అది విభజన కమిటీయే! | Antony Committee for Division of the State | Sakshi
Sakshi News home page

అది విభజన కమిటీయే!

Published Wed, Aug 21 2013 2:57 PM | Last Updated on Fri, Sep 1 2017 9:59 PM

అది విభజన కమిటీయే!

అది విభజన కమిటీయే!

రాష్ట్ర విభజన సమయంలో తలెత్తే అంశాలను పరిశీలించి, వాటికి పరిష్కారం మార్గాలను సూచించడానికే ఆంటోని కమిటీ పనని తేలిపోయింది.  తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, యూపీఏ సమన్వయ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించటం తమ కమిటీ పరిశీలనాంశాల్లో లేదని ఆంటోని కమిటీ నిన్న స్సష్టం చేసింది. విభజన నిర్ణయం జరిగిపోయిందని, అభిప్రాయాలు తెలుసుకొని విధివిధానాలు రూపొందిచడమే తరువాయని అధిష్టానం నేతలందరూ ముక్తకంఠంతో చెబుతూనే ఉన్నారు. సాధ్యమైనంత తొందరలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తున్నారు. అయినా తమ ఆందోళనతో ఈ కమిటీ ఏర్పడిందని, అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం లభించిందని, సిడబ్ల్యూసి నిర్ణయం వెనుకకు తీసుకునే అవకాశం ఉందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు. కమిటీ తమ పరిధిని స్పష్టం చేయడతో అసలు విషయం అందరికీ అర్ధమైపోయింది.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తున్నట్లు యుపిఏ ప్రభుత్వం జూలై 31న కేంద్రం ప్రకటించింది. ఆ రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. విషయాన్ని ముందుగానే పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా రాజీనామలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రకటించిన తరువాత కాంగ్రెస్ పార్టీ ఏక పక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా, ఇరు ప్రాంతాలకు న్యాయం చేయాలని లేకుంటా అసలు విభజించవద్దని ఆ పార్టీ ఎంపిలు, ఎమ్మెల్యేలు అందరూ రాజీనామాలు చేశారు. మరో  పక్క ప్రజలే స్వచ్ఛందంగా ఉద్యమంలోకి ఉరికారు. బంద్లు, రాస్తారోకోలు మొదలుపెట్టారు. ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు వారికి అండగా నిలిచాయి. అప్పటి వరకు నోరుమెదకుండా ఉన్న కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులకు గొంతు విప్పక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.

ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురితో ఓ కమిటీని నియమించారు.  రక్షణమంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వంలో  ఈ కమిటీలో పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్‌సింగ్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రాన్ని విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకొన్న నిర్ణయంతో తలెత్తుతున్న సమస్యలపై అభిప్రాయాలను తెలుసుకొనేందుకే సోనియా గాంధీ ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు  ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్ ద్వివేది అప్పుడే స్పష్టం చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మాత్రం ఈ కమిటీ వల్ల మార్పులు జరిగే అవకాశం ఉందని  ప్రజలకు నచ్చచెబుతూ వస్తున్నారు. అయితే  ప్రత్యేక రాష్ట్రంపై కేంద్ర హోంశాఖ రాజ్యాంగ ప్రక్రియ కొనసాగిస్తూనే ఉంది.

మరో పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణదీక్షకు కూర్చున్నారు. ఆమెకు మద్దతుగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆమరణదీక్షలు ప్రారంభించారు. వారి దీక్షలకు సమైక్యాంధ్ర ప్రజలు అపూర్వమైన రీతిలో సంఘీభావం తెలుపుతున్నారు. కాంగ్రెస్,టిడిపి ప్రజాప్రనిధులు కూడా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు  విభజనకు అంగీకారం తెలిపారు. రాజధానికి ఏర్పాటుకు నిధులు కూడా డిమాండ్ చేశారు. అయితే ఆ పార్టీకి చెందిన సీమాంధ్ర ప్రజాప్రనిధులను మాత్రం ప్రజలు నిలదీస్తున్నారు. ఈ పరిస్థితులలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా దీక్షలు చేయడం మొదలు పెట్టారు. ఇంకోపక్క చంద్ర బాబు బస్సు యాత్ర అంటున్నారు. కాంగ్రెస్ వారైతే ఢిల్లీలో ఏదో హడావుడి చేస్తున్నారు. అధిష్టానం నేతలను, ఆంటోనీ కమిటీని కలుస్తున్నారు. రెండవ ఎస్ఆర్సి - హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం - హైదరాబాద్ ఉమ్మడి రాజధాని - రాయల తెలంగాణ - నదీజలాలు....ఇలా వారి సమస్యలన్నీ ఏకరువు పెట్టారు. కానీ  వారి మాటలు వినేనాధుడు కనిపిచడంలేదు.

ఆంటోనీ కమిటీ ఒక పక్క ఇరు ప్రాంతాల వారి అభిప్రాయాలు తెలుసుకుంటుంటే, మరో పక్క తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దానికి తోడు తెలంగాణకు అన్ని పార్టీలు అనుకూలంగా చెప్పాయని,  కాంగ్రెస్ పార్టీయే చివరగా నిర్ణయం తీసుకుందని దిగ్విజయ్ సింగ్ ఈ రోజు కూడా చెప్పారు.  ఇప్పుడు వారు నిర్ణయం మార్చుకుంటే తామేమీ చేయాలని ఆయన ప్రశ్నించారు. వీరి మాటలు, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులను పరిశీలిస్తే ఆంటోనీ కమిటీ విభజన ప్రక్రియను సులభతరం చేయడానికి నియమించినదిగా అర్ధమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement