ్ లారీ తదితరులతో హైదరాబాద్ క్లోరోఫాం కమిషన్ ఏర్పాటు చేశాడు. 1908 సెప్టెంబర్ 28న మూసీ వరదలు సందర్భంగా రాజప్రాసాదాలన్నిటినీ వరదబాధితుల శిబిరాలుగా మార్చాడు. గంగమ్మకు మొక్కాడు. ఇప్పటికీ తన హోదాను కోల్పోని నిజాం క్లబ్‌ను స్థాపించాడు. తన 40వ పుట్టినరోజు సందర్భంగా టౌన్‌హాల్ (ప్రస్తుత శాసన సభ)కు శంకుస్థాపన చేశాడు. అతని హయాంలోనే హైదరాబాద్ స్టేట్ రైల్వే, విద్యుత్,పోస్టల్, టెలిఫోన్, టెలిగ్రాఫ్ సదుపాయాలు ఏర్పడ్డాయి. సైన్యాన్ని బలోపేతం చేశాడు. చార్మినార్ ముద్రతో నాణేలు వచ్చాయి. ఆలియా, మహబూబియా కళాశాలలు, అనేక బాల-బాలికల విద్యాసంస్థలూ వచ్చాయి. మహబూబ్ అలీ ఖాన్ కెమెరా ప్రేమికుడు. రాయల్ సొసైటీ ఆశ్చర్యపోయే రీతిలో ఫొటోగ్రఫీ ప్రపంచంలో హైదరాబాద్‌ను నిలిపాడు. అతడు లేని శూన్యంలో వారసత్వ గొడవలొచ్చాయి.
 
 వారసత్వ విభేదాలు  ?
 ఆరో నిజాం జీవించి ఉంటే నిస్సంశయంగా మీర్ అహ్మద్ మొహియుద్దీన్  ఏడో నిజాం అయ్యేవాడు. ఆయన పోవడంతో తర్వాత రాజు ఎవరు కావాలి ? రాజవంశీకుల్లో భిన్నాభిప్రాయాలు! ఉజ్జల బేగం నాలుగేళ్ల కుమారుడు మొహియుద్దీనా? జహిరా బేగం కుమారుడు 25 ఏళ్ల మీర్ ఉస్మాన్ అలీఖానా?  మొహియుద్దీన్‌కే గద్దె దక్కాలని చాలా మంది భావించారు.  వైస్రాయికి విన్నపాలు పంపారు. అర్జీలో మహరాజా కిషన్ ప్రసాద్ సంతకం ఫోర్జరీ చేశారు. వైస్రాయిని ‘కన్విన్స్’ చేసిన ఉస్మాన్ అలీఖాన్ ఏడో నిజాం అయ్యాడు. తనకు వ్యతిరేకంగా అర్జీపెట్టిన ‘కుట్ర’దారుల్లో  ఆరో నిజాం స్నేహితుడు, ప్రధానమంత్రి కిషన్‌ప్రసాద్ ఉన్నారని భావించి ఆయనను పదవి నుంచి తొలగించారు. ‘మహారాజా’ కిషన్‌ప్రసాద్ ప్రభువు ఎవరైతే వారి కుడిభుజంగా వ్యవహరించే నిబద్ధుడని, దోషరహితుడని పాతికేళ్ల తర్వాత నిర్థారించుకుని మీర్ ఉస్మాన్ ఖాన్ కిషన్ ప్రసాద్‌ను ప్రధానిగా ఆహ్వానించారు.
 
 రాకుమారుడి పట్ల నిజాం ప్రవర్తన!
 ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నివాసం కింగ్‌కోఠి. తన సవతి తల్లి ఉజ్జలబేగంను ఆమె నాలుగేళ్ల కుమారుడు మొహియుద్దీన్‌ను, ఆయన చెల్లెలు అహ్మదున్నీసాలను కింగ్‌కోఠి ప్రాంగణంలోని భవంతిలో నివసించాలని కోరాడు. ఆ కుటుంబంపై ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచేవాడు. మొహియుద్దీన్‌కు ‘సలబత్ జా’ బిరుదును ఖారారు చేసి రాకుమారుని హోదా ఇచ్చారు. చదువుకునేందుకు ఏర్పాట్లు చేశాడు. సందర్శకులపై నిఘా ఉండేది. ఉత్తరాలు సెన్సార్ అయ్యేవి. సలబత్ జా యువకుడయ్యాడు. తండ్రి లక్షణాలను పుణికి పుచ్చుకున్నాడు. కవి, ప్రేమికుడు. తనకంటే పదకొండేళ్లు చిన్నదైన లయెలా విలింకర్ అనే బెంగాలీ యువతిని ప్రేమించాడు. పెండ్లాడాలనుకున్నాడు. నిజాం పొసగనివ్వలేదు.
 
 అలగడం తప్ప మరేమీ చేయగలడు? యూరప్ వెళ్లాడు. మూడో సాలార్‌జంగ్ (మ్యూజియం రూపకర్త) ఆమెను ప్రేమించాడు. పెళ్లాడతానంటున్నాడు. ఆ సంగతే లయెలా విలింకర్  ఉత్తరం రాసింది. సలబత్ జా మర్యాదస్తుడు. ‘బాధ పడకు నేను వివాహానికి కవితను కానుకగా పంపుతాన’ని బదులిచ్చాడు. మూడో సాలార్‌జంగ్ అవివాహితుడుగానే మరణించాడు. అంతర్ముఖుడైన సలబత్ జాకు మొగల్ కుటుంబానికి చెందిన అగా హసన్ హైదర్ మీర్జాతో స్నేహం ఏర్పడింది. ఉస్మాన్ అలీ ఈ స్నేహాన్నీ హర్షించ లేదు. ఇరువురూ ఉత్తరాల్లో హృదయాన్ని విప్పుకునేవారు. చిన్నవయసులోనే అజ్ఞాత కారణాలతో సలబత్ జా మరణించాడు. మీర్జా మరణం తర్వాత, అతని కుమార్తె మెహరున్నీసా హుసేన్ 76 ఉత్తరాలను సంకలనంగా (THE UNHAPPY PRINCE Nashad Asifi Selected Letters Of Prince Salabat Jah Of Hyderabad To Aga Hyder Hasan Mirza) ప్రచురించింది.

ఈ ఉత్తరాలు సలబత్ జా స్వభావచిత్రణ చేస్తాయి. ఆయన వినయశీలి. కవి, గాయకుడు. ‘మధు’పాయి! ఆనందం లేని తన జీవితాన్ని సంకేతిస్తూ ‘న-షాద్ అసిఫీ’ (అనానంద అసఫ్‌జా) అనే కలం పేరుతో కవిత్వం రాశాడు. తండ్రిని కోల్పోయిన  సలబత్ జా ఒక్కడేనా అనానందుడు? కాదు, హైదరాబాద్ స్టేట్‌పైనే కాదు ఉపఖండంపై, నా వంటి అసంఖ్యాకులపై ఆ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో సాయుధ పోరాటం ఉద్భవించింది. రావి నారాయణరెడ్డి, మగ్దుం మొహియుద్దీన్, రాజ్ బహదూర్ గౌడ్ వంటి అరుణతారలను ‘అనానంద హైదరాబాద్’  కన్నది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement