ఉల్లి కోత, నిల్వ: ఉల్లి పంట ఆకులు 50% పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వచేయడంలో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.
ఉల్లి కోత, నిల్వ: ఉల్లి పంట ఆకులు 50% పొలంలో రాలిన తర్వాత గడ్డలు తవ్వితే నిల్వచేయడంలో జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు. ఉల్లి గడ్డ పీకడానికి ముందు నీటి తడిని ఆపివేయాలి. గడ్డలు పీకిన తర్వాత వీటిని పొలంలోనే ఒక వరుసలో ఉంచి 3 నుంచి 4 రోజులు ఆరబెట్టుకోవాలి. గడ్డకు 2.5 సెం.మీ. కాడను ఉంచి కోసుకోవాలి. ఉల్లి గడ్డలను నిల్వ ఉంచే ముందు 10-12 రోజులు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత నిల్వ చేసుకోవాలి.
సుమారు 4 నుంచి 6 సెం. మీ. పరిమాణం కలిగిన మధ్యస్థమైన పాయలను మాత్రమే నిల్వవుంచి, మిగిలిన పాయలను మార్కెటింగ్ చేసుకోవడం మంచిది. వేరుశనగ: వేసవిలో పండిన వేరుశనగలు విత్తనానికి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి, కోత సమయంలో జాగ్రత్త పాటించాలి. 70-80 శాతం మొక్కల ఆకులు, కొమ్మలు పసుపు రంగుకు మారినప్పుడు మాత్రమే కోయాలి. కోత సమయంలో నేలలో తగినంత తేమ ఉండాలి. విత్తనం కోసం వాడే కాయలను నీడలో ఆరబెట్టి గోనె సంచుల్లో నిల్వ ఉంచుకోవాలి. 2-3 వారాలకోసారి మలాథియాన్ మందును సంచులపై పిచికారీ చేసుకోవాలి.
అరటి: వేసవి తీవ్రత అరటి మెక్కలు, కాండం, గెలపైన ప్రభావం చూపుతుంది.
దగ్గర దగ్గరగా నీటి తడులను పెట్టుకోవడం లేదా డ్రిప్ పద్ధతి ద్వారా ప్రతి రోజూ నీటిని అందించాలి. తొండంతో సహా గెల మొత్తానికి ఎండు ఆకులను గెలకు పూర్తిగా చుట్టి ఎండ నుంచి రక్షణ కల్పించాలి. ఎండలు తగ్గిన తర్వాత లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్‌లను మార్చి మార్చి జిగురుతో కలిపి వారం వ్యవధిలో 4సార్లు ఆకులు, గెలలు పూర్తిగా తడిసేలా పిచికారీ చేసి వేసవి వల్ల జరిగే నష్టాన్ని తగ్గించుకోవచ్చు.
- డా. దండ రాజిరెడ్డి, విస్తరణ సంచాలకులు,
ఆచార్య ఎన్. జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్