ఆర్ట్@సోల్ | art @ soul | Sakshi
Sakshi News home page

ఆర్ట్@సోల్

Published Wed, Apr 1 2015 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 11:38 PM

ఆర్ట్@సోల్

ఆర్ట్@సోల్

మంచు పర్వతాల వెండి వెలుగులు... వాటి మధ్య సరిగంగలు... పొద్దు పొడుస్తున్నా నెలవంక సొగసులు... దానికి విహరించే విహంగాల హంగులు... కనులను తాకిన ప్రతి దృశ్యం చిత్రరంజితమై విరాజిల్లుతోంది. అరవై ఏడేళ్ల వయసులో వేల అడుగుల ఎత్తుకు వెళ్లి చూసిన అపురూపాలెన్నో శ్రీకాంత్ సోమని లెన్స్‌లో ప్రాణం పోసుకున్నాయి. సిరామిక్ కంపెనీ చైర్మన్‌గా నలభై ఐదేళ్ల వ్యాపార అనుభవం. కానీ... నగరాల్లో కన్నా పల్లెల్లో నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్న శ్రీకాంత్ చిత్రాల ఎగ్జిబిషన్... ‘హిమాలయాస్: ల్యాండ్ స్కేప్ ఫర్ ది సోల్’ ఆకట్టుకుంటోంది. బంజారాహిల్స్ కళాకృతి ఆర్ట్ గ్యాలరీలో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసిన ఆయనతో ‘సిటీ ప్లస్’ ముచ్చటించింది.
 
ఈ జర్నీ ఒక్క రోజులో చేసింది కాదు. పుష్కర కాలం పాటు సాగిన ప్రయాణంలో మరపురాని జ్ఞాపకాలు, మధురమైన అనుభవాలను ఇలా భద్రపరిచాను. లడక్, భూటాన్, నేపాల్... ఇలా 18,900 అడుగుల ఎత్తులో ఉన్న పర్వతాల పైకి ట్రెక్కింగ్ చేస్తూ వెళ్లి తీసిన ఫొటోలు కూడా ఉన్నాయి. నేను చూస్తున్న దానిని ఫొటో ద్వారా అందరికీ చూపడం, ఆ క్షణంలో నేను పొందిన అనుభవాన్ని భద్రంగా అందించడం, ఒకరి ముఖంలో కనిపించిన హావభావాలను ఫొటోలో చూపగలగడం... ఇదే పోట్రెయిట్. చూసేవారికి నా అనుభవాన్ని నేరుగా పంచడమే ఫొటో. ఇక్కడ ప్రదర్శనకు పెట్టినవి అలాంటి చిత్రాలే.
 
జర్నీ ఇలా: బద్రీనాథ్ వెళుతున్నప్పుడు మా నాన్నని కెమెరా కొనమని అడిగా. అందుకు ఆయన ‘ఎవరిదైనా కెమెరా అడిగి మంచి ఫొటోలు తీసుకురా... చూస్తా’ అన్నారు. అలా సొంత కెమెరా లేకుండానే ఫొటోగ్రఫీ మొదలుపెట్టాను. ఆ తరువాత చాలా ఏళ్లు ట్రిప్పులు, చిన్న పిల్లలు... ఇలా నా ఫొటోలు ఇంటికే పరిమితమయ్యాయి. అంతకంతకూ ఆసక్తి పెరిగింది కానీ తగ్గలేదు. పదేళ్ల క్రితం టిబెట్‌కు వెళుతున్నప్పుడు... కాస్త బేసిక్స్ నేర్చుకోవడం అవసరమనిపించింది. వారంపాటు నేర్చుకున్నా. బేసిక్ కెమెరా నుంచి ఏడాదిలో ప్రొఫెషనల్ కెమెరా వాడటం వరకు వెళ్లా.
 
మెమరబుల్: ఎత్తయిన పర్వతాల మధ్య ఒంటరిగా నిలుచున్నప్పుడు మనమెంత చిన్నవాళ్లమో అనిపిస్తుంది. అంత ఎత్తులో ఉన్నా, ఎంతలా నిగర్వంగా ఒదిగి ఉన్నాయో అనే ఫీలింగ్. ఇలాంటి అనుభవం ప్రకృతి నుంచి నేర్చుకొనే అవకాశం, అనుభూతిని ఫొటోగ్రఫీ ద్వారా పంచే ప్రయత్నం ఇది. ‘మౌంటేన్ అండ్ పీపుల్’... ఈ రెండింటిలో పర్వతాల్లో ఉండే స్వచ్ఛమైన మనుషులు నా జ్ఞాపకాల్లో ఎప్పుడూ కదలాడుతూనే ఉంటారు. వారి స్వభావం, మంచితనం, నిజాయతీ... మళ్లీ పర్వతాల వైపునకు నడిపిస్తుంటుంది. నగరాల్లో ఉంటూ మనమేదో సాధించేస్తున్నామని, గొప్పవాళ్లమనీ ఫీలింగ్.

కానీ అందులో వాస్తవం లేదు. లాహోర్‌కు వెళ్లినప్పుడు ఓ చిన్న పల్లెటూరులో వాళ్ల మామయ్య వద్ద ఉంటున్న ఓ అమ్మాయిని కలిశా. ఆయన వైద్యుడు. నేను మళ్లీ ఇక్కడికి వచ్చినప్పుడు... ఆయన చేసే మందుల తయారీ గురించి వివరించమని మీ మామయ్యను ఒప్పిస్తావా అని ఆ అమ్మాయిని అడిగా. తను ఏం మాట్లాడలేదు. నన్ను నమ్మినట్టు అనిపించలేదు. ఆరు నెలల తరువాత అక్కడికి మళ్లీ వెళ్లా. అప్పటికే ఆ పేద పిల్ల మా కోసం రూమ్‌లు అరేంజ్ చేసింది. అక్కడ మాటన్నా, మనుషులన్నా అంత నమ్మకం, గౌరవం. ఇలాంటి సంఘటనల వల్ల ప్రపంచంలో పెద్ద మార్పేమీ రాదు... కానీ, కొన్ని అపోహలపై అవగాహన పెరుగుతుంది.
 
ప్యాషన్ మాత్రమే: ఫొటోగ్రఫీ నాకు ప్రొఫెషనలిజమ్ కాదు. దానిపై నాకున్న ప్రేమ మాత్రమే. హిమాలయాల వైవిధ్యం, శోభ కళ్లకు కట్టడం ఈ ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశం. మనం టైమ్‌కు బానిస కాకూడదు. మన కోసం మనం సమయం కేటాయించుకోలేక పోతే... ఓడిపోయినట్టే. ఏడాదిలో రెండు నెలలు నా కోసం బతుకుతాను. దిల్లీలో ఉంటున్నా హైదరాబాద్‌తో పన్నెండేళ్ల అనుబంధం నాది. జీవితం, వ్యాపారాన్ని గొప్పగా మలుచుకోవడానికి అవకాశం ఇచ్చిన నగరం ఇది. నగరంలో ఎంతో మంచి మిత్రులున్నారు.
 ఓ మధు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement