మానవతా శిఖరంపై మెరిసిన మణిదీపం | Ambedkar is a great humanist | Sakshi
Sakshi News home page

మానవతా శిఖరంపై మెరిసిన మణిదీపం

Published Tue, Apr 14 2015 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

మల్లెల వెంకట్రావు

మల్లెల వెంకట్రావు

 సందర్భం

 జాతిజనుల కష్టాలను, అవమానాలను, బాధ్యత లను జీవితాంతం తన శిర స్సున మోసిన ధన్యజీవి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్. తన యవ్వనాన్ని, ఆత్మశక్తి ని, శారీరక బలాన్ని ఫణం గా పెట్టి అంటరాని జాతి విముక్తి కోసం మంచి, చెడు, పొగడ్తలు, శాపనార్థాలు, గౌరవ, అగౌరవా లకు అతీతంగా ఆత్మగౌరవ కేతనమై, రణన్నినాద మైన ధీరోదాత్తుడాయన. న్యాయశాస్త్ర కోవిదుడు, రాజ్యాంగ నిపుణుడు, జ్ఞాన పిపాసి, విద్యాధికుడు, గొప్ప పండితుడు, ప్రపంచం గర్వించదగ్గ సామాజి కవేత్త, స్త్రీ పక్షపాతి, నిష్కలంక దేశభక్తుడు, పోరా టాలు, త్యాగాలతో నిండిన నిప్పుకణికల కొలిమి గుండా ప్రయాణించి మానవత్వపు మహోన్నత శిఖ రాలను చేరుకున్న తాత్వికుడు అంబేడ్కర్.
 ఆధునిక భారతీయ సంఘ సంస్కర్తలలో మొదటి వరుసలో నిలిచిన అంబేడ్కర్ సమాజంలో సగభాగమైన స్త్రీల సమస్యలను ప్రధానంగా తీసు కుని ఉద్యమించాడు. స్త్రీలను అణిచివేయడానికి హిం దూ పితృస్వామ్యవ్యవస్థ అమలుచేసిన సతీసహగమనం, తప్పనిసరి వైధవ్యం, వితంతువులకు నిర్బంధ బ్రహ్మచర్యం, కుటుంబంలోని పురుషుల లైంగిక దాడు లు భరిస్తూ జీవించవలసిరావడం.. ఇలా స్త్రీల పట్ల హిందూ సమాజం ఏర్పర్చిన నియమాలన్నీ పూర్తిగా పక్షపాతమైన వని అంబేడ్కర్ ఆవేదన చెందాడు. భారతీయ స్త్రీల దాస్య శృంఖలాలను తెంచడానికి, వారికి గౌరవ స్థానం లభించేందుకు న్యాయశాఖ మంత్రిగా 1947 ఏప్రిల్ 11వ తేదీన పార్లమెంటులో హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెట్టాడు. 1947 సెప్టెంబర్ 17న చర్చకు వచ్చినప్పుడు డాక్టర్ ముఖర్జీ అంబేడ్కర్‌ని తీవ్రంగా ఎద్దేవా చేయడమే కాకుండా, అద్భుతమైన హిందూ సాంస్కృతిక కట్టడాన్ని హిందూకోడ్ బిల్లు ధ్వసం చేస్తుందని ఆగ్రహించాడు. ఈ బిల్లు ఆమోదం పొం దకుండా ఉండేందుకు రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, నాటి ఉపప్రధాని వల్లభ్ భాయ్‌పటేల్ ఎన్నో ఆటంకాలు కల్పించారు. హిందూ ఉమ్మడి కుటుంబానికి చెందిన ఆస్తిపాస్తులన్నిం టికీ పురుషులతో పాటు స్త్రీలకు కూడా సమాన హక్కునివ్వడం బిల్లు లక్ష్యం. ఈ బిల్లు ఆమోదం పొందకపోతే రాజీనా మా చేస్తానన్న తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మౌన ముని అయ్యాడు. స్త్రీల స్వేచ్ఛ, సమానత్వం, విముక్తి కోసం నిరంతరం తపనపడిన మానవతామూర్తి అం బేడ్కర్ అవమానభారంతో న్యాయశాఖా మంత్రి పదవికి రాజీనామా చేశాడు.

 రాజ్యాంగ రచనకు పూర్తి పేరు తనకు దఖలు పడినప్పటికీ తన సహచరులను అంబేడ్కర్ విస్మ రించలేదు. అదే సమయంలో ‘నా అభీష్టానికి వ్యతి రేకంగా నేను గాడిద చాకిరీ చేశాను. నా మిత్రులు ఈ రాజ్యాంగాన్ని నేను రచించానని చెబుతున్నారు. కానీ, ఈ రాజ్యాంగాన్ని తగులబెట్టేవాళ్లలో నేను మొదటివాడిని. ఈ రాజ్యాంగం నా శరీరానికి సరి పోని దుస్తులాంటిది’ అని ప్రకటించాడు.

 జస్టిస్ చిన్నపరెడ్డి మాటల్లో ఆయన గురించి విందాం. ‘కానీ ఆయన ఒక పాపం చేశాడు. పుట్టుక తోటే ఆ పాపం చేశాడు. కులంపై నిర్మితమైన సమాజంలో నిమ్న కుటుంబంలో పుట్టి, క్షమించ రాని పాపం చేశాడు. అందుకు శిక్షగా తన జీవితాన్ని సాగించాడు. ఉన్నత శిఖరాలను, అనంతమైన కీర్తిని సాధించేవాడే, కాని తన జీవితాన్ని ఫణంగా పెట్టి యోగిగా, తాత్వికుడిగా, రాజకీయవేత్తగా ఎదిగిపో యాడు. ఉన్న విధంగా ఉండడానికే ఇచ్చగించాడు. అంటే పుట్టుకతోటే అణచివేతకు గురై, అట్టడుగు వర్గాలవారి మనిషిగా, వారి వాంఛలకు ప్రతీకగా చివరిదాకా నిలబడ్డాడు. గొప్ప జాతీయవాది, ప్రజా స్వామ్యవాది. నిరంతరాయంగా, భయరహితంగా, పీడిత సోదరులు పక్షాన పోరాడటానికే జీవితాన్ని అంకితమొనర్చాడు. అంబేద్కర్‌ను అర్థం చేసుకున్న వారికంటే అపార్థం చేసుకున్నవారే ఎక్కువ. తన భావాల పట్ల గాఢ విశ్వాసమున్నవాడు కనుకనే ధర్మ యుద్ధంలో గాంధీకి సైతం ఎదురు నిల్చాడు. ఈ మాటల వెలుగులోనే అంబేద్కర్‌ను అధ్యయనం చేయాలి. అదే ఆయనకు నిజమైన నివాళి.

 (నేడు డా. బి.ఆర్ అంబేద్కర్ జయంతి)
 (వ్యాసకర్త, రాష్ట్ర అధ్యక్షులు, మాల మహాసభ, మొబైల్‌ః 9291365253)

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement