డిప్రెషనే కారణమా?
తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త ఏడాది ఆరంభంలోనే విషాదం అలముకుంది. గతేడాది పలువురు సీనియర్ నటులను పోగొట్టుకున్న టాలీవుడ్కు 2014 ఆరంభంలోనే విషాదం ఎదురయింది. యువ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్న వార్తతో తెలుగు చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలదొక్కున్న అతడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలియగానే అభిమానులు, సినీ, రాజకీయ ప్రముఖులు దిగ్భాంతి చెందారు. ఎన్నో ఎదురుదెబ్బలు తట్టుకున్న ఈ యువ నటుడు ఆకస్మింగా వెళ్లి పోవడం వెనుక బలమైన కారణాలున్నాయని అనుమానిస్తున్నారు.
'చిత్రం' సినిమాతో తెరం గ్రేటం చేసిన ఉదయ్ కిరణ్ అనతికాలంలోనే పెద్ద హీరోగా ఎదిగాడు. ఎవరి అండ లేనప్పటికీ వరుస హిట్ సినిమాలతో అగ్రతారగా వెలుగొందాడు. లవర్ బాయ్ పాత్రల్లో నటించి మెప్పించాడు. చిత్రం తర్వాత నువ్వునేను, మనసంతా నువ్వే సినిమాలతో అందరి మన్నలను అందుకున్నాడు. తారా పథంలో అయితే ఎంత త్వరగా ఎదిగాడో అంతే త్వరగా పడిపోయాడు. అయితే చిత్ర పరిశ్రమలో కొందరు అతడిని తొక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులు, సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఉదయ్ కిరణ్ బలవన్మరణానికి పాల్పడినట్టు చెబుతున్నారు. ఉదయ్ కిరణ్ పదేళ్ల వయసులోనే అతడి అన్న ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దికాలం క్రితం అతడి తల్లి మరణించారు. దీంతో అతడి తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాలంగా సినిమాలు లేకపోవడంతో ఉదయ్ కిరణ్ డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈమధ్య వచ్చిన ఓ తమిళ సినిమా కూడా చేజారిపోవడంతో, ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోవడంతో వేరే దారిలేక ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది.
ఒకప్పుడు నెత్తిన పెట్టుకున్న చిత్ర పరిశ్రమ తనను దూరం పెట్టడం అతడు జీర్ణించుకోలేకయాడు. వ్యక్తిగతంగా, కెరీర్ పరంగా తనకు హానీ చేయాలని చూసిన వారి పేర్లను అతడు ఏనాడు వెల్లడించలేదు. సున్నిత మనస్కుడిగా, నిగర్విగా పేరొందిన ఉదయ్ కిరణ్ ఎప్పుడు ఎవరిపై ఫిర్యాదు చేసిన దాఖలు లేవు. తన పనేదో తాను చూసుకుని వెళ్లిపోయే వాడు. అందరితో స్నేహంగా మెలిగే ఉదయ్ కిరణ్ ఇక లేడన్న నిజాన్ని అతడి సన్నిహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ మంచి నటున్ని కోల్పోయిందని నివాళులు అర్పిస్తున్నారు. అయితే సినిమా ఫీల్డ్లో ఒడిదుడుకులు సహజమని, ధైర్యం కోల్పోవద్దని యువ నటులకు సీనియర్లు సూచిస్తున్నారు.